Symbols On Indian Coins: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే.. ఇలా మన వాడే కరెన్సీ మొత్తం డిజిటల్ రూపంలోకి వచ్చేసింది. డిజిటల్ విధానంలోనే మనం చెల్లింపులు చేపడుతున్నాం. ఒకరకంగా కరెన్సీని భౌతికంగా చూడడం చాలావరకు తగ్గిపోయింది. ఏ స్థాయిలో డిజిటల్ పేమెంట్స్ చేసినప్పటికీ.. అప్పుడప్పుడు కరెన్సీ వాడక తప్పడం లేదు.
కరెన్సీ వాడకంలో పెద్ద నోట్ల తర్వాత చిల్లర నాణాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాకపోతే చిన్న చిన్న పచారి కోట్లలో.. మామూలు దుకాణాలలో చిల్లర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు చిల్లర నాణాలు వేరే విధంగా ఉండే. వాటిపై గుర్తులు కూడా విభిన్నంగా కనిపించేవి. కాలంతోపాటు నాణాలు కూడా మారిపోయాయి. ఆధునికపరమైన మార్పులను సంతరించుకున్నాయి. మనదేశంలో నాణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారుచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కేంద్రాలలో వీటిని తయారుచేసి.. ఆయా బ్యాంకులకు సరఫరా చేస్తుంది. అయితే మన దేశంలో వాడుకలో ఉన్న నాణాలు ఇటీవల కాలంలో పూర్తి ఆధునికమైన రూపాన్ని సంతరించుకున్నాయి. అంతేకాదు నాణాలలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.
Also Read: Coins: కాయిన్స్ ఎలా తయారు చేస్తారో తెలుసా? ఏ కాయిన్ తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ముఖ్యంగా ₹1, ₹2 నాణాలపై ముద్రలు విచిత్రంగా కనిపిస్తున్నాయి. వాటిపై బొటనవేలు గనుక చూపిస్తే రూపాయి అని.. 2 వేళ్ళు చూపిస్తే కనుక రెండు రూపాయలని అందరూ అనుకుంటారు. అయితే ఆ ముద్రల వెనుక ఒక అర్థం ఉంది.. వాస్తవానికి ఈ ముద్రలను మన దేశానికి మాత్రమే సొంతమైన నాట్య రీతుల నుంచి తీసుకున్నారు. భరతనాట్యంలో ఉండే రీతుల నుంచి ఆ ముద్రలను తీసుకున్నట్టు తెలుస్తోంది. రూపాయి కాయిన్ లో ఉండే సింబల్ భరతనాట్యంలో శిఖరం ముద్ర. రెండు రూపాయల కాయిన్ పై ఉండేది కర్తరిముఖ ముద్ర. మన సంస్కృతికి మరింత గుర్తింపు తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పని చేసినట్టు తెలుస్తోంది..
ఆ ముద్రల వెనక..
కాయిన్స్ మీద ఇలాంటి ముద్రలను ఏర్పాటు చేయడానికి ప్రధాన పాత్ర పోషించింది ప్రొఫెసర్ అనిల్ సిన్హా. ఈయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. కాయిన్స్ మీద ఈ గుర్తులను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఆయనే. ఎందుకంటే మనం వాడే కరెన్సీ మీద ఎలా అయితే భారతీయత కనిపిస్తుందో.. కాయిన్స్ విషయంలోనూ అలానే ఉండాలని అనిల్ భావించారు. తన మనోగతాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనేక చర్చల తర్వాత.. అనేక భేటీల తర్వాత అనిల్ తయారుచేసిన ముద్రలను ఉన్నతాధికారులు ఓకే చేశారు. అందువల్లే కాయిన్స్ పై మన సంస్కృతికి సంబంధించిన గుర్తులు కనిపిస్తుంటాయి. అవి మన సంప్రదాయాన్ని కళ్ళ ముందు కనిపించేలా చేస్తుంటాయి. పది రూపాయల కాయిన్ విషయంలోనూ మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ముద్రలను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మిగతా కాయిన్ల విషయంలోనూ ఇదే తీరు ప్రదర్శిస్తారని సమాచారం.