Praja Bhavan: ప్రగతి భవన్ మరుగుదొడ్లకు 35 లక్షలా? కాంగ్రెసోళ్లూ అంతేనా?

వాస్తవానికి ప్రస్తుతమున్న ప్రగతి భవన్ ప్రగతి భవన్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకునేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ నిర్మించుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 21, 2024 12:45 pm

Praja Bhavan

Follow us on

Praja Bhavan: కెసిఆర్ వందల కోట్ల ఖర్చుతో ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. కుక్కల కోసం లక్షలు ఖర్చుపెట్టి షెడ్లు నిర్మించుకున్నారు. చివరికి కోట్లు ఖర్చు చేసి బ్యాడ్మింటన్ కోర్టులు కూడా నిర్మించుకున్నారు.. వారు ఉపయోగించుకునే బాత్రూంలకు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కల్పించుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటిని మార్చి వేస్తాం. కెసిఆర్ తిన్నది మొత్తం కక్కిస్తాం. ఇలానే కదా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా భారత రాష్ట్ర సమితి మాదిరిగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న నివాసంలో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఉంటున్న ఆ నివాసంలో మరుగుదొడ్ల మరమ్మతుల కోసం 35 లక్షలకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. చివరికి దోమలను నివారించే తెరల కోసం కూడా టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది..జిమ్ రూం లో పొడుగు అద్దాలు, గన్ మెన్ ల గదుల కోసం 28.70 లక్షలకు టెండర్లు ఆహ్వానించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. నిర్మించిన ప్రగతి భవన్ పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసిందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కూడా కెసిఆర్ ప్రభుత్వం లాగానే ఆలోచిస్తుందని.. వ్యక్తిగత విలాసాల కోసం ఖర్చు చేస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి ప్రస్తుతమున్న ప్రగతి భవన్ ప్రగతి భవన్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకునేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. అయితే ఈ ప్రగతి భవన్ నిర్మాణానికి సంబంధించి కొన్ని విషయాలు బయటకు రావడంతో అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రగతిభవన్లోకి సామాన్య మానవులకు ప్రవేశం లేకపోవడంతో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసేవి. ప్రగతి భవన్ ను ముఖ్యమంత్రి తన గడిగా మార్చుకున్నారని.. ఒక దొరలాగా అందులో నుంచి పరిపాలన చేస్తున్నారని ఆరోపించేవి. అంతేకాదు తమ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తామని అప్పట్లో ప్రకటించాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ప్రగతి మరమ్మతుల కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవానికి ప్రగతిభవన్ నిర్మించేటప్పుడు అప్పటి ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. అధునాతన సౌకర్యాలు కల్పించింది. అయినప్పటికీ అనతికాలంలోనే అవి మరమ్మతులకు గురి కావడం విశేషం..

వాడే మరుగుదొడ్లకు, జిమ్ లో పొడుగు అద్దాలకు, వ్యక్తిగతంగా రక్షణ కల్పించే అంగరక్షకులకు.. ప్రభుత్వం నుంచి సొమ్ము కేటాయించడం ఏమిటో కాంగ్రెస్ పాలకులే చెప్పాలి. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా అదనంగా ఖర్చు చేయబోమని రేవంత్ రెడ్డి పలు సమావేశాల్లో చెప్పారు. చెబుతూనే ఉన్నారు. కానీ ఇలాంటివే ఆ పార్టీని ప్రజల్లో పలచన చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా వృధాగా ఖర్చు చేయబోమని చెబుతున్న పాలకులు.. వ్యక్తిగత విలాసాల కోసం.. మరుగుదొడ్ల మరమ్మతులకు.. దోమలను నివారించే తెరల కోసం లక్షలకు లక్షలు టెండర్లు పిలవడం ఏమిటని.. ఇలాంటివి ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలియదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు నోరు మెదపడం లేదు. పోనీ ప్రగతిభవన్లో నామమాత్రంగా సౌకర్యాలు కల్పించారా అంటే.. వందల కోట్లు ఖర్చు చేశారని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. మరి వందల కోట్లు ఖర్చు చేసి చేపట్టిన నిర్మాణంలో కల్పించిన సదుపాయాలు అంత నాసికంగా ఉన్నాయా? అంత నాసిరకంగా ఉంటే విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? ఇవి చేయకుండా మరమ్మతుల కోసం లక్షలకు టెండర్లు పిలవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.