
Nizamabad Government Hospital: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి మరోసారి వార్తలో నిలిచింది. కరోనా సమయంలో ఆస్పత్రి సిబ్బంది కోవిడ్ పేషెంట్‌ను ఆటోలో తరలించారు. తర్వాత ఓ పసికందు మృత్యువాత పడింది. తాజాగా ఆస్పత్రిలో స్ట్రెచర్ లేకపోవడంతో రోగిని బంధువులు కాళ్లు పట్టి లాక్కెళ్లిన దృశ్యం ఇస్పుడు సంచలనంగా మారింది. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు మెరుగు పరుస్తున్నామని, ఆధినిక సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు పదే పదే చెబుతున్నారు. కానీ సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఇందుకు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ.
అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే..
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఉన్న ఓ రోగిని గత నెల 31న అతని బంధువులు తీసుకువచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తరువాత… అతడితో వచ్చిన వారు ఓపీలో రిజిస్టర్ చేయించారు. వారు అతడిని రెండో అంతస్తులో వైద్యుడి వద్దకు వెళ్లాలని ఓపీ రాసిచ్చారు. అనంతరం ఆ వ్యక్తిని లిఫ్ట్ వరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ అవసరం పడింది.
స్ట్రెచర్ కూడా లేక..
ఒక రోజు రాత్రంతా ఆస్పత్రిలోనే ఉన్న రోగి, అతని బంధువులు, వైద్యుడి వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో స్ట్రెచర్ లేకపోవడంతో బంధువులు లిఫ్ట్ వరకు అతని కాళ్లు పట్టి లాక్కెళ్లారు. అక్కడ ఉన్నవారు అది చూసి ఆశ్చర్యపోయారు. రోగి కాళ్లు పట్టి లాగుతున్నా అక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోక పోవటం గమనార్హం. చివరకు లిఫ్ట్‌లో అతడిని రెండో అంతస్తుకు చేర్చాక అక్కడ కూడ స్ట్రెచర్, వీల్ చైర్ అందుబాటులో లేకపోవటంతో అక్కడి నుంచి కూడా వైద్యుడి గది వరకు కాళ్లు పట్టి లాక్కెళ్లారు. స్ట్రెచర్, వీల్‌చైర్ లేకపోవడం, లాక్కెళుతున్నా సిబ్బంది పట్టించుకోక పోవటంపై విమర్శలు వస్తున్నాయి.

బెడ్ షీట్స్, ఫైల్స్ కోసం వినియోగం..
ఆస్పత్రిలో స్ట్రెచర్లు, వీల్‌చైర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని సిబ్బంది వార్డులోకి బెడ్‌షీట్లు తీసుకెళ్లడానికి, వీల్ చైర్లను వార్డుల్లో రోగులకు సంబంధించిన కేస్ షీట్స్‌ను తరలించడానికి వాడుతున్నారు. తాము పది, పదిహేను నిమిషాలే వాటిని వినియోగిస్తున్నామని చెబుతున్నా.. అదే సమయంలో రోగి వస్తే మాత్రం అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నా పట్టించుకోకపోవడం వైద్యులు, సిబ్బందిలో కనీస మానవత్వం లేదనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.