Six types of dishes with ants: సాధారణంగా చీమలను ( ants) చూస్తే ఒక రకమైన భావం కలుగుతుంది. అందులోనూ మనం తినే ఆహార పదార్థాల్లో పొరపాటున చీమ కనిపిస్తే పక్కన పెట్టేస్తాం. అటువంటిది ఏకంగా చీమలతో ఆరు వంటకాలు తయారు చేస్తున్నారు. ఎంతో ఇష్టంగా ఆరగిస్తున్నారు. చీమలతో వంటకాలు ఏంటి? అన్నదే మీ అనుమానం కదా? మీరు విన్నది నిజమే. అది తెలియాలంటే పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లాల్సిందే. ఆ జిల్లాలోని సీతంపేట ప్రాంతంలో ప్రజలు చీమలను లొట్టలేసుకుంటూ తింటారు. సీతంపేట, పాలకొండ ప్రాంతాల్లో చెట్ల ఆకులపై పుల్లేరు చీమలు గూడులు కడతాయి. ఈ చీమలు కుడితే భరించలేని మంట ఉంటుంది. కానీ ఆ ప్రాంత గిరిజనులు మాత్రం ఆ చీమలను పట్టుకొని.. వాటితోనే వండుకొని తింటారు. వాటితోనే రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు.
Read Also: సుంకాల సవాల్.. ఇండియాకు ఇదో అవకాశం.. ఆనంద్ మహీంద్రా సూచనలు
ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు..
సాధారణంగా ఏప్రిల్( April) నుంచి ఆగస్టు వరకు ఈ పుల్లేరు చీమలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా చెట్టు ఆకులపై గూడులు కడతాయి. ఆగస్టు తరువాత ఆ చీమలకు రెక్కలు వస్తాయి. ఎగిరిపోతుంటాయి. అయితే ఇక్కడి గిరిజనులు చెట్లపై ఉండే చీమల గూళ్లను సేకరించి మంట పెడతారు. వాటిలో చీమలను, గుడ్లను వేరు చేస్తారు. ఆ చీమలను వండుకొని తింటారు. అయితే ఆ చీమలతో ఆరు రకాల వంటకాలు చేస్తారు. ఆ చీమలతో సూప్, సాంబారు, కూర, పచ్చడి, వేపుడు, పప్పు వంటివి వండుకుని తింటారు. చాలా రోజులుగా ఇదే అలవాటు చేసుకున్నారు గిరిజనులు. అలా చీమలను తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఈ సీజన్ వచ్చిందంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చీమల వేటలో ఉంటారు. ఎంతో ఇష్టంగా తింటారు.
Read Also: ఇక్కడ భర్తకు భార్య రాఖీ కడుతుంది.. చెట్లకు కూడా.. ఈ వింతకు కారణం ఏంటంటే?
వేరుగా గిరిజనుల సంస్కృతి
వాస్తవానికి గిరిజన ప్రాంతాల్లో జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. పార్వతీపురం మన్యం( parvatipuram manyam ) ప్రాంతంలోని పాలకొండ, సీతంపేట ఒడిస్సా కు అతి దగ్గరగా ఉంటాయి. ఒడిస్సా కు చెందిన గిరిజనులు ఎర్ర చీమలతో చట్నీ కూడా చేస్తుంటారు. మయూర్ భంజ్ జిల్లాలో చేసే చట్నీకి గత ఏడాది జి ఐ ట్యాగ్ లభించింది. కై చట్నీగా పిలిచే ఈ వంటకంలో పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. అక్కడ దొరికే చీమలతో పచ్చడి కూడా చేస్తారు. అడవిలో ఎర్ర చీమలను పట్టుకొని వచ్చిన తరువాత గిరిజనులు వీటిని దంచి పొడిచేసి ఎండబెడతారు. అవి బాగా ఎండిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉప్పు, మిరపకాయలు కలిపి మిక్స్ చేసి చట్నీ గా తయారు చేస్తారు. ఈ పచ్చడిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు గిరిజనులు. ప్రధానంగా దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది అంటున్నారు. అయితే దీనిని నిపుణులు ధ్రువీకరించిన దాఖలాలు లేవు. అయితే దశాబ్దాలుగా గిరిజనులు మాత్రం ఈ చీమలను తినడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు.