Janasena: పిడుగు ఎక్కడపడుతుందో ముందే చెప్పే టెక్నాలజీ ఉంది… వరదలను పసిగట్టలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమా? ఇసుక మాఫియా కోసమే కడప జిల్లాలో సకాలంలో డ్యామ్ గేట్లు ఎత్తలేదా? ప్రజలను వరద పాల్జేశారా? అంటే ఔనని జనసేన నిలదీస్తోంది. బాధిత ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటోంది. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ఉందా? ఉంటే మంత్రి ఎవరు? అన్నది అంతుబట్టని వ్యవహారంగా ఉంది. సకల శాఖల మంత్రి సజ్జల ప్రకృతి విపత్తులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రతిపక్షాల ప్రశ్న. హెలికాప్టర్ లో వెళ్ళి బాధితులకు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడమే ప్రభుత్వం చేస్తున్న సాయం అంటే అంతకుమించిన చోద్యం లేదు. సీఎం గారికి పక్క రాష్ట్రంలో పెళ్ళికి వెళ్ళడం మీద ఉన్న శ్రద్ధ సొంత జిల్లాలో వరద బాధితులను స్వయంగా కలవడం మీద లేదని జనసేన ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా ప్రజల జీవనం పూర్తిగా చిన్నాభిన్నమైంది.. ప్రకృతి ప్రకోపించడం వల్ల ఈ విద్వంసం జరిగిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది అవాస్తవం. ఇందులో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అన్నారు జనసేన ప్రశ్నించింది. వివాహాలు, విందులకు హాజరయ్యేందుకు సీఎంగారికి తీరిక ఉంటుంది గానీ, తుపాను బాధితులను ఆదుకోవడంలో… వారిని పరామర్శించడంలో తీరిక లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో జరిగే వివాహాలకు వెళ్లి ఆశీర్వదించే తీరిక చేసుకొంటున్న సీఎం గారు వారి సొంత జిల్లాలో బాధితులను పరామర్శించేందుకు ఎందుకు వెళ్ళడం లేదు అని ప్రశ్నించారు.
నేడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. చిన్నపాటి పిడుగు పడినా నలభై నిమిషాల ముందుగానే తెలుస్తుంది. అలాంటిది ఇంతటి భారీ తుపాను వస్తుందంటే కనీసం నాలుగైదు రోజుల ముందుగానే టెక్నాలజీ సహాయంతో తెలుసుకోవచ్చు. ప్రకృతి విపత్తుల నివారణ శాఖ ఇందుకోసమే ప్రత్యేకంగా పని చేస్తుంది. అయినప్పటికి జగన్ ప్రభుత్వం దీన్ని తెలుసుకోవడంలో అలసత్వం ప్రదర్శించింది. దీనిని ముందస్తుగా గుర్తించి, ప్రభుత్వం కనీసం కంట్రోల్ రూంను ఎందుకు ఏర్పాటు చేయలేదు ? పునరావాస కేంద్రాలు నిర్వహణ కూడా సక్రమంగా లేదు. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసి వారితో ఎందుకు సమీక్షా సమావేశాలు నిర్వహించలేదని జనసేన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
• వాలంటీర్లు ఏమైపోయారు?
ప్రభుత్వం కనుక ముందుగా అప్రమత్తమయి ఉంటే పరిణామాలు ఇంత తీవ్రంగా ఉండేవి కావు. వేలాది గ్రామాలు ముంపుకు గురై ఉండేవి కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ప్రతీ యాభైమందికి ఒక వార్డు వాలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరి ఆ వార్డు వాలంటీర్లు సహాయపునరావాస కార్యక్రమాల్లో ఎందుకు పాలుపంచుకోలేదు? ఈ నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున తుఫాను బాధితులు ఉన్నప్పటికి వారికి అండగా ఒక్క వార్డు వాలంటీరు నిలబడలేదు. వీటన్నింటికి జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
వైసీపీ ప్రభుత్వంలో విపత్తుల నివారణ శాఖ అనేది ఉందా.. లేదా ? ఉంటే ఆ శాఖ మంత్రి ఎవరు? అన్ని శాఖలను సజ్జల రామకృష్ణారెడ్డి గారే పర్యవేక్షిస్తున్నారా? దీన్ని కూడా ఆయనే చూసుకుంటారని వదిలేశారా? ఎందుకని ఆ శాఖ నిర్వీర్యమైందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నాలుగు జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతుంటే, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాలుగు రోజులుగా మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? అధికారులు తమ విధులను నిర్వహించడంలో అలసత్వం చూపుతుంటే మీరు ఎందుకు సమీక్ష సమావేశం నిర్వహించలేకపోయారు.
