New Zealand: నిండా జనం.. ఉన్నప్పుడే ఏ దేశానికైనా విలువ ఉంటుంది. ఆ జనం లేని నాడు ఆ దేశం ఉట్టి దిబ్బగా మారిపోతుంది. సాధారణంగా ప్రపంచంలో వనరులు లేకుండా.. అవకాశాలు లేకుండా ఉన్న ప్రాంతాలు పెద్దగా వర్ధిల్లవు. ఎందుకంటే అవకాశాలు లేని చోట ప్రజలు ఉండలేరు. అక్కడ జీవనం సాగించలేరు. అందువల్లే ఆఫ్రికా లాంటి ప్రాంతాలలో ఇప్పటికీ పేదరికం కొనసాగుతోంది. యూరప్ లాంటి ఏరియాలలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి సాగుతోంది. అమెరికా లాంటి ప్రాంతాలలో విస్తారంగా పెట్టుబడి ఉంది కాబట్టి ప్రపంచ ఆర్థిక రంగం మొత్తం దాని చుట్టూ కేంద్రీకృతమై ఉంది. చైనాలో తయారీ రంగం అధికంగా ఉంటుంది కాబట్టి.. ప్రపంచ ముడిసరుకు మొత్తం అక్కడికి చేరుకుంటుంది.
ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో ఆ దేశంలో వనరులు ఉన్నాయి. విస్తారంగా భూములు ఉన్నాయి. సహజ సంపదకు తిరుగులేదు. వ్యవసాయపరంగా ఇజ్రాయిల్ లాంటి దేశాలకు పోటీ ఉంటుంది. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ జనం ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బతుకు లేదు. బతికే సౌలభ్యం లేదు అనుకుంటూ వలస వాదాన్ని ఎంచుకుంటున్నారు. వాస్తవానికి ఒక ప్రాంతం నుంచి జనాభా ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతే ఆర్థికంగా.. సామాజికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆదేశం కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆదేశం పేరు న్యూజిలాండ్.
న్యూజిలాండ్ దక్షిణ పసిఫిక్ మహా సముద్రానికి దగ్గరగా ఉంటుంది. ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తస్మానియా అనే సముద్రం ఉంటుంది. ఈ సముద్రాన్ని దాటితే న్యూజిలాండ్ వాసులు ఆస్ట్రేలియా చేరుకోవచ్చు. ఆస్ట్రేలియా ఒక ఖండం మాత్రమే కాదు.. అద్భుతమైన వనరులున్న దేశం కూడా. ఇక్కడ తయారీరంగం నుంచి మొదలుపెడితే గనుల వరకు విస్తారంగా ఉంటాయి . అందువల్లే ఇక్కడికి న్యూజిలాండ్ వాసులు వస్తున్నారు.
న్యూజిలాండ్ దేశంలో ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ గొడవలు జరిగినా సరే ఇక్కడ మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖరీదైన గృహాలు ఉంటాయి. అంతకుమించి అనే స్థాయిలో వ్యవసాయం ఉంటుంది. ఆసుపత్రులు.. విద్యాలయాలు గొప్పగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రపంచ స్థాయి కర్మాగారాలు.. ఫైనాన్స్ విభాగాలు.. పెట్టుబడిదారులు ఉండరు. ఏవైనా సరే స్థిరంగానే అవకాశాలుంటాయి. గొప్పగా కెరియర్ నిర్మించుకోవాలి అనుకుంటే.. అద్భుతంగా జీవించాలి అనుకుంటే ఇక్కడ కుదరదు. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ కేవలం వ్యవసాయం, రియల్ ఎస్టేట్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. వ్యవసాయంలో కూడా అత్యాధునికమైన యంత్రాలను వాడుతున్నారు. దీనివల్ల శ్రామిక శక్తికి ఉపాధి లేకుండా పోతోంది.
రియల్ ఎస్టేట్ లో అవకాశాలు ఉన్నప్పటికీ.. అవి పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. ఇక్కడ విస్తారంగా భూమి ఉంటుంది. కాకపోతే గృహ నిర్మాణాలకు ఉపయోగించే సిమెంట్ నుంచి మొదలు పెడితే ఇటుక వరకు అన్ని దిగుమతి చేసుకోవాలి. స్థానికంగా శ్రామికులు తక్కువగా ఉంటారు. అందువల్ల ఇతర ప్రాంతాల నుంచి వారిని తెచ్చుకోవాలి. ఫలితంగా గృహాల రేట్లు అధికంగా ఉంటాయి. పైగా ఇక్కడ గృహాలను నివాసయోగ్యంగా కాకుండా.. డబ్బులు వచ్చే యంత్రాలుగా మాత్రమే చూస్తారు. ఇల్లు నిర్మించడం.. అమ్మడం.. అద్దెకు ఇవ్వడం వంటివి జరిగిపోతుంటాయి. కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వానికి ఒక స్థాయి వరకే దన్నుగా నిలుస్తుంది. పైగా ప్రభుత్వ నిబంధనలు కూడా అత్యంత కఠినంగా ఉంటాయి.
కెరియర్ గొప్పగా నిర్మించుకోవాలి.. అద్భుతమైన అవకాశాలను సృష్టించుకోవాలి అనుకునేవారు మొత్తం ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు. న్యూజిలాండ్ కల్చర్, ఆస్ట్రేలియా కల్చర్ ఒకే విధంగా ఉంటుంది. న్యూజిలాండ్ ప్రజలు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. అందువల్లే ఆస్ట్రేలియా ప్రజలు వారిని సాదరంగా స్వాగతిస్తారు. దేశం నుంచి మేదో వలస ఉన్న నేపథ్యంలో.. దాని నివారణకు న్యూజిలాండ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదా అని అనుమానం మీలో కలుగవచ్చు.. కానీ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత.. అక్కడ బాగా డబ్బు సంపాదించిన తర్వాత న్యూజిలాండ్ ప్రజలు తమ సొంత దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో భారీగా డబ్బును డంపు చేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రజలు కూడా ఇదేవిధంగా చేస్తున్నారు. అందువల్ల న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. న్యూజిలాండ్ జనాభా ప్రస్తుతం 50 లక్షలు. ఇది మెల్బోర్న్ జనాభా కంటే చాలా తక్కువ.
భారతీయుల్లో చాలామంది మాత్రం న్యూజిలాండ్ దేశానికి వెళ్తున్నారు. ఇక్కడ ప్రశాంతమైన జీవితం ఉంటుంది. నర్సింగ్, ఐటీ విభాగాలలో పని చేసే వారికి అవకాశాలుంటాయి
. భారత కరెన్సీ తో పోల్చితే న్యూజిలాండ్ కరెన్సీ చాలా విలువైనది. పైగా అమెరికా మాదిరిగా ఇక్కడ ఎటువంటి దాడులు.. విచక్షణ పూరితమైన ఘటనలు జరగవు. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. భారతీయులు కష్టపడి పని చేస్తారు కాబట్టి న్యూజిలాండ్ వాసులు కూడా ఇష్టపడుతుంటారు. ఆక్లాండ్ ప్రాంతంలో ఇండియన్స్ ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు పెరిగిపోయారు. దీనినిబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.