AP Police: ప్రజలు అంతులేని విజయాన్ని అందించారు… మేము ఏంచేసినా చెల్లుబాటు అవుతుంది కదా అన్నట్టుంది ఏపీలో వైసీపీ సర్కారు పాలన. ఏపీలో జరుగుతున్న అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు. గొంతెత్తితే భౌతిక దాడులు. చిన్నా పెద్ద తారతమ్యం లేదు. విచక్షణ లేకుండా వ్యవహరించడం..అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కాపాడాల్సిన కొందరు మంత్రుల బహిరంగంగానే బూతులు మాట్లాడుతున్నారు.ఇక పోలీస్ ప్రతాపం అంతా ఇంతా కాదు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న వారిని అణచివేస్తున్నారు.ప్రతిపక్షంతో పాటు తప్పులను ఎత్తిచూపుతున్న వారిపై ప్రతాపం చూపుతున్నారు. అక్రమ అరెస్టులు, కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారు. స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ పేరిట చిత్రహింసలు పెడుతున్నారు. చివరికి ప్రజాసంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నిర్బంధాలు తప్పడం లేదు. అయితే అధికార పార్టీ నాయకుల, కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వారి పట్ల పెద్దమనసును చాటుకుంటున్నారు.మొత్తానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో పోలీస్ మార్కు అరాచక రాజకీయానికి తెరదీశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వైసీపీ నేతలు దుర్భషలాడినా..
‘ఏయ్ తమషా చేస్తున్నావా? చొక్కా పట్టి లగేస్తా నా కొడకా? ఎవరనుకుంటున్నావు? ఉద్యోగం చేయ్యాలని లేదా? అంటూ కొద్ది నెలల కిందట విశాఖలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ అప్పలరాజు ఓ పోలీస్ అధికారిపై విరుచుకుపడ్డారు.నానా దుర్భాషలాడారు. రాయలేని విధంగా తిట్ల దండకాన్ని అందుకున్నారు. కానీ ఆయనపై ఎటువంటి కేసూ లేదు. పోలీస్ సంక్షేమ సంఘం ప్రతినిధుల స్పందనా లేదు. కానీ విపక్షాలు, ప్రజాసంఘాలు చేయని తప్పుకు కూడా బాధ్యులను చేస్తూ పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తున్నారు. కుప్పంలో వైసీపీ నేతల అరాచకానికి నిరసనగా సత్యసాయి జిల్లాలో నిరసన కార్యక్రమానికి దిగిన టీడీపీ నేతలపై రామగిరి సీఐ చిన్నగౌస్ అనుచితంగా ప్రవర్తించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారధిని ఉద్దేశించి అడుగు ముందుకేస్తే ‘అసలు ఇక్కడికి రావడానికి నువ్వెవరు? ముందుకు కదిలితే కాల్చిపారేస్తా? నంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా రాష్ట్రంలో కొందరు పోలీసుల అరాచకం హద్దులు దాటుతోంది. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం రాజకీయ ప్రత్యర్థులపై వారు విరుచుకుపడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంటోంది.
Also Read: Kishan Reddy: ఇవీ మేమిచ్చినవి.. కేసీఆర్ ఏం చేశావో చెప్పు?: కిషన్ రెడ్డి
ఆ పోలీస్ బాస్ రాకతో..
డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక పోలీసుల అరాచక పర్వం పెరిగిపోయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. డీజీపీ సవాంగ్ ఉన్నప్పుడు నిర్భందాలు, అణచివేతలు ఉన్నా ఈ స్థాయిలో ఉండేవి కాదని చెబుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, కేసుల ఛేదన వంటి వాటిని వదిలేసి..కేవలం వైసీపీ నాయకుల రాజకీయ ప్రయోజనాలకు, వారి అడుగులకు మడుగులొత్తడం పోలీసులు చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి మాత్రమే తాను డీజీపీ అన్నట్టు రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఏదైనా సమస్యపై ప్రజా సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు వినతిపత్రం అందిస్తామంటే డీజీపీ కలిసేందుకు ఇష్టపడడం లేదు. వారిని కార్యాలయం బయటే అడ్డుకున్న సందర్భాలున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే మాత్రం కేసుల నమోదుచేస్తున్నారు. డీజీపీ వ్యవహార శైలి మాత్రం విమర్శలకు తావిస్తోంది.
