
Modi vs Khalistani : ఆ మధ్య పంజాబ్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసేందుకు మోదీ వెళ్లాడు. అత్యంత సీక్రేట్‌గా ఉండాల్సిన ఈ విషయం ఖలీస్థానీలకు తెలిసింది. మోదీ వెళ్తున్న రోడ్డుమార్గాన్ని వారు బ్లాక్ చేశారు. ‘మాకు ఖలీస్థానీ దేశం కావాలి’ అంటూ నినాదాలు చేశారు. దాదాపు మోదీని అరగంట సేపు రోడ్డు మీదే ఉంచారు. బ్లాక్ కమెండోలు అప్పటికప్పుడు అప్రమత్తం కాకుంటే మోదీ మరో ఇందిరఅయ్యేవారు. వెంటనే రక్షణ శాఖ హెలీకాప్టర్ తీసుకురావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ‘మీ కాంగ్రెస్ ముఖ్య మంత్రికి చెప్పండి ప్రాణాలతో బయటపడ్డానని’ అంటూ మోదీ ట్వీట్ కూడా చేశాడు. ఈ చిన్న ఉదాహ రణ చాలు దేశంలో ఖలీస్థానీయులు ఏలా వేళ్లూనుకున్నారో చెప్పేందుకు.. అక్కడి దాకా ఎందుకు గత ఏడాది ఢిల్లీలో రైతు ఉద్యమం జరిగినప్పుడు ఆ పంజాబీయులు ఎలా రెచ్చిపోయారో, ఖలీస్థానీ జెండా లు ఎలా ఎగరేశారో చూశాం కదా! అసలు ఆ ఉద్యమం మాటున వేర్పాటువాద నినాదాలు, కెనడా నుంచి వచ్చిన నిఽధులు, రాకేష్ టికాయత్ లాంటి వారు చేసిన ప్రకటనలు ఇప్పటికీ గుర్తుకే ఉన్నాయి. ఓ సెక్షన్ మీడియా అసలు నిజాలను దాచి వేరే విషయాలకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల చాలా మంది దాన్ని రైతు ఉద్యమమని, మోదీ ప్రభుత్వం అణగదొక్కుతోందని నమ్మారు. కానీ జరిగింది వేరు. జనానికి చెప్పింది వేరు. ఇప్పుడు దాని అసలు రంగు బయట పడుతోంది.
మీకూ ఇందిర గతే పడుతుంది
మోదీ, అమిత్ షా మమ్మల్నెవరూ ఆపలేరు. ఇందిరా గాంధీనే విఫలమయ్యారు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని అడ్డుకుంటే అమిత్ షాకూ ఇందిర గతే పడుతుంది. ఈ స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ఖలిస్థాన్ ఉగ్రవాది భింద్రన్ వాలే అనుచరుడిగా చెప్పుకొంటూ అమృత్‌పాల్ సింగ్ అనే వ్యక్తి హడావుడి చేస్తున్నాడు. ఇతడి అనుచరులు గురువారం తల్వార్లు, కర్రలతో అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై దాడికిదిగిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. అపహరణ కేసులో అరెస్టయిన అమృత్ పాల్ అనుచరుడు తూఫాన్ సింగ్ విడుదల కోరుతూ విధ్వంసం రేపారు. 29 ఏళ్ల అమృత్‌పాల్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ పరిణామాలు ఆందోళనకరంగా ఉండడంతో కేంద్రం నిశితంగా గమనించాలని నిర్ణయుంచింది. అమృత్‌పాల్‌పై దృష్టిపెట్టాలని పంజాబ్ సర్కారును కోరింది.
భింద్రన్‌వాలా లాగే..
జల్లూపూర్‌లో పుట్టిన అమృత్‌పాల్ ఏడాది వరకు దుబాయ్‌లో ఉన్నాడు. కుటుంబానికి చెందిన రవాణా వ్యాపారాన్ని చూసేవాడు. పంజాబీ సంప్రదాయాలనూ పాటించేవాడు కాదు. పంజాబీ నటుడు, వారిస్ పంజాబ్ దే (పంజాబ్ వారసులు) వ్యవస్థాపకుడు దీప్ సిద్ధూ 2022 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో.. దక్కిన అవకాశాన్ని అమృత్‌పాల్ వాడుకున్నాడు. స్వరాష్ట్రానికి తిరిగొచ్చి వారిస్ బాధ్యతలను చేపట్టాడు. ఇతర ఖలిస్థాన్ వేర్పాటు నాయకుల్లా విదేశాల నుంచి కాకుండా.. పంజాబ్‌లోనే ఉంటూ సానుభూతిపరులను ఆకర్షించడం మొదలుపెట్టాడు. అంతే కాదు కెనడా నుంచి భారీగా విరాళాలు సేకరిస్తున్నాడు. ఇక్కడి యువతను రెచ్చగొడుతున్నాడు.
నీలి రంగు పగిడీ, తెల్లటి దుస్తులు
కరుడుగట్టిన ఖలిస్థాన్ వేర్పాటువాది భింద్రన్‌వాలే తరహాలో.. నీలి రంగు పగిడీ, తెల్లటి దుస్తులను ధరించే అమృత్‌పాల్.. అతడిలాగే దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాపింపచేస్తున్నాడు. ఖలిస్థాన్ గురించి యువతకు నూరిపోసి వారిస్ దే పంజాబీని విస్తరిస్తున్నాడు. అందుకే అమృత్‌పాల్‌ను ఆయన అనుచరులు భింద్రన్‌వాలే- 2గా నూ పిలుస్తుంటారు. అయితే, అమృత్‌పాల్ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎ్‌స్‌ఐ అజెండాలో వెళ్తున్నాడని సిక్కు ప్రముఖులు తప్పుబడుతున్నారు. పైగా ఇందిరాగాంధీ హయాంలో భింద్రన్‌వాలే ఎలా వ్యవహరించాడో.. ఇప్పుడు తాను కూడా అలానే చేస్తానని సవాల్ విసురుతున్నాడు. అంతే కాదు మమ్మల్ని అడ్డుకుంటే చంపేస్తామని హెచ్చరిస్తున్నాడు.
దాడి చేశారు
సిక్కుల పార్టీగా చెప్పుకొనే అకాళీదళ్ నిరుటి పంజాడ్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితమైంది. కానీ ఖలీస్థాన్ వేర్పాటు వాదుల సహకారంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఖలిస్థాన్ వేర్పాటువాద గళం మళ్లీ బలంగా వినిపిస్తోంది. పేరుకు ఆప్ ప్రభుత్వం ఉన్నది కానీ.. పాలన నిర్వహిస్తోంది మొత్తం ఖలీస్థానీయులే. వారి ఆగడాలు పెరిగిపోవడంతో ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటన్నారు. అంతే కాదు పంజాబీయుల్లో ఓ వర్గం వారు కెనడాలో ప్రత్యేక ఖలిస్థాన్ కోసం ఏకం గా రెఫరెండమే నిర్వహించారు. ఆస్ట్రేలియాలో అయితే భారత గణతంత్ర దినోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న యువకులపై ఖలిస్థాన్ మద్దతుదారులు కొందరు దాడికి కూడా దిగారు. బ్రిస్బేన్‌లో భారత కాన్సులేట్ వద్ద ఖలిస్థాన్ జెండా ఎగురవేశారు.
ఆప్ చేష్టలుడిగి చూస్తోంది
ఎప్పుడయితే ఖలీస్థానీయుల మద్దతుతో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆప్ చేతిలో నుంచి పంజాబ్ చేయి జారిపోవడం ప్రారంభమైంది. పాలనలో ఖలీస్థానీయుల జోక్యం పెరిగింది. గురువారం తుఫాన్ సింగ్ విడుదల కోసం ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే దాడి చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రభుత్వం దిగి వచ్చి అతడిని విడుదల చేసిందంటే ఆప్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు పోలీస్‌స్టేషన్‌పై దాడికి సంబంధించిన వీడియోలను చూసిన నెటిజన్లు మోదీ వేర్పాటు వాదులపై ఉక్కుపాదం మోపాలని, ఇందిర మాదిరే ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.