Thailand innovative Farming : థాయ్ లాండ్ ఆసియా ఖండంలో ఒక వినూత్నమైన దేశం. ఇక్కడ విలాసాలు, వినోదాలు మాత్రమే ప్రముఖంగా మీడియాలో కనిపిస్తాయి. మీడియా కూడా అలాంటి వాటికే ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి అవి మాత్రమే వెలుగులోకి వస్తాయి. అందువల్లే దశాబ్దాలుగా మనకు థాయిలాండ్ అనే దేశం పేరు వినిపిస్తే చాలు మసాజ్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఇక పర్యాటకంగా తమ దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం అక్కడి ప్రభుత్వాలు అనేక రకాలైన సౌకర్యాలు.. పర్యాటకులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నాయి. అందువల్లే అక్కడ కొన్ని చీకటి వ్యవహారాలు దర్జాగా సాగిపోతుంటాయి. మన దగ్గర నేరం అనుకున్న వృత్తి.. అక్కడ పబ్లిక్ గానే జరుగుతూ ఉంటుంది.. అందువల్లే ఓ వర్గం పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. విదేశాల నుంచి కూడా మారకద్రవ్యం అధికంగా వస్తుండడంతో పర్యాటకాన్ని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నది. రాయితీలు కూడా భారీగా ఇస్తున్నది.
మసాజ్ కు మాత్రమే థాయిలాండ్ ఫేమస్ కాదు.. అక్కడ వ్యవసాయం కూడా విభిన్నంగా జరుగుతుంది. కాకపోతే అక్కడ రైతులు వినూత్నంగా ఆలోచించి వ్యవసాయం చేస్తుంటారు. థాయిలాండ్ ప్రాంతంలో మన మాదిరిగానే ధాన్యం ఎక్కువగా పండుతుంది. కాకపోతే అది బాస్మతి మాదిరిగా ఉంటుంది. సంప్రదాయ విధానంలోనే వరి సాగు చేస్తున్నప్పటికీ.. ఆ విధానంలో కాస్త విభిన్న తత్వాన్ని అక్కడ రైతులు పాటిస్తుంటారు. వరి నారు కట్టలను పంట కాలువల ద్వారా పొలాల్లోకి పంపిస్తారు. ఆ తర్వాత వెదురు కర్రల సహాయంతో నాట్లు వేస్తుంటారు. ఆ వేసే ప్రక్రియలో అత్యంత ఖచ్చితత్వాన్ని పాటిస్తుంటారు. మనదేశంలో అయితే సరాసరిగా నాటు వేయడానికి సుమారు ఐదు నుంచి ఏడుగురు దాకా కూలీలు అవసరం పడతారు. కానీ థాయిలాండ్ ప్రాంతంలో ఒక మనిషి మాత్రమే ఎకరం వరకు ఒక రోజులోనే నాటు వేయగలడు. కాలువల ద్వారా వరి నారు కట్టలను మడులలోకి సరఫరా చేయడం ద్వారా కూలీల అవసరం తక్కువగా పడుతుంది. పైగా నేరుగా ఆ కట్టలు మడులలోకి వెళ్లిపోతుంటాయి. అయితే ఇలా నాటు వేసే విధానాన్ని కూడా థాయిలాండ్ ప్రభుత్వం పర్యాటకంగా ప్రమోట్ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నది. అయితే థాయిలాండ్ ప్రాంతంలో పండిన ధాన్యం మనదేశానికి కూడా గతంలో దిగుమతి అయ్యేది. కాకపోతే మన ప్రాంత రైతులు అంతకంటే సన్న బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా థాయిలాండ్ ప్రాంతం నుంచి బియ్యం అంతగా దిగుమతి కావడం లేదు.