Anti BJP Alliance : జాతీయ రాజకీయాల్లో ఏపీ పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కర్నాటకలో ఓటమి తరువాత బీజేపీ వ్యతిరేక కూటమి బలపడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో పొరపాటున బీజేపీ కానీ ప్రతికూల ఫలితాలు వచ్చినా.. అనూహ్యంగా కాంగ్రెస్ బలం పెంచుకున్నా బీజేపీ వ్యతిరేక కూటమి ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశముంది. అటువంటి సమయంలో ఏపీ పాత్ర ఏమిటన్నది అర్ధం కావడం లేదు. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న వైసీపీ, టీడీపీ మోదీ సర్కారుకు అనుకూలంగా ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం బాహటంగానే బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. వైసీపీ మాత్రం అందుకు కాస్తా విరుద్ధమని చెబుతోంది.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో స్నేహం చేస్తున్నామని జగన్ చెబుతున్నారు. అంతవరకూ పర్వాలేదు.. కానీ మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక చర్యలపై కూడా నోరు మెదపడం లేదు. ఈ విషయంలో జగన్ తరువాత సీఎం అయినా స్టాలిన్ బీజేపీ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. యూపీఏ కూటమిలో బలమైన ప్రాంతీయ పార్టీగా డీఎంకేను నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మదగిన మిత్రుడుగా కొనసాగుతున్నారు. జగన్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క విషయంలో కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు.
రాజకీయ చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు, ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్ ఉన్నా బీజేపీ వ్యతిరేక శిబిరం మాత్రం ఏపీని అస్సలు పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల ముందు వరకూ నిలకడ నిర్ణయాలతో ముందుకు సాగిన చంద్రబాబు వైసీపీ విసిరిన పాచికతో తప్పులో కాలేశారు. ఏకంగా కూటములను మార్చుతూ చేతులు కాల్చుకున్నారు. 2018లో కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆ తరువాత అది తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తులకు దారితీసింది. రాహుల్ గాంధీతో వేదిక పంచుకునే స్థాయికి బంధం చేరింది.
2019 ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబుకు తత్వం బోధపడింది. కాంగ్రెస్ ను దూరంగా ఉంచేలా చేసింది. నాలుగేళ్లుగా బీజేపీ వ్యతిరేక శిబిరం సమావేశాలకు ఆహ్వానం అందినా చంద్రబాబు హాజరుకావడం లేదు. దీంతో బాబును జాతీయ స్థాయిలో పట్టించుకునే వారు లేకపోయారు. చంద్రబాబు సైతం మోడీని తరచూ పొగుడుతూ వస్తున్నారు. ఇది వ్యతిరేక కూటమికి కంటగింపుగా మారుతోంది అని అంటున్నారు.ఈ నెల 20న కర్నాటకలో అంగరంగ వైభవంగా కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం జరగనుంది. దానికి దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలను ఆహ్వానిస్తున్నారు. కానీ బాబుని మాత్రం దూరం పెడుతున్నారని ప్రచారం సాగుతోంది.
కేంద్రంలో మూడవసారి బీజేపీ అధికారంలోకి రావడం అంత సులువు కాదని చంద్రబాబు లాంటి రాజకీయ దిగ్గజాలకు అర్ధం కాదని ఎవరూ అనుకోరు. ఇక కర్నాటకలో కాంగ్రెస్ ది అద్భుత విజయం. తెలంగాణాలో కూడా కాంగ్రెస్ కి అనుకూల పవనాలు వీస్తున్నాయి. అక్కడ కనుక కాంగ్రెస్ గెలిస్తే మాత్రం దేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. దానికి నాందిగా కర్నాటకలో మోడీ వ్యతిరేక కూటమి అంతా ఒక్కటి అవుతోంది. అయితే అందులో ఏపీకి ప్రాతినిధ్యం లేకపోవడం కాస్తా లోటే. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీలో ఏదో ఒక పార్టీ ఆ శిబిరంలో దూకాల్సిన అనివార్య పరిస్థితి ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.