Snake Bite : భారతదేశంలో పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సగటున 58,000 మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్య చాలా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం పాము కాటు కారణంగా మరణిస్తున్న మొత్తం మరణాలలో భారతదేశం(80,000 నుండి 1,30,000) అత్యధికంగా ఉంది. భారతదేశాన్ని ప్రపంచ పాముకాటు రాజధానిగా పిలవడానికి కారణం ఇదే. ఇండియన్ మిలియన్ డెత్ స్టడీ 2020 ప్రకారం.. పాము కాటు కారణంగా భారతదేశంలో ప్రతి గంటకు ఆరుగురు మరణిస్తున్నారు. ఏటా 30 నుంచి 40 లక్షల పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఈ కేసుల దృష్ట్యా, ప్రభుత్వం పాము కాటును నోటిఫైడ్ డిసీజ్ కేటగిరీలో చేర్చింది.
పాము కాటును ఎందుకు వ్యాధిగా పరిగణిస్తారు?
చాలా అంటువ్యాధులు మరణానికి దారితీస్తాయి. సరైన చికిత్సను కనుగొనడానికి వేగవంతమైన పరీక్ష అవసరమయ్యే అంటువ్యాధులను గుర్తించేందుకు అవసరమైన రికార్డులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన నోటిఫికేషన్లు జారీ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. చాలా రాష్ట్రాలు క్షయ, హెచ్‌ఐవి, కలరా, మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లను దృష్టిలో ఉంచుకుని వాటి రికార్డులను ఎప్పటికప్పుడు మెయింటైన చేస్తుంటాయి. అలాగే పాము కాటు వేసిన వెంటనే దాని విషం రక్తంలో కలిసిపోయి శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ సమయంలో నరాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా గుండె, ఊపిరితిత్తులు పక్షవాతానికి గురవుతాయి. సకాలంలో వైద్యం అందకపోతే, రోగి మరణించే అవకాశం ఉంది. పాము కాటు కారణంగా మరణం లేదా ఏదైనా తీవ్రమైన శారీరక సమస్యను నివారించడానికి, రోగికి యాంటీవీనమ్ ఇవ్వాలి. అందుకోసం పాటు కాటు రికార్డులు కూడా ప్రభుత్వాలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
భారత్ 2030 వరకు లక్ష్యాన్ని నిర్దేశించింది
జూన్ 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాముకాటు ద్వారా వ్యాపించే విషం అత్యంత ప్రభావవంతమైనది, ప్రాణాంతకమైనదిగా పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో భారత ప్రభుత్వం కూడా వన్ హెల్త్ విధానం ద్వారా 2030 సంవత్సరం నాటికి పాము కాటు కారణంగా మరణాలను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రికార్డుల ఆధారంగా పాముకాటు కేసులను సరిగ్గా పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. భారతదేశం అంతటా పాముకాటు కేసులు, మరణాల సంఖ్యను ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. పాముకాటు కేసులను సమర్థవంతంగానియంత్రించడానికి ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. పాముకాటు తరచుగా సంభవించే దేశంలోని వివిధ ప్రాంతాల్లో యాంటివేనోమ్‌ను అందుబాటులో ఉంచవచ్చు.
ఈ 4 పాములు చాలా విషపూరితమైనవి
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేల రకాల పాములు ఉన్నాయి. వీటిలో 725 జాతులు విషపూరితమైనవి. ఈ 725 విషపూరిత పాములలో, 250 రకాల పాములు ఉన్నాయి, వాటి కాటు ఒక వ్యక్తిని తక్కువ సమయంలో మరణానికి గురి చేస్తుంది. భారతదేశంలో 310 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయి. 66 జాతులు మాత్రమే విషపూరితమైనవి లేదా స్వల్పంగా విషపూరితమైనవి. 23 జాతులు వైద్యపరంగా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి ఎందుకంటే వాటి విషం చంపగలదు. ‘బిగ్ 4’ అని పిలువబడే నాలుగు జాతులు దేశంలో సుమారు 90శాతం పాముకాట్లకు కారణమవుతాయి. ఈ నాలుగు జాతులు- కామన్ క్రైట్, ఇండియన్ కోబ్రా, రస్సెల్స్ వైపర్, సా స్కేల్డ్ వైపర్.
పాముకాటు కేసులు ఎందుకు తక్కువగా నమోదవుతున్నాయి?
నివారణకు అతిపెద్ద అడ్డంకి పాముకాటుకు సంబంధించిన డేటా లేకపోవడం, భారతదేశంలో పాముకాటు ప్రభావంపై చాలా తక్కువ డేటా అందుబాటులో ఉంది. దీనికి ఒక కారణం ఏమిటంటే, చాలా మంది బాధితులు ఆసుపత్రులలో కాకుండా మూడనమ్మకాలతో చికిత్స పొందుతున్నారు. అధికారిక డేటాలో ఈ సంఖ్యలు నమోదు కావడం లేదు. అటవీ, గ్రామీణ, కొండ లేదా పట్టణ ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించే ప్రజలు పాముకాటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ నుండి పాముకాటు కేసులు ఎక్కువగా ఉన్నాయి.