Homeజాతీయ వార్తలుAaraa Survay: ఆరా సర్వే: కాంగ్రెస్ కథ కంచికి.. బీజేపీ ముందుకు.. టీఆర్ఎస్ పరిస్థితిదీ!

Aaraa Survay: ఆరా సర్వే: కాంగ్రెస్ కథ కంచికి.. బీజేపీ ముందుకు.. టీఆర్ఎస్ పరిస్థితిదీ!

Aaraa Survay : ‘తొందరిపడి ఓ కోయిలా ముందే కూసింది ఎందుకు చెప్మా’ అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘ఎన్నికలకు సై’ అన్న ధీమా వెనుక అసలు కారణం అదేనని ఇప్పుడు బయటపడింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు ఎవరిదన్నది తేలిపోయింది. అదే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో ధీమాకు కారణమైంది. అయితే అందరూ అనుకున్నట్టు ప్రతిపక్ష కాంగ్రెస్ ఏమీ పుంజుకోలేదు. కానీ పోయిన సారి కేవలం ఒకే ఒక్కసీటు సాధించిన బీజేపీ మాత్రం అనూహ్యంగా దూసుకొచ్చింది. కేసీఆర్ కు పోటీనిచ్చేలా ఎదిగింది. అదే ఇప్పుడు గులాబీ దండును కలవరపెట్టే అంశంగా చెప్పొచ్చు. ఇంతకీ తెలంగాణలో సర్వే చేసిన ‘ఆరా’సంస్థ విశ్లేషణలో ఎవరిది గెలుపు అని తేలింది? ఎవరికి అధికారం దక్కుతుంది? ఎవరికి ఎన్ని ఓట్లు అన్నది క్లియర్ కట్ గా బయటపడింది. ఆ సర్వే ఫలితాలు టీఆర్ఎస్ కు, బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చేలానే ఉన్నాయి..

ఆరా సంస్థకు విశ్వసనీయత ఉంది. ప్రతి అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో కూడా ‘ఆరా సంస్థ’ ఫలితాలు నిజమైన ఫలితాలకు చాలా దగ్గరగా ఉండేవి. ఏ పార్టీకి వంతపాడకుండా నిక్కచ్చిగా పోల్ నిర్వహించేది. పైగా ఒకటిన్నర దశాబ్ధం నుంచి ఈ సంస్థ ఇలా సర్వేలు చేస్తోంది. పైగా నియోజకవర్గానికి పదో ఇరవై కాకుండా ఏకంగా 3.30 లక్షలకు పైగా ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించింది. దీంతో ఈ ఆరా సంస్థ సర్వేపై జనాల్లో, రాజకీయ నాయకుల్లో విశ్వసనీయత ఏర్పడింది. మరి ఈ ఆరా సంస్థ తెలంగాణలో గెలుపు ఎవరిది అన్నది విశ్లేషించింది. అదేంటో తెలుసుకుందాం..

-కాంగ్రెస్ కథ కంచికే..
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గుర్తింపు పొందింది. అయినా కూడా ఆ పార్టీని రెండు సార్లు ఓడించారు ప్రజలు. తెలంగాణ ఇచ్చినా ప్రజల ఆమోదం పొందడంలో కాంగ్రెస్ విఫలమైంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. సంకుచిత రాజకీయాలు.. వర్గ పోరాటాలు, నాయకత్వ లోపం.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లకపోవడమే కాంగ్రెస్ తెలంగాణలో ఎదగలేకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. ఏ పార్టీలో లేని ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఉండడంతో వారు తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. అసమ్మతి రాజేస్తూ కాంగ్రెస్ ను ఖతం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుబొదుగూ లేకుండా పోయింది. యువ రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినా అతడిని అడుగడుగునా అడ్డుకుంటూ పార్టీని తెలంగాణలో ఎదగకుండా చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వచ్చాక రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్.. మూడోసారి రేవంత్ చలవతో గెలవాలని చూస్తున్నా సాధ్యం కాదని తేలిపోయింది. కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం దక్కడం సాధ్యం కాదన్న అంచనాలు ‘ఆరా’ సర్వేలో తేలాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు తెలంగాణలో 23.71 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 28.43 శాతం ఓట్లు రాగా.. ఈసారి అంతకంటే 5 శాతం ఓట్లు పడిపోతాయని సర్వేలో తేలింది. దీంతో కాంగ్రెస్ కథ కంచికేనని అర్థమవుతోంది.