ఈ నాలుగు జిల్లాల్లోనే లక్షల ఎకరాల పంట నష్టాల పాలైంది. రైతులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలెవరు స్పందించలేదు. కనీసం ప్రజలకు అండగా నిలబడతామనే భరోసా కల్పించలేదు. జగన్ రెడ్డి గారి పాలనలో చేతికి వచ్చిన పంట నోటి వరకు రావడంలేదు. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుతున్నాయని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంది. వీటివల్ల రైతులకు ఏ మాత్రం మేలు జరగడం లేదు. వాళ్ల జీవితాలు శాపాలమయంగా మారాయి. ఈ పాలన వల్ల రైతులు ఎంతగా నష్టపోతున్నారో ప్రజలు గ్రహించాలి. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనుక నష్టపోయిన వారందరికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.
• సీఎం, డెప్యూటీ సీఎం, చీఫ్ విప్, విప్.. ఉండి ఏం ప్రయోజనం?
కడప జిల్లా నుండి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పదికి పదిమంది ఎంఎల్ఏలు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికి కడప జిల్లాలోని రైల్వే కోడూరు, రాజంపేటలో సహాయపునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలో అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ప్రజలు అన్నం కావాలని అడగడం లేదు. మృత కళేబారాలను తొలగించండి… పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించండి అని కోరుకుంటున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ పని తమ శాఖ పరిధిలోనిది కాదని చేతులు దులుపుకుంటున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుంది. ప్రజలకు సకాలంలో సేవలు చేయడంలో తీవ్ర అలసత్వం కనిపిస్తుంది.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి అందరికి సేవలు చేస్తున్న పార్టీ కేవలం జనసేన మాత్రమే. జనసేన నాయకులు, కార్యకర్తలు వాడవాడలా తిరిగి ప్రజల బాగోగులు చూస్తున్నారు. కావల్సిన సహయసహకారాలతో పాటు మంచినీళ్ల పాకెట్లు, ఆహార పోట్లాలు, దుప్పట్లు అందజేస్తున్నారు.
• ఆదుకొనే తీరు ఇదేనా?
బాధిత ప్రజలు ఉన్న దగ్గర హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం గుడ్ డే బిస్కట్ ప్యాకెట్లను జారవిడిచింది. ప్రభుత్వ హెలికాప్టర్ ద్వారా మంచినీళ్లో, బోజన ప్యాకెట్లో వస్తాయని భావించిన ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. గుడ్ డే బిస్కట్ ప్యాకెట్లను చూసి హతాశులయ్యారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? సర్వం కోల్పోయిన ప్రజలకు 25 కిలోల బియ్యం కిలో పప్పు, నూనెతోపాటు రెండువేల రూపాయల నష్టపరిహరం ప్రకటించింది. ఇంతకంటే దుర్మార్గం మరేదైనా ఉంటుందా ? కట్టుబట్టలతో ఉన్న ప్రజలను ఆదుకోవల్సిన తీరు ఇదేనా ?
