Karimnagr Petrol Bunk: ప్రస్తుతం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజూ 46 సెంటిగ్రేడ్ కంటే తక్కువగా నమోదు కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు చల్లదనం కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పటికే కూలర్లు, ఏసీలు బిగించుకుకొని వాటి ముందు నుంచి కదలడం లేదు. అత్యవసరం లేని వారు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదు. కానీ కొన్ని సంస్థలు, కంపెనీలు తప్పనిసరిగా వర్క్ చేయాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని ఎండవేడికి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ముఖ్యంగా పెట్రోల్ బంక్ లు ఎండవేడికి హీట్ అయి నష్టపోయే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఓ బంక్ యజమాని చల్లదనం కోసం ఓ ఏర్పాటు చేశాడు. అదేంటో చూడండి..
తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లపై జనం కనిపించడం లేదు. కానీ కొన్ని సంస్థలు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. చికెన్ సెంటర్లు, ఇతర షాపు నిర్వాహకులు ఎంత ఎండ ఉన్నా నిర్వహించాల్సిన పరిస్థితి. చికెన్ సెంటర్ నిర్వాహకులు నిత్యం కోళ్లపై నీళ్లు చల్లుతూ కాపాడుతున్నారు. కొందరు షాపు నిర్వాహకులు ప్రత్యేకంగా కూలర్లు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
ఓ పెట్రోల్ బంక్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. కరీంనగర్ లోని మల్కాపూర్ రోడ్డులో జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ లో స్పింకర్లు ఏర్పాటు చేశారు. ఈ పెట్రోల్ బంక్ చుట్టూ వీటిని పెట్టడంతో అందులో నుంచి తుంపర్లు పడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా చల్లగా ఏర్పడింది. సాధారణంగా వీటిని పెట్రోల్ బంక్ చల్లదనం కోసం ఏర్పాటు చేశారు. కానీ ఇటువైపు నుంచి వెళ్లే ప్రజలు ఇక్కడ కాసేపు ఆగుతున్నారు. కొందరు పనిలో పనిగా ఇక్కడే పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.
దీంతో ఈ పెట్రోల్ బంక్ రద్దీగా మారింది. చల్లదనం కోసం ఈ బంక్ యజమాని ఏర్పాటు చేసిన ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారు. వాస్తవానికి ఇలాంటి స్పింకర్లు కోళ్ల ఫాంలో ఏర్పాటు చేస్తారు. కానీ పెట్రోల్ బంకుల్లోనూ ఉష్ణోగ్రత ఎక్కువ అయితే అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు.