Khammam District Politics: * పువ్వాడ అజయ్ కుమార్ కు పోటీగా మాజీ ఎంపీ రేణుకాచౌదరి
* కొత్తగూడెం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ
* భద్రాద్రి జిల్లా బాధ్యతలు మొత్తం ఆయనకే అప్పగింత
* ఇటీవలి పర్యటనలో మంత్రి కేటీఆర్ విస్పష్ట ఆదేశాలు
ఎన్నికలకు ముందే ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఏ క్షణాన్నైనా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఇటీవలి ఖమ్మం జిల్లా పర్యటనలో సంకేతాలు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో అంతర్మధనం మొదలైంది.
ఇదీ ఉమ్మడి జిల్లా ముఖ చిత్రం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం జనరల్ స్థానాలు. మిగతా ఏడింటిలో మధిర ఎస్.సి రిజర్వు కాగా, మిగిలిన స్థానాన్ని ఎస్టీ లకు కేటాయించారు. 2018 ఎన్నికల్లో ఒక ఖమ్మం మినహా మిగతా స్థానాలు అన్నింటిలోనూ కాంగ్రెస్ విజయ పతాకం ఎగరేసింది. తర్వాత జరిగిన పరిణామాలతో బట్టి విక్రమార్క, పోదెం వీరయ్య మినహా మిగతా వాళ్ళందరూ అధికార టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ‘యూటీ( ఉద్యమ తెలంగాణ) బ్యాచ్ కు, బీటీ(బంగారు తెలంగాణ) బ్యాచ్ కు ఆయా నియోజకవర్గాలలో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. పలుమార్లు ఇందుకు సంబంధించిన పంచాయితీలు కెసిఆర్, కేటీఆర్ వద్దకు వెళ్లగా వాళ్లు సముదాయిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీకే సర్వేలో మెరుగ్గా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తామని సాక్షాత్తు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడం, అది కూడా ఒక బహిరంగ సభలో స్పష్టం చేయడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇన్నాళ్లు అధిష్టానంపై గుర్రుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ అభయ హస్తం ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: Sharad Power Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవర్.. ఏకాభిప్రాయం దిశగా విపక్షాలు
2018 లో టికెట్ ఇవ్వకపోవడం, రాజ్యసభ సీటు ఇవ్వకపోవడం, ఎమ్మెల్సీ లో పరిగణనలోకి తీసుకోక పోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకింత నిర్వేదంలో ఉన్నారు. దీనికి తోడు పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన జిల్లాలో హవా చూపిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా తన పై చేయిని ప్రదర్శిస్తున్నారు. ఇది పొంగులేటి వర్గం నాయకులకు మింగుడుపడటం లేదు. మొన్నామధ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుక జరిగినప్పుడు ఆయన అభిమానులు ఖమ్మం లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను మునిసిపల్ సిబ్బంది తొలగించడం పెద్ద దుమారాన్నే లేపింది. దీని తెర వెనుక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హస్తం ఉందని పొంగులేటి వర్గ నాయకులు నేరుగానే ఆరోపణలు చేశారు. ఖమ్మంలో పొంగులేటి వర్గానికి పువ్వాడ అజయ్ కుమార్ వర్గానికి ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుండటంతో దీనికి చెక్ పెట్టేందుకు మంత్రి కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. ఇందుకు “పట్టణ ప్రగతి” పనులను వేదికగా చేసుకొని పొంగులేటి ఇంట్లో అల్పాహారం తిన్నారు.
ఈ సమయంలోనే ఇద్దరి మధ్య గొడవలను సెట్ చేశారని సమాచారం. ఇందులో భాగంగానే వనమా రాఘవేందర్ ఉదంతంతో భద్రాద్రి జిల్లా లోని కొత్తగూడెం టికెట్‌ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీన్ని బహిరంగంగా ప్రకటించకపోయినా కేటీఆర్ ఇచ్చిన విస్పష్ట ఆదేశాలతో పొంగులేటి వర్గం హ్యాపీగా ఉంది. ఇప్పటికే కొత్తగూడెంలో పొంగులేటి కార్యాలయ బాధ్యతలు కొదమసింహం పాండు రంగాచార్యులు నిర్వర్తిస్తున్నారు. అయితే పొంగులేటి కి ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వర్గం, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు వర్గం ఈ మేరకు సహకరిస్తాయో వేచిచూడాల్సి ఉంది. మరోవైపు ఈ కొత్తగూడెం స్థానంపై రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడ్డ శ్రీనివాసరావు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రగతి భవన్ నుంచి అండదండలు ఉండడంతో శ్రీనివాస రావు తన తండ్రి పేరు మీద జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు.
సండ్ర × దయానంద్
సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మట్టా దయానంద్ మధ్య పోటీ నెలకొంది. ఇద్దరు నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా సండ్ర వెంకటవీరయ్య మట్టా దయానంద్ కు ఆహ్వానం పలకడం లేదని తెలుస్తోంది. మరోవైపు మట్టా దయానంద్ కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
గతంలో మట్టా దయానంద్ కు ఎమ్మెల్సీ ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటుని తాతా మధుకు ఇచ్చారు. జీర్ణించుకోలేని పొంగులేటి వర్గం తాతా మధుకు మెజార్టీ తగ్గేలా తమ వర్గం ప్రజాప్రతినిధులు ఓట్లు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి వేసేలా ప్రణాళిక రూపొందించారని ఆరోపణలున్నాయి. ఇందుకు బలం చేకూరుస్తూ మొన్నామధ్య అశ్వారావు పేట లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పై విమర్శలు గుప్పించారు. తాతా మధు కూడా వీలు చిక్కినప్పుడల్లా ఆరోపణలు సంధిస్తూనే ఉన్నారు. ఇక నియోజవర్గంలో సండ్ర వెంకట వీరయ్య మాత్రం అభివృద్ధి కార్యక్రమాల్లో వినూత్న శైలిలో కేసీఆర్ కేటీఆర్ కు ప్రచారం కల్పిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం దీక్షలో సండ్ర వెంకటవీరయ్య వినూత్న శైలిలో నిరసన తెలిపారు. ఆ సమయంలో సండ్ర వెంకటవీరయ్య ను ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. టికెట్ విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.
