https://oktelugu.com/

AP Politics : బిజెపికి వలస నేతలే దిక్కా?

నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ అనే కొత్త నాయకుడికి బిజెపి టికెట్ ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ రఘురామకృష్ణంరాజు పోటీ చేయాలని భావించారు.కానీ తనకు టిక్కెట్ ఇవ్వాలని శ్రీనివాస్ వర్మ కొద్ది నెలల కిందట దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఈయన కూడా కొత్తగా పార్టీలో యాక్టివ్ అయిన వ్యక్తి.

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2024 9:00 am
    Are migrant leaders the direction of BJP

    Are migrant leaders the direction of BJP

    Follow us on

    AP Politics : దేశవ్యాప్తంగా 111 మంది అభ్యర్థులతో బిజెపి ఐదో జాబితాను విడుదల చేసింది. గెలుపు గుర్రాలనే బరిలో దించుతున్నట్లు చెబుతోంది. అయితే ఏపీకి సంబంధించి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. అయితే అందులో ఒక్కరు కూడా బిజెపి సీనియర్లు లేకపోవడం విశేషం. టిడిపి, జనసేనతో పొత్తులో భాగంగా బిజెపికి ఆరు సీట్లు దక్కాయి. కానీ ఒక్క సీనియర్ ని కూడా అభ్యర్థిగా ప్రకటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనధికారికంగా దాదాపు అన్నట్టుగా వినిపించిన పేర్లే ఖరారు అయ్యాయి. ఇందులో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వారు కానీ.. పదేళ్లుగా బిజెపిలో ఉన్నవారు కానీ కనిపించకపోవడం విశేషం.

    అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు టికెట్ ఖరారు అయింది. 2014లో ఆమె అరకు ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. కానీ కొద్ది రోజులకే బిజెపిలోకి ఫిరాయించారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. సొంతంగా పార్టీ పెట్టి అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు. పట్టుమని 2000 ఓట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఆమె పార్టీని బిజెపిలో విలీనం చేసి అరకు టిక్కెట్టు కొట్టేశారు.

    అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్ కు ఖరారు చేశారు. ఈయన చంద్రబాబు అనుంగ శిష్యుడు. 2014 ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈయనకు రాజ్యసభ సీటు ఇచ్చి చంద్రబాబు గౌరవించారు. క్యాబినెట్ హోదాకు మించి గౌరవం కల్పించారు. కానీ గత ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. దీంతో టిడిపిని కాపాడుకునేందుకు అన్నట్టు బిజెపిలో చేరారు. ఆ పార్టీని తెలుగుదేశం దగ్గరకు చేర్చారు. ఈ ఎన్నికల్లో బిజెపి టికెట్ దక్కించుకున్నారు.

    రాజమండ్రి ఎంపీ స్థానాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి దక్కించుకున్నారు.ఈమె కూడా గత ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు.చంద్రబాబుతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈమె 2014 వరకు ఒక వెలుగు వెలిగారు.అనంతరం వైసిపిలో చేరారు. అక్కడ ఇమడలేక బిజెపిలో చేరిపోయారు. ఎన్టీఆర్ కుమార్తె అన్న మార్కుతో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు టిడిపితో పొత్తులో కీలకంగా వ్యవహరించి రాజమండ్రి ఎంపీ సీటును పొందగలిగారు.

    తిరుపతి ఎంపీ సీటును దక్కించుకున్న వరప్రసాదరావు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యే సీటును ఇవ్వడంతో పోటీ చేసి గెలుపొందారు. ఈయన తొలుతా తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపిలో చేరి తిరుపతి పార్లమెంట్ సీటును దక్కించుకున్నారు. వైసీపీ టికెట్ నిరాకరించిన వ్యక్తికి ఇప్పుడు బీజేపీ టికెట్ దక్కడం విశేషం.

    నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ అనే కొత్త నాయకుడికి బిజెపి టికెట్ ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ రఘురామకృష్ణంరాజు పోటీ చేయాలని భావించారు.కానీ తనకు టిక్కెట్ ఇవ్వాలని శ్రీనివాస్ వర్మ కొద్ది నెలల కిందట దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఈయన కూడా కొత్తగా పార్టీలో యాక్టివ్ అయిన వ్యక్తి.

    రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణంతో రోశయ్య సీఎం అయ్యారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ ఆయనను తప్పించి సీఎం పీఠంపై కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది. అయితే 2014లో రాష్ట్ర విభజనకు కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించారు. సొంతంగా పార్టీని పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రాజకీయంగా సైలెంట్ అయ్యారు.తరువాత కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారు. అక్కడ నుంచి బిజెపిలో చేరారు. ఇప్పుడు ఏకంగా టికెట్ దక్కించుకున్నారు. ఈ లెక్కన బిజెపి ఎంపీ స్థానాలన్నీ వలస పక్షులకు నిండిపోయాయి.