Warangal: తెలంగాణను నిజాం కన్నా ముంద అనేక మంది రాజులు పాలించారు. వారిలో కాకతీయులు చాలా ముఖ్యం. మూడు శతాబ్దాలు తెలంగాణను పాలించిన కాకతీయులు ఇక్కడి సంస్కృతిని నలు దిశలకు విస్తరింపజేశారు. చరిత్ర సంస్కృతిపై చెరగని ముద్రలు వేశారు. హనుమకొండ, ఓరుగల్లును రాజధానులుగా చేసుకుని తెలంగాణను పాలించారు. తమ పాలన సమయంలో అనేక మంది కాకతీయ రాజులు శివాలయాలతోపాటు అనేక నిర్మాణాలు చేపట్టారు. ఇవి వారి అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి, రామప్ప గుడి, రామప్ప చెరువుతోపాటు కాకతీయుల కళాతోరణం వారి నిర్మాణ శైలికి, కళా నైపుణ్యానికి నిదర్శనం. గతేడాది నిర్మించిన అయోధ్య రామాలయంలో.. రామప్ప ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం వాడడం కాకతీయ కట్టడాల పటిష్టతను తెలియచేస్తుంది.
భూగర్భంలో ఆలయం..
కాకతీయుల నిర్మాణాల్లో ఒకటైన భూగర్భ ఆలయం ఇటీవల బయటపడింది.ఖిలా వరంగల్ ప్రాంతంలో ఇది ఉంది. ఖిలా వరంగల్ ప్రాంతం ఒకప్పటి కాకతీయుల రాజధాని. ఆనాటి కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఖిలా వరంగల్ ప్రాంతంలోని మట్టి కోట ప్రాంతంలో భూగర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించడం కాకతీయుల ప్రతిభకు అద్దం పడుతుంది. కొన్నేళ్ల క్రితం ఖిలా వరంగల్ మట్టికోట ప్రాంతంలో కేంద్ర పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుండగా భూగర్భంలో ఈ ఆలయం బయటపడింది. మొదట సొరంగంగా భావించారు. తర్వాత లోపలికి వెళ్లి చూస్తే ఆశ్చర్యపోయారు. అద్భుతమైన త్రికుటాలయం వారికి కనిపించింది.
సైనికుల కోసం..
కాకతీయులు ఈ ఆలయాన్ని సైనికులు పూజలు చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని లక్ష్మీపార్వతి ఆలయంగా పిలుస్తారు. రాజభవనాలకు సమీపంలో ఖిలా వరంగల్ ప్రాంతంలో వందలకు పైగా ఆలయాలను నిర్మించారు. సైనికులు ఈ ఆలయంలో పూజలు చేసుకోవడంతోపాటు సేద తీరేందుకు ఉపయోగించుకునేవారు. ఈ ఆలయంలో విష్ణువు, సూర్య భగవానుడు, శివలింగం కొలువై ఉండేవి. రజాకార్ల సమయంలో తవ్వకాలలో ఇవి ధ్వంసం అయ్యాయి.