Narendra Modi – UAE : మోడీ.. ఎక్కడున్నా మనసున్న రాజే

యూఏఈ లో అనంతరం ఖతార్ లో నరేంద్ర మోడీ పర్యటిస్తారు. ఆ దేశంతో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

Written By: NARESH, Updated On : February 13, 2024 9:51 pm
Follow us on

Narendra Modi : బలమైన నాయకుడు ఉంటే.. దేశం కూడా బలంగా ఉంటుంది అంటారు. రూపాయి విలువ తగ్గిపోవడం, నిరుద్యోగ రేటు, ప్రతిపక్షాల్లో చీలిక వంటి విషయాలను వదిలేస్తే నరేంద్ర మోడీ దేశంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నారు. గ్లోబల్ పరంగా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఆయన పేరు గడించారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ హయాంలో భారత ప్రభుత్వం దౌత్యపరంగా అనేక విజయాలు సాధించింది. కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలు మొత్తం చేతులెత్తేస్తే.. కేవలం భారతదేశం మాత్రమే వ్యాక్సిన్ తయారు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసింది. యుద్ధం వంటి అనిచ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు పలు దేశాలకు అండగా నిలిచింది. అమెరికా హెచ్చరిస్తున్నప్పటికీ రష్యా వద్ద భారత మారకంలో ఇంధనం కొనుగోలు చేస్తుంది. అరబ్ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ ఖతార్ కు ఆహార పదార్థాలు, నిర్మాణ సామగ్రి ఎగుమతి చేస్తోంది.

వాస్తవానికి గతంలో భారతదేశం అమెరికా కన్నెర్ర చేస్తే ఇబ్బంది పడేది. అమెరికాకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమం చేపట్టలేకపోయేది. కానీ ఇప్పుడు అమెరికా ఎటువంటి ఆంక్షలు విధించినప్పటికీ భారత్ లెక్క చేయని పరిస్థితి నెలకొంది. చివరికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అక్కడి అభ్యర్థులు భారత ప్రధానమంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిచే స్థాయికి భారత దౌత్య విధానం ఎదిగింది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త పై బిజెపి నాయకురాలు నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల వల్ల అరబ్ దేశాల నుంచి భారత్ విమర్శలు ఎదుర్కొంది. ఆ సమయంలో అత్యంత చాకచక్యంగా నరేంద్ర మోడీ వ్యవహరించారు. కొద్దిరోజుల్లోనే పరిస్థితిని భారతదేశానికి అనుకూలంగా మలిచారు. అంతేకాదు ఖతార్ అరెస్టు చేసిన భారత నౌకాదళ మాజీ అధికారులను విడుదల చేయించ గలిగారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం నరేంద్ర మోడీ యూఏఈ, ఖతార్ లో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం యూఏఈ వెళ్లిన నరేంద్ర మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ సహ్యాన్ తో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఇరుదేశాల బంధాలపై చర్చించుకున్నారు.. తమ దేశానికి వచ్చిన నరేంద్ర మోడీకి యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ అబుదాబిలో బస చేసిన హోటల్ కు భారీగా ప్రవాస భారతీయులు చేరుకున్నారు. జై భారత్, జై మోడీ అంటూ నినాదాలు చేశారు. యూఏఈ లో అనంతరం ఖతార్ లో నరేంద్ర మోడీ పర్యటిస్తారు. ఆ దేశంతో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇరుదేశాల సంబంధాలపై చర్చిస్తారు. నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది.