Pawan Kalyan Vizag Tour: ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. జనాల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను వైసీపీ సర్కార్ అడుగడుగునా అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ విశాఖలో ‘జనవాణి’ పేరిట జనాల అభిప్రాయం తెలుసుకోవడానికి నిన్న విశాఖలో దిగారు. ఆయన కోసం అశేష అభిమాన జనం ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. అయితే పవన్ ను ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను జనంలోకే రానీయలేదు. వాహనం నుంచే హోటల్ కు తరలించారు.

పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందని.. చంపేయడానికి చూస్తున్నారని.. అందుకే పవన్ ప్రజల్లోకి వెళ్లడానికి లేదంటూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఆయనపై దాడుల పేరుతో ఇలా ప్రజలకు దూరం చేసే కుట్రను వైసీపీ సర్కార్ చేస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ సర్కార్ ను, తనను అడ్డుకుంటున్న పోలీసులు, అరెస్ట్ చేసిన జనసేన నేతలను విడిచి వెళ్లాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ కదిలేది లేదని విశాఖలోనే పోరాటానికి రెడీ అయ్యారు.
ఈ క్రమంలోనే ఏపీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన నేతలకు 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. సాయంత్రం 4 గంటల్లోగా విశాఖ విడిచి వెళ్లాలని పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన నేతలకు నోటీసులు జారీ చేశారు. పవన్ వల్ల విశాఖలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని.. ఆయన వల్ల ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని వెంటనే వెళ్లిపోవాలని పోలీసులు హుకూం జారీ చేశారు. లేదంటే అరెస్ట్ తప్పదన్న హెచ్చరికలు పంపారు.
సాయంత్రం లోగా పవన్ కళ్యాణ్ వెళ్లకుంటే ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు పోలీసులు. కానీ అక్రమంగా అరెస్ట్ చేసిన జనసైనికులను వదిలిపెడితే తప్ప తాను వెళ్లనని పవన్ భీష్మించారు. దీంతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం జరుగుతుందన్నది ఉద్రిక్తంగా మారింది.