KCR VS ABN RK
KCR VS ABN RK: కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలుగ నేరవు. ఆ కూరిమే విర సంబైనన్ నేరములే గలుగుచుండు నిక్కముసుమతి.. శతకారుడు వెనుకటికి రాసిన పద్యం ఇది. ఈ పద్యం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. ఎందుకంటే కెసిఆర్ ప్రభుత్వంతో మొన్నటిదాకా స్నేహం కొనసాగినప్పుడు అతడి పాలనకు ఎదురేలేదు అని రాసుకొచ్చిన రాధాకృష్ణ.. అకస్మాత్తుగా లైన్ మార్చాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య పరస్పరం కాల్పులు జరుగుతున్నాయి. కుల, గుల పత్రిక అంటూ కేసిఆర్ మొన్నామధ్య విలేకరుల సమావేశంలో సంబోధిస్తే.. దానికి ప్రతిగా రాధాకృష్ణ ఊసరవెల్లి అని విమర్శించాడు. ఈ ఇద్దరి మధ్య పోరులో ఎవరు కూడా ఒక్క అడుగు వెనక్కి తగ్గడం లేదు. బహుశా బావ బామ్మర్దుల సంబంధం ఇలానే ఉంటుందేమో.
సరే ప్రతి వారం వారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరిట సమకాలీన రాజకీయాలపై విశ్లేషణ పరమైన వ్యాసాలు రాసే రాధాకృష్ణ.. ఈసారి కూడా మంచి మసాలా దట్టించి కెసిఆర్ మీద రాసుకొచ్చాడు. కెసిఆర్ ను ఊసరవెల్లి అని సంబోధించాడు. తన రాజకీయ అవసరాల కోసం ఎంతోమంది భవిష్యత్తును ఆగం చేశాడని రాధాకృష్ణ ఆరోపించాడు. ఉద్యమ సమయంలో నరేంద్ర నుంచి తాజాగా ఈటెల రాజేందర్ వరకు ప్రతి ఒక్కరిని మెడ పట్టుకుని బయటికి గెంటేసాడని విమర్శించాడు. రాధాకృష్ణ చేసిన ఈ విమర్శల్లో నిజం ఉంది. కాకపోతే కెసిఆర్ ను ఢీకొనే సత్తా ఎవరికి ఉంది? ఇదే రాధాకృష్ణ 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ కూటమికి వత్తాసు పలికాడు. తన గురువు చంద్రబాబుకు జై కొట్టాడు. కానీ చివరికి ఏం జరిగింది? విస్ఫోటనంలాంటి వార్తలు రాసిన రాధాకృష్ణ చివరికి సైలెంట్ కావాల్సి వచ్చింది కదా! ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్లీ సపోర్ట్ లభిస్తోంది కాబట్టి రాధాకృష్ణ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాడు. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అంటే? ఆయన కూడా ఎస్ అని చెప్పలేని పరిస్థితి. ఇలాంటప్పుడు కెసిఆర్ కు ప్రజామోదం లభించినట్టే కదా.. అలాంటప్పుడు రాధాకృష్ణ రాసిన రాతలకు విలువ ఏముంటుంది. సాధారణంగా ప్రజలు అన్ని విషయాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వారికి ఏం అవసరమో వాటిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అలాగని చెప్పి కెసిఆర్ ప్రభుత్వం గొప్పగా పాలిస్తుందని కాదు.. ప్రతిపక్షాల్లో అనైక్యతే కేసీఆర్ కు బలం. ఈ చిన్న లాజిక్ రాధాకృష్ణ ఎలా మర్చిపోయాడో మరి. కెసిఆర్ చాలామంది నాయకులను మోసం చేశాడు అని రాధాకృష్ణ రాసు కొచ్చాడు. ఈ సువిషాల భారత దేశంలో ఇప్పటివరకు జరిగిన రాజకీయాలలో అన్ని పార్టీల్లోని సనేతల మొత్తం ఒకరిని మోసం చేయడం ద్వారానే పైకి ఎదిగారు. అంతటి గాంధీ మహాత్ముడి మీదనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి రాధాకృష్ణ విపరీతంగా అభిమానించే చంద్రబాబు కూడా కొంతమందిని వాడుకుని వదిలేసిన వాడే కదా.. పిల్లను ఇచ్చిన మామకు కూడా వెన్నుపోటు పొడిచిన వాడే కదా. ఈ ప్రకారం చేసుకుంటే కేసీఆర్ మేలే కదా!
కెసిఆర్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నాడు అని చెప్పిన రాధాకృష్ణ.. తన జాతీయ రాజకీయాల వైపు వెళ్తాడు, మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అని రాయడం ఏమిటో అంత పట్టడం లేదు. కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని రాధాకృష్ణ చెప్పినప్పుడు.. జనమోదం లభించినట్టే కదా. అలాంటప్పుడు ఊసరవెల్లి అని పదం వాడాల్సిన అవసరం ఏంటి? అంటే రాధాకృష్ణకు కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు కాబట్టి, తన పత్రిక కు జాకెట్ యడ్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ స్థాయిలో ఆగ్రహం ప్రదర్శిస్తున్నాడా? చివరికి కేటీఆర్ ను కూడా కేసీఆర్ మోసం చేస్తున్నాడు రాధాకృష్ణ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మోసం చేయాలి అనుకున్న వాడే అయితే కేటీఆర్ కు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఎందుకు ఇస్తాడు. షాడో ముఖ్యమంత్రిని ఎందుకు చేస్తాడు? ఏంటో రాధాకృష్ణ పచ్చ రాతలకు అంతు పొంతు లేకుండా పోతోంది.