Lal Krishna Advani: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న అవార్డు లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్కే అద్వానీ గొప్ప రాజకీయ వేత్తగా అభివర్ణించారు. దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర మరువరానిదని చెప్పుకొచ్చారు. అద్వానికి భారతరత్న ప్రకటనతో దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. అద్వానికి ఇన్నాళ్లకు సముచిత స్థానం దక్కిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిజెపి ఈ స్థాయి విస్తరణకు అద్వానీ కూడా ఒక కారణం. రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ఈ స్థాయికి రావడం వెనుక అద్వానీ కృషి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న సింధ్ ప్రాంతంలోని కరాచీ సంపన్న కుటుంబంలో అద్వానీ జన్మించారు. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న అద్వానీ కుటుంబం భారత్ కు తరలివచ్చింది. ఇంజనీరింగ్ చదువుతున్న అద్వానీ.. చదువుకు స్వస్తి పలికి ఆర్ఎస్ఎస్ లో చేరారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జన్ సంఘ్ లో పనిచేశారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఎన్నికల్లో జనసంఘ్ నుంచి తొలిసారిగా పోటీ చేసిన అద్వానీ విజయం సాధించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్ జనతా పార్టీలో విలీనం అయ్యింది. 1977లో జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రధాని మొరార్జీ దేశాయ్ క్యాబినెట్ లో లాల్ కృష్ణ అద్వానీ సమాచార శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. జనతా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఆ పార్టీ కూడా పతనమైంది. అప్పుడే జన సంఘ్ నుంచి వేరుపడి భారతీయ జనతా పార్టీ ఏర్పడింది.
1982 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే దక్కాయి. 1986లో బిజెపి జాతీయ అధ్యక్షుడిగా అద్వానీ పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. 1989 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 86 స్థానాలు దక్కించుకోవడం వెనుక అద్వానీ కృషి ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ధీటుగా బిజెపి తయారయ్యింది. 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ దేవాలయం నుంచి అద్వానీ చేపట్టిన రథయాత్రతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఏకంగా 120 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2005 వరకు అద్వానీ పలుమార్లు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004లో బిజెపి ఓడిపోవడం, ఒక్కో రాష్ట్రంలో అధికారానికి దూరం కావడంతో అద్వానీ చరిత్ర మసకబారింది.
అయితే బిజెపికి మూల స్తంభంగా అద్వానీ నిలిచారు. బిజెపికి జవసత్వాలు నింపి ఈ స్థాయికి రావడం వెనుక ఆయన పాత్ర ఎనలేనిది. 2014లో బిజెపి అధికారంలోకి రావడంతో అద్వానీ మరోసారి క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అంతా భావించారు. రాష్ట్రపతి పదవికి ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది. కానీ అప్పట్లో ప్రధాని మోదీ తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. మరో అధికార కేంద్రంగా మారతారని భావించి ప్రధాని మోదీ అడ్డుకున్నట్లు టాక్ నడిచింది. అయితే ఇన్నాళ్లకు ఆ కురువృద్ధుడికి భారతరత్న అవార్డు దక్కడం విశేషం. ప్రస్తుతం వయోభారంతో బాధపడుతున్న అద్వానీకి స్వయంగా ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. భారతరత్న ప్రకటించిన విషయాన్ని తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపారు. రెండు స్థానాల నుంచి బిజెపికి ఈ స్థాయి విజయం అందించడం వెనుక అద్వానీ కృషి ఉందని సగటు బిజెపి అభిమాని అభిప్రాయపడుతున్నారు. అటువంటి రాజ నీతిజ్ఞుడికి భారతరత్న ప్రకటించడం ఔన్నత్యమే అని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Advani is the reason bjp is at this level
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com