Bangalore Boy Missing : కోచింగ్ సెంటర్ లో చేర్పిస్తే పారిపోయాడు.. రూ.200తో మూడు నగరాలు చుట్టి వచ్చాడు..

అయితే చదువులో ఒత్తిడి వల్లే ఆ పిల్లాడు బయటికి వచ్చాడని తెలుస్తోంది. అయితే కేవలం 200 తో అతడు ఇన్ని రోజులు మూడు నగరాలను చుట్టి రావడం ఒక ఎత్తైతే.. ఆకలి కూడా తీర్చుకోవడం విశేషం.

Written By: Anabothula Bhaskar, Updated On : January 24, 2024 8:37 pm
Follow us on

Bangalore Boy Missing : తమ కుమారుడు చదువుకొని బాగుపడాలని తల్లిదండ్రులు భావించారు. తాము పడుతున్న కష్టాలు తమ కొడుకు పడవద్దని, తాహతు కు మించైనా పర్వాలేదు అనుకుని చదివిస్తున్నారు. దాంతో పాటు ఒక ప్రైవేటు అకాడమీ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. ఆ పిల్లాడికి ఏమైందో తెలియదు కానీ.. కోచింగ్ సెంటర్ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదివేయండి.

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి చెందిన పరిణవ్ కు 12 సంవత్సరాలు. అతడు ఆరవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో డీన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ నుంచి చెప్పా పెట్టకుండా పారిపోయాడు. దీంతో అకాడమీ నిర్వాహకులు ఆ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వెతకడం ప్రారంభించారు. సమీపంలో ఉన్న సిసి పుటేజీల ఆధారంగా పరిశీలిస్తే మధ్యాహ్నం 3 గంటలకు యేమ్లూరు సమీపంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద కనిపించాడు. అక్కడికి వారు వెళ్ళగానే మళ్లీ మాయమయ్యాడు. ఆ తర్వాత కొంతసేపటికి బెంగళూరులోని మెజిస్టిక్ బస్ టెర్మినల్ లో సాయంత్రం బస్సు దిగడాన్ని అక్కడి పోలీసులు సిసి ఫుటేజ్ ద్వారా చివరిగా గుర్తించారు. అయితేఆ తర్వాత తమ కుమారుడి ఆచూకీ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగింది. పోలీసులతో కలసి బెంగళూరు మొత్తం తిరిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు తీవ్ర ఆవేదనలో కూరుకు పోయారు. తెలిసిన బంధువులు సలహా ఇవ్వడంతో ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అది ఆ విద్యార్థిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది.

పరిణవ్ ను ఉన్నత పాఠశాలలోనే కాదు.. అతడికి సమకూర్చే వస్తువుల విషయంలోనూ తల్లిదండ్రులు అదే స్థాయిని ప్రదర్శిస్తున్నారు. పరిణవ్ ఉపయోగించే పెన్నులు పార్కర్ కంపెనీకి చెందినవి. అలాంటి పెన్నులు అతని వద్ద ఉండడం.. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోవడం.. పైగా డబ్బులు కావాల్సి రావడంతో.. ఆ బాలుడు తన వద్ద ఉన్న పెన్నులు అమ్మడం ప్రారంభించాడు. పెన్నులను ₹200 కు విక్రయించాడు. వచ్చిన డబ్బులతో బెంగళూరు నుంచి రైలులో మైసూర్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి చెన్నై మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత బుధవారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రయాణించాడు. అయితే ఈ మూడు రోజులు అతడు హైదరాబాదులోనే ఉన్నాడు.. అయితే పరిణవ్ తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ తెలిస్తే చెప్పండని అతని ఫోటో చూపించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్న పరిణవ్ ను చూసిన ఓ మహిళ అతన్ని గుర్తు పట్టింది. సోషల్ మీడియాలో ఆ బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన నెంబర్ కు సమాచారం అందించింది. పనిలో పనిగా నాంపల్లి మెట్రో స్టేషన్ అధికారులకు, పోలీసులకు ఆ బాలుడిని అప్పగించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పరిణవ్ తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. నాంపల్లి పోలీసుల అదుపులో ఉన్న తమ కుమారుడిని చూసి ఉద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత తమ కుమారుడిని తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయారు. తమ కుమారుడి ఆచూకీ గుర్తించిన ఆ మహిళకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ బాలుడు కోచింగ్ సెంటర్ నుంచి ఎందుకు వెళ్లిపోయాడు అనేది మాత్రం ఇంతవరకు తెలియ రాలేదు. అయితే చదువులో ఒత్తిడి వల్లే ఆ పిల్లాడు బయటికి వచ్చాడని తెలుస్తోంది. అయితే కేవలం 200 తో అతడు ఇన్ని రోజులు మూడు నగరాలను చుట్టి రావడం ఒక ఎత్తైతే.. ఆకలి కూడా తీర్చుకోవడం విశేషం.