Homeఆంధ్రప్రదేశ్‌AP New Cabinet Ministers: అమాత్యులు.. ఊరికే కాలేదు.. అందలం వెనుక సుదీర్ఘ పోరాటం

AP New Cabinet Ministers: అమాత్యులు.. ఊరికే కాలేదు.. అందలం వెనుక సుదీర్ఘ పోరాటం

AP New Cabinet Ministers: ‘ఊరికే మంత్రులుగా కాలేదు. ఆ అందలం వెనుక అలుపెరగని కష్టం ఉంది. అవిశ్రాంత పోరాటం ఉంది.. చిటికెల్ లో ముక్కు మొఖం తెలియని వారు మంత్రులయ్యారని విమర్శలున్నాయి. విడుదల రజినీలాంటి వారు రాజకీయాల్లో దూసుకొచ్చి పిన్న వయసులోనే కీలక శాఖలు కొట్టేశారు. ఇక సీనియర్లు ఎంతో మంది ఎంతో కష్టం చేసి ఈ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఏపీ కొత్త కేబినెట్ లో కొలువుదీరిన కొత్త మంత్రులు ఈ స్థాయికి ఎదగడం వెనుక సుధీర్ఘ పోరాటం ఉంది. వారి ఎదుగుదలపై ప్రత్యేక కథనం..

AP New Cabinet Ministers
AP New Cabinet Ministers

కొత్త మంత్రుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. ఇందులో విద్యాధికులు ఉన్నారు. కింది స్థాయి సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వారూ ఉన్నారు. అనూహ్యంగా రాజకీయ పదవులు దక్కించుకున్న వారూ ఉన్నారు. కేబినెట్లో వయసు దృష్ట్యా నారాయణస్వామి అత్యంత సీనియర్.. ఇక కొత్తగా మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజనీ అత్యంత పిన్న వయస్కురాలు. అటు జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో పనిచేసి.. ఆ తర్వాత ఆయన కుమారుడితో నడిచిన వారూ ఉన్నారు.

Also Read: AP New Cabinet: వైసీపీలో తప్పిన క్రమశిక్షణ.. సీఎం జగన్ లో కలవరం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు సర్పంచ్ గా రాజకీయ అరంగేట్రం చేశారు. పోలాకి మండలం మబగాం గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాదరావు 1958 మే 21న జన్మించారు. 1983లో మబగాం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1987లో పోలాకిఎంపీపీగా పనిచేశారు. 1987లో తొలిసారి నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నేదురమల్లి జనార్దనరెడ్డి హయాంలో 1991 నుంచి 94వరకు చేనేత, మధ్యతరహా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలుపొంది 2009 వరకు రెవెన్యూ మంత్రిగా వైఎస్సార్‌ కేబినెట్‌లో పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేశారు. 2014లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2019లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు.

Dharmana Prasada Rao
Dharmana Prasada Rao

నెల్లూరు జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం పొదలకూరు మండలం తోడేరు. తండ్రి రమణారెడ్డి 18 ఏళ్లపాటు పొదలకూరు సమితి అధ్యక్షుడిగా, తల్లి లక్ష్మీకాంతమ్మ 25 ఏళ్లపాటు తోడేరు సర్పంచిగా పని చేశారు. 1964 నవంబరు 10న పుట్టిన గోవర్ధన్‌రెడ్డి మైసూరు యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌, దూరవిద్య ద్వారా పెరియార్‌ యూనివర్సిటీలో ఎంబీఏ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టభద్రులయ్యారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. 2006 జడ్పీటీసీ ఎన్నికల్లో సైదాపురం నుంచి పోటీచేసి గెలిచారు. ఏకగ్రీవంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు పదో తరగతి వరకూ మాత్రమే చదువుతుకున్నారు. ఆయన రాజకీయరంగ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. 2006లో ద్వారకాతిరుమల జడ్పీటీసీగా గెలిచి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2014లో దెందులూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019లో తణుకు నుంచి గెలిచారు. తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

Karumuri Venkata Nageswara Rao
Karumuri Venkata Nageswara Rao

స్వతహాగా వ్యాపారస్థుడైన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. ఇంటర్‌ వరకు చదివిన ఆయన తండ్రి బాటలోనే వ్యాపారం మొదలు పెట్టారు. 1994లో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2004లో తాడేపల్లిగూడెం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 2009, 2014లో మాత్రం ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. జగన్ కేబినెట్లో పోర్టు పోలియో సాధించారు.

Kottu Satyanarayana
Kottu Satyanarayana

బంగారం వ్యాపారి అయిన తణుకు ఎమ్మెల్యే సుదీర్ఘ విరామం పోరాడి మంత్రి అయ్యారు. ఆయన తాత నరసయ్య ప్రముఖ బంగారం వ్యాపారి. అటు తరువాత తండ్రి శంకరరావు అదే వ్యాపారాన్ని కొనసాగించారు. వారి వారసత్వంగా వ్యాపారం ప్రారంభించిన రాజా చిరంజీవి అంటే వల్లమానిన అభిమానం. అదే ఆయన రాజకీయ జీవితానికి పునాది వేసింది. ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసిన రాజా తదనంతర పరిస్థితులతో వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి యనమల రామక్రిష్టుడు సోదరుడు క్రిష్ణుడుపై గెలుపొందారు.

వార్డు సభ్యుడిగా కెరీర్ ప్రారంభించిన బూడి ముత్యాల నాయుడు అనూహ్యంగా మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవిని సొంతం చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ముత్యాలనాయుడు 1981లో రాజీవ్‌గాంధీ గ్రామ యువజన సంఘం అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. యూత్‌ కాంగ్రె‌స్ లో జిల్లా, రాష్ట్రస్థాయి పదవులు నిర్వహించారు. 1984లో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. కొణతాల రామకృష్ణతో కలిసి ‘రైవాడ నీరు రైతులకే’ అనే నినాదంతో పాదయాత్ర చేశారు. 2006లో కొత్తపెంట ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. 2008లో దేవరాపల్లి ఎంపీపీ పదవి చేపట్టారు. వైఎస్‌ మరణం తరువాత 2010లో వైసీపీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించి ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. తాజా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.

budi mutyala naidu
budi mutyala naidu

వైన్ షాపు లెక్కల చూసేందుకు విజయవాడ వచ్చిన జోగి రమేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి అమాత్య పదవిని అందిపుచ్చుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన జోగి రమేశ్‌ డిగ్రీ పూర్తయిన తర్వాత తన బంధువుల వైన్‌ షాపుల్లో లెక్కలు రాసే పని నిమిత్తం విజయవాడలో పనిచేశారు. లగడపాటి రాజగోపాల్‌ ఎంపీగా పనిచేసిన కాలంలో జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని జోగికి ఇప్పించారు. వైఎస్‌ హయాంలో 2009లో కాంగ్రెస్‌ తరపున పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మైలవరం నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. 2019లో పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పడు కేబినెట్ లో బెర్త్ ఖాయం చేసుకున్నారు.

Jogi Ramesh
Jogi Ramesh

జీసీసీ ఉద్యోగి అయిన రాజన్నదొర అనూహ్యంగా 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి నుంచీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి విధేయుడుగా ఉన్నారు. సీఎం జగన్‌ వద్ద కూడా అలానే కొనసాగారు. 1985లో గిరిజన సహకార సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2004 ఫిబ్రవరి 29న ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అదే సంవత్సరం కాంగ్రెస్‌ పార్టీ తరఫున సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనూహ్యంగా 2006 మార్చి 9న కోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Rajanna Dora
Rajanna Dora

పాఠాలు చెప్పే ప్రొఫెసర్ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టారు మేరుగు నాగార్జున. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరుకు చెందిన మేరుగ నాగార్జున రాజకీయాల్లోకి రాకముందు ఆంధ్రా యూనివర్సిటీలో కామర్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2007లో ఆయన ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌గానూ పనిచేసిన ఆయన 2009, 2014లో వేమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019లో విజయం సాధించారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్‌ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

Merugu Nagarjuna
Merugu Nagarjuna

వాయిస్ ఉన్న నేతగా పేరు తెచ్చుకున్న అంబటి రాంబాబు న్యాయవాద వ్రత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో బీఎల్‌ పూర్తి చేసిన రాంబాబు న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 1988లో జిల్లా లీగల్‌సెల్‌ కన్వీనర్‌గా నియమితులయ్యారు. 1989లో రేపల్లె నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో తిరిగి సత్తెనపల్లి నుంచే పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ వాయిస్ వినిపించడంలో ముందుండే వారు. ఎన్నో రకాల మైనస్ లు ఉన్నా.. జగన్ మాత్రం ఆయనకు కేబినెట్లో చోటిచ్చారు.

Ambati Rambabu
Ambati Rambabu

రాష్ట్ర రాజకీయాల్లో అంతగా వినిపించని కురుబ విరుపాక్షప్పగారి ఉషశ్రీ చరణ్‌ అనూహ్యంగా పదవి పొందారు. 2012లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సామాజిక సేవా కార్యక్రమాలూ కొనసాగిస్తున్నారు. 2019లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

K. V. Ushashri Charan
K. V. Ushashri Charan

సుదీర్ఘ పోరాటం తరువాత తాను కలలు కన్న మంత్రి పదవిని దక్కించుకున్నారు ఆర్కే రోజా. ఆమె సొంతూరు చిత్తూరు జిల్లాలోని చింతపర్తి. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. కూచిపూడి కూడా నేర్చుకున్న ఆమె సినిమాల్లో రంగప్రవేశానికి ముందు నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. 1991లో సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లోనూ ఆమె నటించారు. 1999లో రాజకీయ రంగప్రవేశం చెశారు. తొలుత తెలుగుదేశం పార్టీలో ఆమె చేరారు. 2004లో నగరి, 2009లో చంద్రగిరి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 2019లలో నగరి నుంచి రెండుసార్లు గెలుపొందారు.

ROJA
ROJA

చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకున్నారు గుడివాడ అమర్ నాథ్. గుడివాడ గురునాథరావు వారసుడిగా తెరపైకి వచ్చారు. అమర్‌ 2007లో టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఫ్లోర్‌ లీడరుగా పనిచేశారు. 2011లో వైసీపీలో చేరారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జిగా పనిచేశారు. 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విలక్షణ రాజకీయ శైలితో ముందుకు సాగిన విడదల రజనీకి అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది.

gudivada amarnath
gudivada amarnath

విడదల రజనీ 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 15వ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలిగా ఉన్న ఆమెకు మరో అరుదైన అవకాశం దక్కింది. 31 ఏళ్లకే అమె మంత్రిగా పెద్ద బాధ్యతనే మోస్తున్నారు.

Vidadala Rajini
Vidadala Rajini

ఇలా ఏపీ మంత్రుల్లో కష్టపడి పైకొచ్చిన వారున్నారు. ఇక అనూహ్యంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చి మంత్రిపదవులు కొట్టినవారున్నారు. ఎవరికి వారు వారి విలక్షణత, దూకుడుతో ఈ అందలం ఎక్కారు.

Also Read:Minister Roja: రోజా సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా చేసిన నటీనటులు వీరే..

Exit mobile version