Loneliest House: పక్షయినా.. పశువైనా.. మనిషైనా.. ఒంటరిగా ఉండలేదు. మనుగడ సాగించలేదువు. భూమిపై ప్రతీ జీవరాశి సామూహికంగా, సమాజంగా జీవనం సాగిస్తాయి. చివరకు వృక్షాలు కూడా గుంపుగానే పెరుగుతాయి. ఎందుకంటే ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఒకప్పుడు ఉమ్మడి జీవన విధానం, ఉమ్మడి వ్యవసాయం ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు మాయమయ్యాయి. సమాజంలో ఉంటున్నా.. కుంటు సభ్యుల మధ్య ఉన్నా ఒంటరిగానే గడుపుతున్నారు. సెల్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు అన్నట్లు భావిస్తున్నారు. దీంతో బంధాలు, బాంధవ్యాలు దూరమవుతున్నాయి. అయితే ప్రపంచంలో ఓ దీవిలో ఒకే ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుతోనే ఆ దీవికి గుర్తింపు వచ్చింది. అయితే ఇక్కడ ఒకరోజు రాత్రి ఉంటే, ఆ అనుభవం ఎలా ఉంటుందో వివరించాడు ఒక యూట్యూబర్.
ఒంటరితనం కోసం..
కొందరు వ్యక్తులు ఏకాంతంగా గడపడానికి అప్పుడప్పుడు జనసంచారం లేని ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతుంటారు. ఇక ఒంటరితనం ఇష్టపడేవారు, అసలు నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఇల్లు కట్టుకొని సింగిల్‌గా ఉంటారు. ఇలాంటి కోరిక ఉన్న ఒక వ్యక్తి, సముద్రం మధ్యలో మారుమూల ప్రాంతంలో విసిరేసినట్లు ఉన్న ఒక ద్వీపంలో ఇంటిని నిర్మించాడు. అది నిర్మానుష ప్రాంతం. అక్కడ మనుషులు ఎవరూ ఉండరు. దీంతో దీనికి ప్రపంచంలోనే ఒంటరి ఇల్లుగా దానికి గుర్తింపు వచ్చింది.
ఎక్కడుందంటే..
యూరప్‌లోని ఐస్‌లాండ్ దక్షిణ తీరంలో అట్లాంటిక్ సముద్రంలో ‘ఎల్లియాయ్’ అనే ద్వీపం ఉంది. అక్కడి వెస్ట్‌మాన్ ద్వీపసమూహంలో ఇది ఒకటి. ఆ ద్వీపం మొత్తానికి ఒకే ఒక ఇల్లు ఉంది. ఎలాంటి మౌలిక వసతులు లేని ఈ ఐలాండ్‌లో ఇంటిని ఎందుకు నిర్మించారనే దానిపై స్పష్టత లేదు. అక్కడకు వెళ్లడం కూడా అంత ఈజీ కాదు. షిప్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని ఒంటరి ఇల్లుగా గుర్తింపు పొందిన ఈ నివాసాన్ని మూడేళ్ల క్రితం ర్యాన్ ట్రాహన్ అనే అమెరికన్ యూట్యూబర్ సందర్శించాడు. అక్కడ తన బసకు సంబంధించిన వివరాలను డాక్యుమెంట్ చేయడంతో ఆ ఒంటరి ఇల్లు గురించి ప్రపంచానికి తెలిసింది.
క్యాబ్‌లో ప్రయాణం
ఒక బిలియనీర్ అందించిన నిధులతో ఎల్లియాయ్ ద్వీపంలో ఏకాంత ఇంటిని నిర్మించారని ఐస్‌లాండ్ వాసులు చెబుతుంటారు. ఆ ఏకాంత ఇంటి విశేషాలేంటో తెలుసుకోవాలకున్న ర్యాన్ ట్రాహన్, 2019లో ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్ నుంచి క్యాబ్‌లో ఎల్లియామ్ ద్వీపానికి బయలుదేరాడు. అట్లాంటిక్ సముద్రం తీరం వరకు క్యాబ్‌లో ప్రయాణించి అక్కడి నుంచి పడవలో ద్వీపానికి చేరుకున్నాడు.
ముగ్గురు ప్రయాణం
స్థానిక విషయాలపై మంచి అవగాహన ఉన్న జార్ని సిగుర్డ్సన్ అనే వ్యక్తిని ర్యాన్ ట్రాహన్ అడ్వైజర్‌గా నియమించుకున్నాడు. రాగ్నర్ అనే మరో వ్యక్తి కూడా ఈ ప్రయాణంలో అతడికి సహాయం చేశాడు. లైఫ్ బోట్ మాదిరిగా ఉండే ఒక చిన్న పడవలో సముద్ర ప్రయాణం చేసి ఈ ముగ్గురు ఎల్లియామ్ ద్వీపం ఒడ్డుకు చేరుకున్నారు.
తాళ్ల సాయంతో ద్వీపం పైకి
ఈ ఐలాండ్ చాలా ఎత్తుగా కొండ మాదిరిగా ఉంది. పడవలో అక్కడికి చేరుకున్నారు కానీ, ద్వీపం పైకి చేరుకోవాలంటే నడిచి వెళ్లడానికి ఎటువంటి మార్గం లేదు. తాళ్ల సాయంతో పైకి ఎక్కాల్సి ఉంటుంది. వారు కూడా అలానే చేశారు. పచ్చిక, వన్యప్రాణులు తప్ప మరేమీ లేని ఇంటికి చాలా కష్టపడుతూ చేరుకున్నారు. ఆ ఇల్లు ఒక చిన్న క్యాబిన్ మాదిరిగా ఉంది. ర్యాన్ ట్రాహన్ అక్కడికి చేరుకున్న తరువాత 11,265వ విజిటర్‌గా గెస్ట్ బుక్‌లో సంతకం చేశాడు.
రాత్రి ఎలా ఉందంటే..
బాగా అలసిపోయిన ర్యాన్ ట్రాహన్, బ్జార్ని కలపతో తయారుచేసిన కూర్చీలపై కూర్చుని సేద తీరాడు. ఆహారం, నీళ్లు వంటి సదుపాయాలు అంతగా లేని ఈ ఏకాంత ఇంటిలో రెండు రోజులకు ఒకసారి మాత్రమే బాత్‌రూమ్‌కు వెళ్లినట్లు ర్యాన్ చెప్పుకొచ్చాడు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులు చేతికి అందే ఎత్తులో ఉన్నాయి. ర్యాన్ రాత్రికి ఒక గదిలో నిద్రపోయాడు. అది గదిలా కాదు, అటకలా ఉంది.
జీవరాశులే..
మరుసటి రోజు ఉదయం యుట్యూబర్ ర్యాన్ ద్వీప సందర్శనకు వెళ్లాడు. అక్కడ గొర్రెలు, పఫిన్లు, సీల్స్ వంటి జంతువులు నివసిస్తున్నాయి. ఈ ఇంటిని బిలియనీర్ నిర్మించారా అని ర్యాన్ అడిగాడు. అందుకు జార్ని సమాధానం ఇస్తూ ఈ ద్వీపంలో అరుదైన పఫిన్‌లను అధ్యయనం చేయడానికి వచ్చే పక్షి శాస్త్రవేత్తల అకామడేషన్ కోసం ఈ ఇంటిని నిర్మించారని చెప్పాడు.