Niloufer Cafe Tea Master Salary: వద్దు ఈ చదువులు వద్దు.. డిగ్రీలు వద్దు.. ఈ బీటెక్ లు.. ఐటీ ఉద్యోగాలు వద్దే వద్దు. జస్ట్ చాయ్ తయారు చేయడం నేర్చుకుంటే చాలు.. జీవితంలో బిందాస్ గా బతుకవచ్చు. హైదరాబాదులో మై హోం లో ఖరీదైన ప్లాట్ కొనుక్కోవచ్చు. అవసరమైతే ఆడీ కారు కొనుగోలు చేసి దర్జా ప్రదర్శించవచ్చు. ఇదంతా చాయ్ మాస్టర్ గా పనిచేసి ఎలా సంపాదిస్తారు.. అని మీకు అనుమానం వస్తోంది కదా..
డాలీ చాయ్ వాలా గురించి మీకు తెలుసు కదా. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అతనికి సంబంధించిన ఏదో విషయం కనిపిస్తూనే ఉంటుంది. అంతటి బిల్ గేట్స్ కూడా తన దగ్గరికి వచ్చి చాయ్ తాగి వెళ్ళాడు. ఆ మధ్య ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీ జరిగినప్పుడు దుబాయ్ వెళ్ళాడు. ఐసీసీ విజ్ఞప్తి మేరకు అక్కడ చాయ్ తయారుచేసి టీమిండియా క్రికెటర్లకు సర్వ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా తన పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తున్నాడు. కోట్లు సంపాదించి.. పెద్ద పెద్ద సీఈవోలు కూడా కుళ్లుకునే విధంగా దర్జా ప్రదర్శిస్తున్నాడు.
డాలీ మాస్టర్ గురించి పక్కన పెడితే.. మన తెలుగు నేలలో.. తెలంగాణ రాష్ట్రంలో నిలోఫర్ కేఫ్ బాబురావు గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఆయన ఆమధ్య నెలకొల్పిన నిలోఫర్ కేఫ్ లో టీ ధర వెయ్యి రూపాయలు అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. మస్కా బన్ కు వందల రూపాయలు అంటే చాలామంది నిర్గాంత పోయారు. ఆ రేట్లతో బాబురావు వందల కోట్లు సంపాదిస్తున్నాడని అందరూ అనుకున్నారు. అతడు తయారు చేసే చాయ్ కి డిమాండ్ ఉంది.. కాబట్టి ఆ స్థాయిలో వసూలు చేయడంలో తప్పులేదు. పైగా అంత రేటు పెట్టినా చాయ్ తాగడానికి అతడి కేఫ్ కు వెళ్తున్నారు.
డబ్బులు వసూలు చేయడం మాత్రమే కాదు.. డబ్బులు ఇవ్వడంలో కూడా బాబురావు అదే స్థాయి పాత్ర పోషిస్తున్నాడు. తన నిలోఫర్ కేఫ్ లో పనిచేస్తున్న చాయ్ మాస్టర్లకు సంవత్సరానికి 60 లక్షల వరకు చెల్లిస్తున్నాడు. ప్రతినెలకు ఐదు లక్షలన్నమాట. దీనికి తోడు అదనపు సౌలభ్యాలు కూడా.. పిల్లల చదువులు.. మధ్యాహ్నం భోజనం.. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఆర్థికంగా సహాయం చేస్తూ బాబురావు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నేటి కాలంలో ఉద్యోగులతో పనులు చేయించుకుని.. అవసరం తీరిన తర్వాత మెడపట్టి బయటికి గెంటేసే యాజమాన్యాలు చాలా ఉన్నాయి. కానీ బాబురావు అలా కాదు.. తన వస్తువుకు డిమాండ్ పెంచుకున్నాడు. తన దగ్గర పని చేసే ఉద్యోగులకు మెరుగైన ఆర్థిక భరోసా కల్పిస్తున్నాడు. ఉద్యోగిని గొప్పగా చూసుకున్న ఏ సంస్థ అయినా సరే గొప్పగా వర్ధిల్లుతుంది. దానికి నిదర్శనమే కేఫ్ నీలోఫర్..
View this post on Instagram
