Miracle birth in Jabalpur: ఎవరైనా గర్భిణి ప్రసవిస్తే మూడు కిలోల వరకు బరువు ఉంటే పండంటి పిల్లలు జన్మించారు అంటారు. కానీ ఈమె మాత్రం పండు కాదు.. అంతకుమించి అనే స్థాయిలో బాబుకు జన్మనిచ్చింది. అది కాస్త ఏకంగా రికార్డు అయింది. ఈ అద్భుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 34 సంవత్సరాల మహిళ ప్రసవం నిమిత్తం చేరింది. ఆమెకు 5వ నెల వచ్చినప్పటి నుంచే కడుపు కాస్త లావుగా కనిపించింది. అప్పట్లో వైద్యులు స్కానింగ్ చేసినప్పుడు శిశువు కాస్త బరువుగా ఉన్నాడని పేర్కొన్నారు. అయితే ఆమె కడుపులో ఉన్న శిశువు భారీగా ఉండడంతో సాధారణ ప్రసవం సాధ్యం కాదని చెప్పిన వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
శస్త్ర చికిత్స ద్వారా ఆమె కడుపులో ఉన్న శిశువును బయటకు తీశారు. మగ పిల్లాడు అని తేల్చారు. కాకపోతే ఆ బాలుడు 5.2 కిలోల బరువుతో పుట్టాడు. ఇంతటి బరువు ఉన్న శిశువును చూడడం ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు కూడా ఫోటో తీసుకొని సంబరపడ్డారు.. ఆ ఫోటోలో ఆ బాబు ఏడాది వయసు ఉన్న వాడిగా కనిపించడం విశేషం. సాధారణంగా పిల్లలు 2.5 నుంచి 3.2 కిలోల వరకు బరువుతో పుడతారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇంతటి బరువుతో పుడతారు. శరీరంలో చోటుచేసుకునే మార్పులు.. జన్యువులు.. ఇతర కారణాలవల్ల పిల్లలు ఇంత బరువుతో పుడతారని వైద్యులు చెబుతున్నారు.. ఆ మహిళ జన్యు నేపథ్యం వల్లే ఆ బాలుడు ఇంతటి బరువుతో పుట్టాడని వైద్యులు అంటున్నారు.
ప్రసవం పూర్తయిన తర్వాత ఆ బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని.. తల్లి కూడా ఆరోగ్యంగా ఉందని జబల్పూర్ వైద్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం తల్లిపాలు పడతామని పేర్కొన్నారు..” ఇంతటి బరువు ఉన్న బాలుడు పుట్టడం ఈ ఆసుపత్రిలో ఇదే తొలిసారి. అతడి బరువును చూస్తుంటే ఏడాది పిల్లాడి మాదిరిగా కనిపిస్తున్నాడు. అయితే ఈ బరువు స్థిరంగా ఉండదు. పిల్లలు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత బరువు తగ్గుతుంటారు. ఇతడు కూడా తగ్గుతాడు. అదృష్టవశత్తు ఇతడు తల్లిదండ్రులకు మధుమేహ నేపథ్యం లేదు. అందువల్ల ఎటువంటి కంగారు అవసరంలేదని” జబల్పూర్ వైద్యులు చెబుతున్నారు. ఇంత భారీ బరువు ఉన్న బాలుడిని చూసేందుకు అక్కడి వైద్య సిబ్బంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.