
Chandrababu Naidu: ఏపీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయులతో పాటు ఎమ్మెల్యేల కోటా కింది ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పోరు ఏకపక్షంగా ఉండే చాన్స్ కనిపిస్తోంది. అధికార పార్టీకి మెజార్టీ ఉండడమే ఇందుకు కారణం. అటు ఎమ్మెల్యేల కోటా కింద ఏడు ఎమ్మెల్సీలను సైతం సునాయాసంగా కైవసం చేసుకోనుంది. గత ఎన్నికల్లో 151 స్థానాలను గెలుపొందడంతో పాటు టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే చేరడంతో అధికార పార్టీ బలం 156కు పెరిగింది. దీంతో తాజాగా జరుగుతున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలు సైతం వైసీపీ ఖాతాలో పడతాయి. అయితే అనూహ్యంగా టీడీపీ ఒకస్థానానికి పోటీ చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధాను డిసైడ్ చేశారు. ఆమెతో నామినేషన్ వేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఎమ్మెల్సీ స్థానం గెలుపొందేందుకు టీడీపీకి సంఖ్యాబలం చాలదు. గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో గెలుపొందింది. కానీ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరారు. తటస్థులుగా చలామణి అవుతూ వైసీపీకి దగ్గరగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే పార్టీ ఫిరాయించిన ఆ నలుగురుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరుతున్నా.. అందరూ లైట్ తీసుకున్నారు. గతంలో వైసీపీ నుంచి 23 మందిని పార్టీలోకి తీసుకొని.. అందులో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. దాంతో పోల్చుకొని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోట కింద జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను చంద్రబాబు బ్రహ్మాస్త్రంగా తీసుకున్నారు.
వైసీపీలోకి ఫిరాయించిన వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ జారీ చేయడానికి డిసైడ్ అయ్యారు. దీని ద్వారా రెండు వ్యూహాలను చంద్రబాబు అమలుచేస్తున్నారు. ఒక వేళ ఓటింగ్ కు వారు దూరమైతే.. ఆ నలుగురుపై వేటు వేయాలని స్పీకర్ ను కోరుతారు. ఒక వేళ ఓటింగ్ కు వచ్చి పార్టీ అభ్యర్థికి ఓటు వేయకుంటే ఆ నలుగురు వల్లేనంటూ ప్రచారం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావును అడ్డం పెట్టుకొని అనర్హత వేటును పక్కనపడేశారు. ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం ద్వారా ఆ నలుగురిపై కూడా ఎటువంటి చర్యలు ఉండవు. అయితే చంద్రబాబు ఏదో వ్యూహంతోనే ఓ మహిళా అభ్యర్థిని బరిలో దించుతున్నారు. ఇదో ప్రచార అస్త్రానికి వాడుకునేందుకు సిద్ధపడుతున్నారు. పార్టీ ఫిరాయింపులు చూసి బోరు కొట్టిన ప్రజలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. అటువంటప్పుడు చంద్రబబు స్ట్రాటజీ ఏ విధంగా వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.