Corporate Power- Indian Politics: అధికారం, డబ్బు ఇవి ఒకే నాణానికి ఉండే బొమ్మ బొరుసు లాంటివి. ఇవి రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు కనిపించినా.. జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు ఒకేలా ఉంటాయి. “ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడిన ప్రభుత్వం అని” అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యం గురించి గొప్పగా వర్ణించారు కానీ.. ఆచరణలో అంత సీను ఉండదు. కార్పొరేట్ ల వల్ల, కార్పొరేట్ల కొరకు, కార్పొరేట్ల కోసం ఏర్పడిన, ఏర్పడబోతున్న ప్రభుత్వాలే ఇప్పుడు ఉన్నాయి. నిలువ నీడ లేక, తాగేందుకు నీరు లేక పేదలు అలమటిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వాలు.. కార్పొరేట్లకు మాత్రం ఎంచక్కా సాగిల పడతాయి. పెట్టుబడుల కోసం వైబ్రాంట్ గుజరాత్, హ్యాపెనింగ్ హైదరాబాద్, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాయి. అంతేనా భూముల్లో రాయితీ, కరెంట్ లో రాయితీ, నీళ్ళల్లో ఇస్తూ కార్పొరేట్లకు సర్కారు సొమ్మును అప్పనంగా దోచి పెడతాయి. ఈ బంధాన్ని ఏ కోర్టులు ఆపలేవు. ఏ వ్యవస్థలు నిలువరించ లేవు. రాంకో సిమెంట్ యాడ్ క్యాప్షన్ లాగా వారి బంధం ఎప్పటికీ దృఢమైనది.
-ఎవరూ తక్కువ కాదు
ఆదానీ, అంబానీ బీజేపీకి సహకరిస్తారు. అఫ్ కోర్స్ అధికారంలో ఎవరు ఉంటే వారికి సహకరిస్తారు. అదే రాష్ట్రానికి వస్తే మై హోమ్ రామేశ్వరుడో, మేఘా కృష్ణా రెడ్డో, హెటిరో పార్థసారధి రెడ్డో, యశోద జి ఎస్ రావో తమ తమ స్థాయిలో మేళ్ల ను అందిస్తుంటారు. మాట్లాడితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ దాకా మోదీ ఆదానికి అంబానికి మాత్రమే సేవలు చేస్తుంటారని దెప్పి పొడుస్తూ ఉంటారు. వీళ్ళు ఏం సుద్దపూసలు కాదు. బెంగాల్లో దిదీ అయినా.. ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా.. కేరళ లో పినరయి విజయన్ సర్కార్ అయినా కార్పొరేట్ల ముందు సాగిలపడ వలసిందే. అంతెందుకు మొన్నటి మొన్నటి దాకా కాలికి బలపం కట్టుకొని ₹3 కోట్లు ఖర్చు పెట్టి అమెరికా, దావోస్‌కు కేటీఆర్ వెళ్ళింది కార్పొరేట్ల ప్రాపకం కోసమే కదా. ఎంఓయూలు కుదుర్చుకున్నది వేల కోట్ల పెట్టుబడుల కోసమే కదా! అసలు రాజకీయాలు కార్పొరేట్ల సంబంధం ఇప్పటిది కాదు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా అందరూ కార్పొరేట్ల కోసం సాగిల పడిన వారే. తెలంగాణ ప్రాజెక్టులు ఇక్కడి కార్పొరేట్ల చేతికి వెళ్లిన మాట వాస్తవమే కదా అని కాంగ్రెస్ నేతలూ ఆరోపిస్తుంటారు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు ఏమైంది? ఎందుకు పక్కన పెడుతున్నారు?