కట్టడి చేయాల్సిన వారే..
ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలు, భౌతిక దాడులను నియంత్రించాల్సిన వారే వాటికి కారణమవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలకు దిగుతున్న విపక్ష నాయకులు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను ముందుగానే పోలీసులు అడ్డకుంటున్నారు. భారీగా మోహరించి నిర్బంధిస్తున్నారు. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలకు మాత్రం దగ్గరుండి భద్రత కల్పిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సమయంలో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు తొలగిస్తున్నా, అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేస్తున్నా మౌనాన్నే ఆశ్రయించారు. ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రం లాఠీలు ఝుళిపించారు. కేసులు నమోదు చేశారు. కొందరు పోలీస్ అధికారులు వాడుతున్న భాష, వ్యవహార శైలి కూడా అత్యంత హేయంగా ఉంటోంది. అనంతపురం జిల్లాలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను విచారణ పేరిట పోలీస్ స్టేషన్కు పిలిపించి అత్యంత హేయంగా కొట్టారు. వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదు కారణంగా తమను డీఎస్పీ విచక్షణా రహితంగా కొట్టారని బాధితులు చెప్పినా పట్టించుకునేవారు కరువయ్యారు.
ఆ ఫిర్యాదులు బుట్టదాఖలు..
వైసీపీ నాయకులపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. తమపై దౌర్జన్యాలు, అకృత్యాలకు పాల్పడుతున్నారని బాధితులు ఫిర్యాదుచేసినా బుట్టదాఖలు చేస్తున్నారు. ఒక వేళ సీరియస్ ఇష్యూగా మారిన తరువాత కేసు నమోదుచేస్తున్నారు. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. పాలనా వైఫల్యాలపై ప్రశ్నించేవారికి, సోషల్ మీడియాలో గళమెత్తిన వారిపై మాత్రం ఫిర్యాుదులు ఇప్పించుకొని మరీ పోలీసులు ప్రతాపాన్ని చూపుతున్నారు. విచారణ పేరిట థర్డ్ డిగ్రీని ఉపయోగిస్తున్నారు.తనను సోషల్ మీడియాలో దూషిస్తూ పోస్టింగులు పెడుతున్నారని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పోలీసులకు ఫిర్యాదుచేసి రెండేళ్లవుతున్నా అతీగతీ లేదు. చివరకు ఆమె అసెంబ్లీలో ప్రశ్నించినా ఫలితం లేకపోయింది.
చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకి..
ఇక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విషయంలో కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.అమరావతిలో చంద్రబాబు పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్ పై కొందరు రాళ్లు రువ్వారు. కానీ ఈ ఘటనను ఉద్దేశించి అప్పటి డీజీపీ సవాంగ్ చేసిన ప్రకటన విస్మయపరిచింది. అది భావప్రకటన స్వేచ్ఛగా ఆయన చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళుతున్న చంద్రబాబును ఇంటి గడప దాటకుండా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి చంద్రబాబు ఇంటిపై ఇప్పటి మంత్రి, నాటి ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి ప్రయత్నించారు.భారీ కాన్వాయ్ తో దూసుకెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడిచేసి విధ్వంసానికి దిగినా పోలీసులు పట్టించుకోలేదు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నాయకుడి పరామర్శకు వెళుతున్న లోకేష్ ను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. అయితే ఎన్నడూ లేనంతగా తన చర్యలతో ఏపీ పోలీస్ శాఖ మాత్రం పలుచనవుతోందని చెప్పొచ్చు. రాజకీయాలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు అంతకంటే శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. ప్రభుత్వాలు మారిన ప్రతీసారి పోలీసు శాఖకు ప్రాధాన్యతలు మారుతుండడం అత్యంత హేయం. ఇప్పటికైనా ఏపీ పోలీస్ శాఖలో మార్పు రావాలని కోరుకుందాం.
Also Read:KTR: కేటీఆర్ వల్లే హైదరాబాదులో గొడవలా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Police brutality in ap cases and arrests if questioned
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com