Monkey: ఆకలిగా ఉన్నప్పుడు ఇంత ముద్ద.. దాహంగా ఉన్నప్పుడు కాసిన్ని నీళ్లు.. నీడ లేనప్పుడు కూసింత ఆశ్రయం.. ఈ మూడు కల్పిస్తే చాలు జంతువులలో కొన్ని మనుషుల మీద విపరీతమైన ప్రేమను చూపిస్తాయి. అచంచలమైన వాత్సల్యాన్ని కనబరుస్తాయి.
కాలం మారుతున్నా కొద్దీ.. మనుషుల ప్రవర్తనలో మార్పు వస్తోంది గాని.. జంతువులలో రావడం లేదు. పైగా తమ ఆవాసాలను మనుషులు నాశనం చేస్తున్నప్పటికీ.. జంతువులు మనుషుల మీద ప్రేమను తగ్గించుకోవడం లేదు.. ఇక విశ్వాసం విషయంలో కుక్కను ప్రముఖంగా ప్రస్తావిస్తుంటాం. కుక్కకు మించిన విశ్వాసం ప్రపంచంలో ఏ జంతువుకూ ఉండదు.. మనుషులకూ ఉండదు. ఇదే విషయం అనేక సందర్భాలలో నిరూపితమైంది.. ఇక ఇటీవల కాలంలో కుక్కలు మనుషుల మీద చూపిస్తున్న విశ్వాసానికి సంబంధించిన సంఘటనలు సోషల్ మీడియా వల్ల వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఒక వానరం కుక్కను మించిన విశ్వాసాన్ని తనకు ఆకలి తీర్చిన వ్యక్తి మీద చూపించింది. తన వాత్సల్యాన్ని అతడి మీద చూపించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
https://x.com/bigtvtelugu/status/1932612746371346475
ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని డియో ఘర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. జార్ఖండ్ లోని డియో ఘర్ ప్రాంతానికి చెందిన మున్నాసింగ్ కు జంతువులు అంటే చాలా ఇష్టం. అతడు కోతులకు తరచు ఆహారం పెట్టేవాడు. అరటిపండ్లను.. గెలలకు గెలలు తెచ్చి వాటికి వేసేవాడు. ఆహారం వండి వాటి ఆకలి తీర్చేవాడు. గాయపడిన కోతులకు సా
పర్యాలు చేసేవాడు. అతడి ప్రేమను తట్టుకోలేక కోతులు దగ్గరికి వచ్చేవి. అతడితో సయాటలాడేవి. అయితే మున్నా సింగ్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.. ఈ క్రమంలో బంధువులు అతడి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. ఇక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా మున్నా సింగ్ మృతదేహం వద్దకు ఓ వానరం వచ్చింది. ఆ తర్వాత మృతదేహం నుదుటిమీద ముద్దులు పెట్టింది. గంటలు తరబడి అక్కడే కూర్చుంది. అంత కాదు మున్నా సింగ్ అంత్యక్రియలకు కూడా హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చర్చకు కారణమవుతోంది.
Read Also: బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చే సినిమా స్టోరీ ఇదేనా..?
” ఆ వానరానికి మున్నా సింగ్ ఆకలి తీర్చాడు. అండగా ఉన్నాడు. ఆవాసం కల్పించాడు. దానిని ముద్దు చేశాడు. అన్ని సందర్భాలలో ఆ వానరం మున్నా సింగ్ లో ఉన్న ప్రేమను చూసింది. అనంతరం అతడి వద్దకు అనేక సందర్భాలలో వచ్చింది. ఇతడు అందరిలాంటి మనిషి కాదు అని అనుకుంది. చివరికి మున్నా సింగ్ చనిపోవడంతో దాని గుండె పగిలింది. తన కడుపు నింపిన మున్నా సింగ్ చనిపోతే తట్టుకోలేకపోయింది. చివరికి అతడి నుదుటి మీద ముద్దులు పెట్టింది. అంత్యక్రియలు జరిగే వరకు అక్కడే కూర్చుంది. తన విశ్వాసాన్ని ప్రదర్శించిందని” మున్నా సింగ్ బంధువులు చెబుతున్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆ వానరం మరింత విషాదంలో మునిగిపోయింది.. అక్కడే తిరుగుతూ కనిపించింది.