ముందుస్తు చర్యలు తీసుకోకపోవడం, తుపాను వచ్చిన తర్వాత సహాయపునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే. విశాఖపట్నంలో గ్యాస్ లీకై ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వ వైఫల్యంగా భావించి ఒక్కక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించారు. తుపాను కారణంగా నేడు కడపలో ప్రాణాలు కోల్పోయిన ప్రతీ కుటుంబానికి, గల్లంతయిన వారికి, పశువులు, పంట నష్టపోయిన వారికి తగినంత పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
కడప జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున తుపానులు రావడానికి కారణం ఇసుక మాఫియానే. ఇసుక అక్రమ రవాణా కారణంగా ఈ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. స్థానికంగా ఉన్న పింఛా ఆనకట్ట చాలా బలహీనంగా ఉందని నివర్ తుఫాన్ సమయంలోనే ప్రభుత్వ అధికారులను స్థానికులు, జనసేన నాయకులు హెచ్చరించారు. పూర్తి స్థాయిలో నీటి నిల్వలు పెరిగితే ప్రమాదకరమని సూచించారు. అయినప్పటికి నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ గారు దీని పట్ల శ్రధ్ద చూపలేదు. నీటి నిల్వలు అధికమైతే ఎందుకు వెంటనే దిగువకు విడుదల చేయలేదు? కారణం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ప్రాజెక్టు దిగువన ఇసుక నిల్వలు ఉన్నాయి. వాటిని రక్షించుకునేందుకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. పింఛా దిగువున ఉన్న అన్నమయ్య డ్యామ్ దగ్గర వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు క్రమపద్దతిలో విడిచిపెట్టకుండా ఇసుక మాఫియా కోసమే మొత్తం నీటిని నిలబెట్టారు. ఫలితంగానే మట్టి కట్ట కొట్టుకుపోయి ఊళ్లను ముంచేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైపల్యమే. అధికార పార్టీ నేతల ఇసుక అక్రమ డంపులను తరలించుకోవడానికి, ఇసుకు రవాణాకు దారులు సుగమం చేసేందుకు డ్యాం గేట్లను ఎత్తలేదు. ఈ మాఫియా ఎవరి చేతుల్లో ఉందో జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.
• సీట్లు… ఓట్లే ఆయనకు ముఖ్యం
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రజలు కష్టాల్లో ఉంటే చూసేందుకు ఆయనకు తీరిక లేదు. జగన్ రెడ్డి గారికి అధికారం ఉంటే చాలు. ఓట్లు, సీట్లు ఇవే ఆయనకు ముఖ్యం. ప్రజల పాట్లు అవసరం లేదు. వీటన్నింటిని ప్రజలు గమనించాలి. కష్టసమయంలో ఈ ముఖ్యమంత్రి మనతో పాటు ఉండరన్న విషయం తెలుసుకోవాలి. ఇతర పార్టీ నాయకులను బూతుమాటలతో తిట్టించి పైశాచికానందం పొందడంలో ఉన్న శ్రద్ధ ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడంలో చూపడం లేదు.
నేటి వరకు తిరుపతిలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఏనాడు ఏర్పడలేదు. నాలుగు రోజుల పాటు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దుకాణాలు తెరుచుకోలేదు. ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. ప్రజలకు సహాయం చేయడంలో ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఏనాడు లేని విధంగా తిరుపతిలో వరదలు వచ్చాయి. అందుకు ప్రధాన కారణం తిరుపతిలోని చెరువులను వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేయడమే.
రాబోవు రెండు మూడు రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ , రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ ఈ వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అప్పుడు ఇంకా అనేక వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఈ ఇసుక మాఫియా బండారాలు, చెరువుల కబ్జాదారుల వివరాలు తేటతెల్లమవుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తప్పిదాలను తెలుసుకొని ప్రజలకు మేలు చేసే దిశగా చర్యలు చేపట్టాలి. వాస్తవాలను ప్రజలు గ్రహించాలి. జగన్ రెడ్డి గారికి అక్రమ సంపాదన, అధికారం, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టించడం, నాయకులను తిట్టించడంపై ఉన్న శ్రద్ద ప్రజలకు సేవ చేయాలనే దానిపై లేదు. గతంలో నివర్ తుపాన్ సమయంలో కూడా ఆయన అదే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు రాష్ట్రమంతా పర్యటించి బాధితులకు, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.35వేల రూపాయలు చెల్లించాలని కోరినప్పటికి జగన్ రెడ్డి గారు స్పందించలేదు.
Also Read: AP 3 Capitals: తగ్గేదేలే! జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే.. ఏపీ రాజధానిపై జగన్ సంచలనం
ఈ ప్రభుత్వం ఏలుబడిలో రాష్ట్రం పూర్తిగా చతికిలపడిపోయింది. ప్రజల్లో అభద్రతా భావం నెలకొంది. ఎక్కడ చూసినా ఆశాంతి, అసంతృప్తి కనిపిస్తుంది. అభివృద్ధి అన్న మాటే లేదు. ఇటువంటి కష్టకాలంలో ప్రజల్లో భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలబడుతున్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు మాత్రమే. నిబద్ధత, నిజాయతీ కలిగిన నాయకుడు ఆయన మాత్రమే” అన్నారు.
Also Read: AP CM Jagan: ఏపీలో వరద.. సీఎం జగన్ పెళ్లిళ్లలో సరదా?
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Pawan kalyan janasena supports ap flood victims
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com