Toraja Indonesia Culture: పుట్టిన వాడు గిట్టక మానడు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా మరణాన్ని మాత్రం అడ్డుకోవడం లేదు. కాకపోతే జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఇక ఎవరు మరణించినా.. చివరకు కలిసేది మట్టిలోనే. అంటే మరణం తర్వాత ఖననం చేయడం లేదా దహనం చేయడం చేస్తారు. అయితే ఇండోనేషియాలోని సులవేసీ దీవుల్లో నివసించే తోరాజా తెగ ప్రజలు, మరణాన్ని అంత్యక్రియలతో ముగించకుండా, జీవితం మరో దశగా భావిస్తారు. వారి దృష్టిలో శరీరం చనిపోవడం కాదు, కేవలం ‘‘జీవిత విరామం’’ మాత్రమే. అందుకే వారు మృతదేహాలను ‘‘డెత్ సిక్’’ అని పిలుస్తారు. ‘‘డెడ్ బాడీ’’ అని పిలవడం అవమానంగా భావిస్తారు.
మృతదేహాల సంరక్షణకు ప్రత్యేక పద్ధతులు..
పాతకాలంలో శరీరం పాడవకుండా ఉండేందుకు టీ పొడి, సహజ సుగంధ ద్రవ్యాలు రాసే పద్ధతి ఉండేది. ఇప్పుడు కాలం మారడంతో, ప్రత్యేకమైన ఇంజెక్షన్లు, లేదా బాల్సన్ ఎంటీ అనే ఔషధ మొక్కల పదార్థాలను వాడుతున్నారు. ఈ విధానం ద్వారా మృతదేహాలు చాలా కాలం చెడిపోకుండా ఉంటాయి. శవాలను పూడ్చడం, కాల్చడం వంటి పద్ధతులు వీరికి అవసరం లేదు. వాస్తవానికి వారు మృతదేహాలను తమకెదురుగా ఉంచి జీవిస్తారు. ఎవరైనా అతిథులు వస్తే, పెట్టె (కాఫిన్) తెరవడం సహజం. వారిని ‘‘ఇదే మా కుటుంబ సభ్యుడు’’ అంటూ పరిచయం చేస్తారు.
మరణం పట్ల భయం లేదు..
తోరాజా ప్రజలకు మరణం శోకం కాదు. అది కుటుంబంలో పునఃస్మరణకు, ప్రేమకు పండుగ సమానమైన వేళ. ప్రతి సంవత్సరం ప్రత్యేక వేడుకల ద్వారా తమ మరణించిన బంధువులను స్మరించుకుంటారు. వారిని తిరిగి అలంకరించి, కొత్త బట్టలు వేయడం, ఒక పండుగలా మృతదేహాలను ఊరేగించడం అక్కడ సాధారణం. అంతే కాదు, పుట్టినప్పుడు పిల్లలు జీవం పొందినట్లే, చనిపోయిన తర్వాత కూడా ‘‘తమతోనే ఉన్నారు’’ అనే విశ్వాసంతో ఉంటారు. వారి దృష్టిలో మరణం అనేది సంబంధాల ముగింపు కాదు.
గృహ నిర్మాణంలో మృతుల గుర్తులు..
తోరాజా ఇళ్ల నిర్మాణాలు ఇతర ప్రాంతాల కంటే ఎంతో భిన్నంగా ఉంటాయి. యజమాని మరణిస్తే, ఇంటిపై ప్రత్యేకమైన పైపు ప్రతిష్ఠిస్తారు. దీని ద్వారా గ్రామంలో అందరికీ ఆ ఇంట్లో మరణం జరిగిందని తెలుస్తుంది. తర్వాత ఆ మృతదేహాలను గుహల్లో వేస్తారు. ఈ శ్మశాన గుహలు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే కొనసాగుతున్నాయి. కొన్నింటిలో చక్కగా చెక్కిన బాక్సులు, మరికొన్నింటిలో కఠినంగా చెక్కిన ప్రతిమల రూపంలో ఉన్న బొమ్మలు ఉంటాయి. అవి శవాన్ని సూచించే చిహ్నాలుగా ఉపయోగిస్తారు. బాక్సులు తెరవకుండానే ఆ బొమ్మల ద్వారా గౌరవం తెలుపుతారు.
పర్యాటకులకు తెలిపేలా..
తోరాజా ప్రజలు తమ ఆచారాలపై గర్వపడతారు. బయటివారిని భయపడవద్దని చెప్పి, ఈ శవాల గుహలను పర్యాటకులకు చూపిస్తారు. చిన్నపిల్లల మృతదేహాలను చిన్న కాఫిన్‌లలో ఉంచడం, వారిని సదా సాంత్వనంగా స్మరించుకోవడం కూడా ఈ సంస్కృతిలో ఒక భాగం.
మరణాన్ని జీవన భాగంగా..
మరణించారని ఇక్కడ ఎవ్వరూ ఏడవరు, మరణాన్ని శాపంగా భావించరు. వారి ఊహాలోకం ప్రకారం మృత్యువు అనేది ఆత్మ మరొక ప్రయాణానికి బయలుదేరిన దశ. అందుకే ఈ తెగ ప్రజలు మరణాన్ని భయంతో కాక, ఆప్యాయతతో స్వాగతిస్తారు. అనుబంధం, మనసుని బంధించే ప్రేమ, నిరంతర జీవనం అనే భావనల సమ్మేళనం వీరి సంస్కృతి ప్రత్యేకత. ఇదే తొరాజా తెగవారిని ప్రత్యేకంగా నిలిపింది.
తోరాజా తెగ జీవన విధానం మానవ సంస్కృతికి కొత్త కోణాన్ని చూపిస్తుంది. మృతదేహాలను భయంతో కాక, ప్రేమతో చూస్తే జీవితానికి గాఢమైన అర్థం దొరుకుతుందని ఈ సంఘం నిరూపిస్తుంది. ఇది కేవలం ఒక తెగ ఆచారం కాదు జీవితానికి, మరణానికీ మధ్య ఉన్న అనుబంధానికి ప్రతిరూపం.