-బీజేపీ ముందుకు..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు గెలిచింది.హేమాహేమీలు లాంటి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రసాద్ , చింతల లాంటి వారు టీఆర్ఎస్ ఊపులో కొట్టుకుపోయారు. టీఆర్ఎస్ కు ఏకపక్ష విజయం దక్కగా బీజేపీ బొక్క బోర్లా పడింది. కేవలం రాజాసింగ్ మాత్రమే బీజేపీ నుంచి గెలిచారు. కానీ ఇదే పార్లమెంట్ ఎన్నికల వరకూ వచ్చేసరికి ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచి బీజేపీ సత్తా చాటింది. అనంతరం బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రధాన పోటీస్థాయికి ఎదిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ ను గద్దెదించేందుకు మోహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 30.48 శాతం ఓట్లు వచ్చి తెలంగాణలో రెండోస్థానంలో నిలుస్తుందని తేలింది. ఇదే బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 6.98 శాతం మాత్రమే ఓటింగ్ రావడం విశేషం. ఈసారి ఏకంగా 24 శాతానికిపైగా ఓటు బ్యాంకు పెరిగి టీఆర్ఎస్ కు గట్టి పోటీనిస్తుందని తేలింది.

-టీఆర్ఎస్ కు తగ్గుతున్న ఓట్ల శాతం.. అధికారం దక్కుతుందా?
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కారు స్పీడుకు ఖచ్చితంగా ఈసారి బ్రేకులు పడుతాయని తేలింది. 6శాతం ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఏకంగా 30శాతానికి పెరగడం టీఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్ కు ఓట్ల శాతం భారీగా తగ్గుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 38.88 శాతం ఓట్లు వస్తాయని ‘ఆరా’ సర్వేలో తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఏకంగా 46.87 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి 8 శాతం కోత పడుతుందని తేలింది. రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత టీఆర్ఎస్ పై బాగా ఉందని.. బీజేపీ ఊపు చూస్తుంటే మరో ఏడాది కనుక ఇలానే సాగితే టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్యనున్న ఓట్ల తేడా 8శాతం అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే మరో ఏడాదిన్నర సమయం. రెండేళ్లలో 6శాతం నుంచి 30 శాతానికి బీజేపీ ఎగబాకింది. టీఆర్ఎస్ ను అందుకోవాలంటే కేవలం 8శాతం ఓట్లు సంపాదించాలి. బీజేపీకి ఊపు.. బండి సంజయ్ పాదయాత్రలు చూస్తుంటే అదంత కష్టం కాదని అనిపిస్తోంది. టీఆర్ఎస్ పై వ్యతిరేకత బీజేపీకి కలిసి వస్తోంది. సో ఈ ఊపు కనుక కంటిన్యూ చేస్తే తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కడం పెద్ద కష్టం కాదు. ఇక ఏదైనా మ్యాజిక్ చేస్తే టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకనే. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ‘ఆరా’ సర్వే చెప్పినట్టు టీఆర్ఎస్ గెలవడం ఖాయం. అందుకే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ తొడ కొడుతున్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా ఏడాదిన్నరలో బలపడి టీఆర్ఎస్ ను ఓడించాలని ఈ ముందస్తుపై పెద్దగా స్పందించడం లేదు. సో ఈ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతానికి గులాబీ పార్టీకే మొగ్గు ఉంది. ఏడాదిన్నరలో ఏం జరుగుతుందన్నది మాత్రం చెప్పలేం.

'ఆరా' ఎన్నికల సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు || Ara Survey On Telangana Assembly 2023 Elections||

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version