Monkey With Mobile Phone: కోతి.. దాని చేష్టలే వింతగా ఉంటాయి. ఒక్కోసారి విస్తు గొల్పుతాయి కూడా. ఒక్కోసారి మరీ విచిత్రంగా ప్రవర్తిస్తాయి. కళ్ళు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తుంటాయి. వాటి మధ్య పెద్ద యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది. నచ్చే వస్తువు కోసం కోతుల మధ్య ఫైట్ నడుస్తుంది. చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కూడా. అటువంటిది ఓ కోతి ఆలయానికి వచ్చిన భక్తురాలు చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకుంది. దానిని ఇచ్చేందుకు చుక్కలు చూపించింది. ఎందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
* ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. అలానే శుక్రవారం ఓ భక్తురాలు తన చేతిలో సంచి ఒకవైపు.. సెల్ఫోన్ మరోవైపు పట్టుకొని వస్తుండగా ఎదురుగా ఒక కోతి వచ్చింది. చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని ఆలయంలోని గోడ పైకి ఎక్కింది. దాదాపు అరగంట పాటు ఆ ఫోన్ ఇవ్వలేదు. బుజ్జగించే ప్రయత్నం చేసిన ఫోన్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. మీరే రీల్స్ చూస్తారా.. నేను చూడకూడదా అన్నట్టు మారం చేసింది. తినేందుకు అరటిపళ్ళు, కొబ్బరి చిప్పలు ఇచ్చినా.. వాటిని తీసుకునేందుకు మాత్రం ఇష్టపడలేదు. అయితే అదే పనిగా వారు ప్రయత్నం చేశారు. ఆహార పదార్థాలను పెద్ద ఎత్తున దానికి సమర్పించారు. దీంతో అది ఆహారం చూసి ఆనందం పడింది. వాటిని తీసుకునేందుకు చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను అక్కడ జారవిడిచింది. దీంతో వారు హమ్మయ్య అంటూ సెల్ఫోన్ అందుకొని.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
* ఒక్కోసారి చుక్కలే..
సాధారణంగా కోతి అంటేనే చేష్టలకు మారుపేరు. అయితే అవి చేష్టలకు పాల్పడుతున్నంత సేపు చాలా బాగుంటుంది. ఒక్కోసారి మాత్రం అవి చేసే చర్యలు చాలా చికాకు పెడుతుంటాయి. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కోతుల సంతతి కనిపిస్తోంది. చివరకు నగరాలతో పాటు పట్టణాలను విడిచిపెట్టడం లేదు. అడవులు కనుమరుగవుతుండడంతో ఇలా వన్యప్రాణులు గ్రామాల బాట పడుతున్నాయి. ఆలయాల వద్ద భక్తులు ప్రసాదంతో పాటు పండ్లు లభిస్తుండడంతో అక్కడ వాలిపోతున్నాయి. అందుకే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి