Vehicle Caste Stickers Fine: కొన్ని వాహనాలపై నెంబర్ ప్లేట్లతో రకరకాల స్టిక్లరు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టిక్కర్లలో కులం పేర్లు కూడా ఉంటాయి. అయితే ఇక నుంచి వాహనాలపై కులం పేర్లు కనిపిస్తే చర్యలు ఉండే అవకాశం ఉంది. బీహార్ రాష్ట్ర రవాణా శాఖ ఇలాంటి స్టిక్కర్లపై వాహనదారులకు షాకింగ్ ఆదేశాలు జారీ చేసింది. వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు, గుర్తులు లేదా స్టిక్కర్లు ఇకపై అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ స్టిక్కర్లను తొలగించాలని ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఒకవేళ ఈ స్టిక్కర్లు ఉంటే ఎలాంటి జరిమానాలు వేస్తారు?
వాహన నంబర్ ప్లేట్లు, బాడీలు, బంపర్లు, విండోలు లేదా ఇతర చోట్ల కుల పేర్లు కనిపించకుండా చూడాలని రవాణా శాఖ ఆదేశించింది. ఇప్పటికే రాసుకున్నవారు జూన్ మొదటి వారంలోగా తొలగించాలని తెలిపింది. గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు ప్రారంభిస్తామని, ఇలాంటి ఉల్లంఘనలపై మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫైన్ విషయంలోనూ రవాణా శాఖ స్పష్టత ఇచ్చింది. కులం పేర్లు తొలగించకపోతే మొదట సెక్షన్ 177 కింద రూ.500 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధిస్తారు. తీవ్రమైన కేసుల్లో సెక్షన్ 179 కింద రూ.2,000 వరకు ఫైన్, అవసరమైతే లైసెన్స్ సస్పెన్షన్ కూడా చేసే అవకాశం ఉంది. జిల్లా రవాణా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, అమలును నిర్ధారించారు.
చట్టపరమైన సమస్యలు, రోడ్డు ఉద్రిక్తతలను నివారించడానికే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాహన యజమానులు వెంటనే కుల పేర్లను తొలగించి, నిబంధనలు పాటించాలని సూచించారు. బిహార్‌లో సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే ఈ చర్య ప్రభుత్వ లక్ష్యంతో సమానంగా ఉందని వారు అంచనా వేస్తున్నారు. వాహనదారులు గ్రేస్ పీరియడ్‌ను అవకాశంగా పట్టుకుని, తమ వాహనాలను క్లీన్ చేసుకోవాలని రవాణా శాఖ పిలుపునిచ్చింది. ఈ నియమం అమలు తర్వాత రోడ్లు మరింత శాంతియుతంగా, సమానత్వ భావంతో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.