Gadwal District: వ్యవసాయం అనేది లాభదాయకమైనది కాదు. ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఇంటిల్లిపాది ఒళ్ళు వంచితే తప్ప పంట చేతికి రాదు. చేతికి వచ్చే సమయంలో ధర సరిగా ఉండదు. ఇక పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాతావరణంలో మార్పుల గురించి కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. స్థూలంగా చెప్పాలంటే వ్యవసాయం అనేది ఒక జూదం.. ఏ పంట కలిసి వస్తుందో.. ఏ పంట నిండా ముంచుతుందో చెప్పడం కష్టం. యాంత్రికరణ అనేది పెరిగిపోయినప్పటికీ.. సంకరజాతి వంగడాలు ఎక్కువైపోయినప్పటికీ.. రైతులకు స్థిరమైన ఆదాయం ఇప్పటికి రావడం లేదు. మరో పని చేయడానికి మనసు ఒప్పుకోక.. భూమిని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టం లేక చాలామంది నష్టాలను ఓర్చుకుంటూనే వ్యవసాయం చేస్తుంటారు. నేటి ఏ ఐ కాలంలోనూ వ్యవసాయం ప్రపంచంలో దాదాపు 80 శాతానికి పైగా జనాభాకు ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు ఈ భూమండలంలో ఉన్న మనుషుల ఆకలి మొత్తం వ్యవసాయమే తీర్చుతోంది.
వ్యవసాయంలో నష్టాలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది రైతులు సాగుకు దూరంగా ఉంటున్నారు. కొందరేమ భూమిని కౌలుకు ఇచ్చి నగరాలకు వలస వెళ్తున్నారు. ఇంకొందరేమో భూములను అమ్ముకొని వేరే పనులు చేసుకుంటున్నారు. కొంతమంది రైతులు మాత్రం ఉన్న భూమిలోనే ప్రయోగాలు చేస్తున్నారు. ఆ జాబితాలో ఈ రైతు ముందు వరుసలో ఉంటారు. పైగా వ్యవసాయంలో నిత్యం నూతనత్వాన్ని ప్రదర్శించాలని.. అప్పుడే లాభాలు వస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఈ రైతు సాధించిన గొప్పతనం ఏంటంటే…
ఆయన పేరు విజయభాస్కర్. తెలంగాణలోని గద్వాల జిల్లా సొంత ప్రాంతం. ఈయనకు ఆరు ఎకరాల భూమి ఉంది. గతంలో ఆ భూమిలో అనేక పంటలు సాగు చేసి నష్టపోయారు. ఇన్ని నష్టాలు వచ్చినప్పటికీ ఆయన భూమి మీద నమ్మకానికి కోల్పోలేదు. వ్యవసాయంపై ఇష్టాన్ని చంపుకోలేదు. తనకున్న ఆరు ఎకరాలలో భూమిని మొత్తం చదునుగా దున్నిచారు. అందులో సేంద్రియ ఎరువులు వేసి భూమికి జవసత్వం కల్పించారు. ఆ తర్వాత అనేకమంది శాస్త్రవేత్తలను కలిశారు. మేలైన దానిమ్మ ముక్కల గురించి తెలుసుకున్నారు. ఎంతో విజయానికి వచ్చి దానిమ్మ మొక్కలను కొనుగోలు చేసి నాటారు. ఆ తర్వాత డ్రిప్ విధానంలో మొక్కలకు నీరు పెట్టడం మొదలుపెట్టారు. తద్వారా నీటి వినియోగం కూడా తగ్గిపోయింది. మొక్కలు ఎదిగే వరకు అంతర పంటలు సాగు చేశారు. ఆ తర్వాత కాపు మొదలైంది.. అధునాతన వ్యవసాయం చేయడంతో కాపు కూడా మంచిగానే ఉంది. గింజల్లో నాణ్యత ఉండటంతో డిమాండ్ పెరిగింది. తద్వారా దానిమ్మకాయలను ప్రాసెస్ చేసి ఆయన ఇతర ప్రాంతాలకు అమ్మడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆరు ఎకరాలలో దానిమ్మ సాగు ద్వారా ఆయనకు 28 లక్షల నికర ఆదాయం వచ్చింది. ఇందులో పెట్టుబడిగా 16 లక్షల వెళ్లిపోగా ఆయనకు 12 లక్షల వరకు మిగిలాయి.
ఒకవేళ ఆ 6 ఎకరాలలో సంప్రదాయ విధానంలో వ్యవసాయం గనుక చేసి ఉంటే ఇంకా అప్పులే మిగిలేవి. కానీ ఆయన సేంద్రియ విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. వర్మీ కంపోస్ట్ ఎరువులను వాడారు. ఈ ఏడాది 40 టన్నుల వరకు దిగుబడి వస్తే.. వచ్చే ఏకంగా 100 టన్నుల వరకు దిగుబడిని లక్ష్యంగా పెట్టుకున్నామని విజయభాస్కర్ చెబుతున్నారు.