మధిర లో భట్టి విక్రమార్క వర్సెస్ లింగాల కమల్ రాజు
ఖమ్మం జిల్లాలో ఖమ్మం తర్వాత ఆ స్థాయిలో ఆసక్తికర చర్చ రేకెత్తిస్తోంది మధిర నియోజకవర్గం. ఇక్కడ గత మూడు పర్యాయాలు భట్టి విక్రమార్క గెలుపొందారు. ఆయన చేతిలో మూడు పర్యాయాలు ప్రస్తుత ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఓడిపోయారు. లింగాల కమల్ రాజు గతంలో వామపక్ష పార్టీ అభ్యర్థిగా ఉండగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రోద్బలంతో టిఆర్ఎస్లో చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఫారస్ తోనే జడ్పీ చైర్మన్ గా గెలుపొందారు. జడ్పీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన మదిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ విస్తరణకు కృషి చేస్తున్నారు. అయితే దీన్ని పసిగట్టిన ప్రస్తుత ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే భట్టి విక్రమార్కుని పలుమార్లు అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించడం లింగాల కమల్ రాజు వర్గానికి మింగుడుపడటంలేదు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లింగాల కమల్ రాజుకు ఈ మధ్య గ్యాప్ పెరిగింది. ఈ క్రమంలోనే లింగాల కమల్ రాజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వారా కేటీఆర్ కు సన్నిహితుడయ్యారని సమాచారం. తమలోనే మధిర టికెట్ తనకే కన్ఫామ్ చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మధిర నియోజకవర్గంలో ఎస్సీ జనాభా అధికంగా ఉండటం తనకు లాభిస్తుందని కమల్ రాజు అంటున్నారు.
ఈ నియోజకవర్గాలు కాకుండా పాలేరు, ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట, వైరా లో కూడా నేతల మధ్య అంతరాలు పొడ చూపుతున్నాయి. ఇటీవల పీకే టీమ్ నిర్వహించిన సర్వేలో ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజాభిమానం చూరగొన డంలో విఫలమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికి కూడా టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. పాలేరు లో ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ని తప్పించి వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. భాగంగానే ఇటీవల ఖమ్మం పట్టణానికి వచ్చిన కేటీఆర్ ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కలిసి విడిగా ఒక అర్థగంట సేపు మాట్లాడారని తెలుస్తోంది.
పువ్వాడ కు పోటీగా రేణుకా చౌదరి
ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ సంగతి అలా వదిలేస్తే పువ్వాడ అజయ్ కుమార్ కు పోటీగా బరిలో మాజీ ఎంపీ రేణుకాచౌదరి నిలుస్తున్నారని సమాచారం. 2019 ఎన్నికల్లో రేణుకాచౌదరి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆమెకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూపంలో అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఈ సమయంలో మమతా కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఏర్పడ్డాయని తనిఖీ చేసేందుకు రేణుకాచౌదరి వెళ్లగా అక్కడ పువ్వాడ అజయ్ కుమార్ కొడుకు నయన్ రాజ్ ఆమెను ప్రతిఘటించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక రూపంలో రేణుకాచౌదరిని పువ్వాడ అజయ్ కుమార్ వర్గం టార్గెట్ చేస్తూనే ఉంది.
ఇటీవల బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడం, దానికి కారణం పువ్వాడ అజయ్ కుమార్ అని మరణ వాంగ్మూలంలో పేర్కొనడంతో రేణుకా చౌదరి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పువ్వాడ అజయ్ కుమార్ పై రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చాలా హాట్ హాట్ చర్చకు దారి తీశాయి. ఇందుకు ప్రతిగా పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు ను గెలుపు చివరి అంచు వరకు తీసుకెళ్లిన రేణుకాచౌదరి రివెంజ్ తీర్చుకున్నారు. ఇటీవల జరిగిన కమ్మ సామాజిక వర్గం ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ ప్యానెల్ కు పోటీగా తన అండదండలు ఉన్న ప్యానల్ ను నిలిపి గెలిపించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా పువ్వాడ అజయ్ కుమార్ దీనిపై నివురుగప్పిన నిప్పు లా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కమ్మ సామాజిక వర్గం కమిటీకి పోటీగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేరే సంఘాన్ని నెలకొల్పారు. ఇటీవల సీక్వెల్ క్లబ్లో ఆవిర్భావ సభను కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ఈ పరిణామం తో కమ్మ సామాజిక వర్గం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ పరిణామాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని రేణుకా చౌదరి పువ్వాడ అజయ్ కుమార్ మీద పోటీకి సై అంటున్నారని తెలుస్తోంది.
Also Read:Power Crisis In AP: ఏపీలో విద్యుత్ సంక్షోభం.. ఏ పూటది ఆ పూటే కొనుగోలు
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Political heat in khammam district
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com