-అంతా వారే అంతటా వారే
రాజకీయ నాయకులు రాజకీయం ఎందుకు చేస్తారు? అధికారం కోసం. అధికారం ఉంటే ఏం వస్తుంది? అన్ని వ్యవస్థలు కాళ్ళ ముందు సాగిన పడతాయి కనుక. మరి ఆ ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి? ఓటర్లకు డబ్బులు పంచాలి. ఆ డబ్బులు ఎవరిస్తారు? కార్పొరేట్ కంపెనీలు. దీని వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఏం లాభం? వాళ్లు స్థాపించుకునే పరిశ్రమలకు కరెంటు నుంచి భూముల వరకు అన్ని వస్తాయి కాబట్టి. ఇంత స్థితి, గతి చక్రాలు ఉన్నాయి కాబట్టే రాజకీయాల్ని కార్పొరేట్లు శాసిస్తారు. తమకు అనుకూలమైన గవర్నమెంటు ఏర్పాట అయ్యేవరకు ఎంతకైనా తెగిస్తాయి.
-ఏకంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ని దించేశారు
అంబానీ అంటే ఆయిల్, పెట్రోలు, ఆంటిలియా, జియో అనుకుంటాం కానీ.. అంబానీ అంటే అంతకుమించి అని 2008లోనే ఈ ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో యూపిఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా ఎస్.జైపాల్‌రెడ్డి ఉన్నారు. అప్పట్లో కృష్ణ, గోదావరి గ్యాస్ బేసిన్లో తాము చమురు తోడుకుంటామని సోనియాగాంధీని రిలయన్స్ కంపెనీ అభ్యర్థించింది. ఈ ఫైలు జైపాల్ రెడ్డి టేబుల్ వద్దకు రాగా ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అంబానీ కి చిర్రెత్తుకొచ్చింది నేరుగా సోనియాగాంధీని కలిశారు. జైపాల్ రెడ్డి ఆ సీట్లో ఉంటే మా పనులు జరగడం లేదని వాపోయారు. దీంతో రాత్రికి రాత్రి ఎస్.జైపాల్‌రెడ్డి స్థానంలో మురళీ దేవరా ను నియమించారు. ఈ సంఘటన ఒకటి చాలు కార్పొరేట్లు దేశ రాజకీయాలు ఎలా శాసిస్తారో చెప్పడానికి..
-ఎక్కడికక్కడ పాతుకు పోయారు
2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ కూర్చున్న కుర్చీ నుంచి గాల్లో కూర్చునే ఫ్లైట్ దాకా అన్ని సమకూర్చింది ఆదానీ గ్రూప్. అప్పుడు చేసిన సహాయాన్ని గుర్తు గానే మోదీ ఇప్పుడు ఆదానిని భారతదేశంలో రెండవ అతిపెద్ద ధనవంతుడిని చేశాడు. కరెంటు నుంచి బొగ్గు దాకా ఆదాని చేయలేని వ్యాపారాలు అంటూ లేవు. తాజాగా ఆస్ట్రేలియా నుంచి కూడా ఆదాయాన్ని బొగ్గును ఇండియాకు దిగుమతి చేస్తున్నారు. ఇటీవల శ్రీలంక లో మన్నార్ ప్రాజెక్టు ఒప్పందం వివాదాస్పదం కాగా.. దీనిపై ఆ దేశంలో హింస చెలరేగుతోంది. కార్పొరేట్ల ప్రాపకం ఎడమ చేతి వాటం పార్టీలకు కూడా ఉంది. కేరళలో జరిగిన బంగారం స్కామే ఇందుకు ప్రబల నిదర్శనం. పశ్చిమ బెంగాల్ లో శారద కుంభకోణం, మధ్యప్రదేశ్ లో వ్యాపమ్.. ఇలా ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల కార్పొరేట్ ల బంధం sayami కవలలను పోలి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటే తేడా. అధికారంలో ఉన్నవాళ్లు కార్పొరేట్ల తో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు విమర్శలు చేస్తారు. తీరా వాళ్లు అధికారంలోకి వచ్చాక ఇదే పంథాను అనుసరిస్తారు.
Also Read:Telangana Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్: చేసుకున్నోళ్లకు చేసుకున్నంత!
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Political parties were in power corporates ruled
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com