Chandrababu: చంద్రబాబుపై ఒక ముద్ర ఉంది. ఆయన హయాంలో ప్రకృతి సహకరించదన్న అపవాదు ఉంది. అతివృష్టి, అనావృష్టితో ప్రజలు అల్లాడిపోతారని ఇప్పటికీ విపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయితే అందుకు తగ్గ ఉదాహరణలున్నాయనుకోండి. చంద్రబాబు ఏలుబడిలో చాలాసార్లు కరువూ కాటకాలు సంభవించాయి. ఉమ్మడి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రైతులే స్వచ్ఛందంగా క్రాఫ్ హాలీడే గా ప్రకటించిన సందర్భాలున్నాయి. ఆ మచ్చ ఉండగానే చంద్రబాబుపై మరో మచ్చ ఏర్పడింది. చంద్రబాబు అడుగుపెడితే ప్రాణాలు పోతుండడం కొత్త అపవాదు. పోనీ ఇదేదో విపక్షాలు ప్లాన్ చేసినవంటే అదీ కాదు. తనకు పెరిగిన ఆదరణ చూసి ప్రజలు తాండోపతండాలుగా వస్తున్నారని మొన్నటివరకూ చెప్పుకొచ్చిన చంద్రబాబు.. కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతుండడంతో ఇప్పుడు ఆ మాట కూడా చెప్పలేకపోతున్నారు. టీడీపీకి పెరిగిన గ్రాఫ్ ను చూపెట్టే ప్రయత్నంలోనే చంద్రబాబు మనుషుల ప్రాణాలను తీస్తున్నారని మరో వైపు వైసీపీ శ్రేణులు ప్రచారం ప్రారంభించాయి. గల్లీ నేతల నుంచి సీఎం వరకూ ఇప్పుడు చంద్రబాబే టార్గెట్అయ్యారు. టీడీపీ ఏలుబడిలో గోదావరి పుష్కారాల్లో 30 మంది మృతి ఘటనను గుర్తుచేసి మరీ ప్రచారం మొదలుపెట్టారు.

ఏపీలో టీడీపీ బలం పుంజుకుంటున్న క్రమంలో ఆ పార్టీ మూడడుగులు ముందుకేస్తే.. ఏడడుగులు వెనక్కి లాగేసినట్టుంది పరిస్థితి. మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది మంది చనిపోతే.. గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో చంద్రబాబు ఏరికోరి విమర్శనాస్త్రాలను విపక్షాలకు అందించారు. అయితే ఈ ఇష్యూను ఇతర రాజకీయ పక్షాలు వాడుకోవు కానీ.. వైసీపీ ఊరుకుంటుందా? వారికి ఇప్పుడు అదే పని. నాడు పంటలను నాశనం చేశాడు.. నేడు మనుషుల ప్రాణాలు తీస్తున్నాడని ఊరూవాడ ప్రచారం చేశారు. ఆయన అడుగుపెట్టిన ప్రాంతం మరణ నిలయంగా మారుతుందని ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సభ అంటే ప్రాణాలు పోగొట్టే డెడ్ స్పాట్ గా చూపేందుకు వైసీపీ ఇప్పుడు తెగ ఆరాటపడుతోంది.
అయినా కందుకూరు ఘటనతోనైనా చంద్రబాబు గుణపాఠం నేర్చుకున్న పరిస్థితి లేదు. తన సభలు, రోడ్ షోలకు జనాలు వస్తున్నారని చూపేందుకు చేసే ఆరాటం.. ప్రజారక్షణకు చూడలేదని.. ఇదేనా మీ సినియార్టీ, సిన్సియారిటీ అని వైసీపీ బ్యాచ్ ప్రశ్నించే స్థాయికి చేరుకోవడం ఆయనకు మైనస్సే. చంద్రబాబు సభలో వరుస ఘటనల్లో మనుషుల ప్రాణాలు కోల్పోవడంతో ఇదేం ఖర్మ అన్న టీడీపీ వినూత్న కార్యక్రమాన్ని వైసీపీ తిప్పికొడుతోంది. చంద్రబాబు సభలో జనాలకు ఇదేం ఖర్మ అని రివర్స్ కౌంటర్ ఇస్తోంది. బాబు పాదం మోపితే జనాలు ప్రాణాలు కోల్పోవలసిందేనా? అనే ఆవేదన, అక్రోషం ప్రజల నుంచి వచ్చే దాకా పరిస్థితిని చంద్రబాబు తెచ్చుకున్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ఒక శాపమని ప్రత్యర్థులు ప్రచారం చేసేలా అస్త్రాన్ని అందించారు. సహజంగా పిల్లగాలికి చెట్టుకొమ్మ ఊగితే ఊరుకోని రకం జగన్ అండ్ కో. దీనిని మానవీయ కోణంలో చూస్తారని భావించడం భ్రమే అవుతుంది.

తామిచ్చే పథకాలతో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారనుకున్న జగన్ కు ఇది కనువిప్పు ఘటనే. పండుగ పూట ఇల్లు గడిచేందుకు నిత్యవాసరాలు ఇస్తామన్న ప్రకటన చూసి అన్నివేల మంది ఒకేసారి రావడం దేనికి సంకేతం. అయితే ఇలా వచ్చిన వారు టీడీపీ వారు అనుకుంటే అది పొరబడినట్టే. పేదలని సాక్షి మీడియా చెబుతుంటే కచ్చితంగా ఈ ఘటన అటు చంద్రబాబు, ఇటు జగన్ కు కనువిప్పు కావాలి. అది టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఏర్పాటుచేసింది కాబట్టి.. చంద్రబాబు హాజరైన కార్యక్రమం కాబట్టి దానికి ఆయనే బాధ్యులవుతున్నారు. కానీ వేలాదిగా వచ్చిన ప్రజలు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు సంతృప్తి చెందడం లేదన్న విషయం గ్రహించాలి. తాత్కాలికంగా చంద్రబాబుకు ఈ ఘటన దెబ్బగా పరిగణించవచ్చు. కానీ ఇండైరెక్ట్ గా జగన్ కు ఇది ప్రమాద ఘంటికే. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం చంద్రబాబు తనకు తాను ఆలోచించుకోవాలి. తాను వెళ్లబోయే ప్రాంతాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న మాట నిజం. ఈ సమయంలో మాత్రం జన సమీకరణలతో సభలు, సమావేశాలు అంటే కాస్తా ఆలోచించుకుంటే బెటర్. లేకుంటే టీడీపీని పైకెత్తే క్రమంలో మరింత కిందకు పడిపోవడం ఖాయం.