Dubai Rains: తీవ్రమైన ఎండలు, పొడి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వర్షాలకు దుబాయ్‌లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు జనజీవనం స్తంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 142 మి.మీల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈతరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అధికారుల పేర్కొటున్నారు. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కుండపోత వానలకు క్లౌడ్ సీడింగ్ కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అత్యంత వేడి వాతావరణం..
భూమిపై అత్యంత వేడి, పొడి ప్రాంతంలో యూఏఈలో ఉంటుంది. వేసవిలో ఇక్కడ గరిష్టంగా 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక వార్షిక వర్షపాతం సగటున 200 మి.మీల లోపు నమోదవుతుంది. దీంతో భూగర్భజల వనరులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు కృత్రిమ వర్షాలను కురిపించే క్లౌడ్ సీడింగ్ పద్ధతిని యూఏఈలో ఎప్పటినుంచో అమలు చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా తాగునీరు అందించడమే ఈ క్లౌడ్ సీడింగ్ ఉద్దేశం. అయితే ఈ విధానం కొన్నిసార్లు ఆకస్మిక వరదలకు కారణమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
1980లో పరీక్షలు..
కృత్రిమ వర్షాలను కురిపించే పద్ధతిని యూఏఈ 1982 తొలినాళ్లలోనే పరీక్షించింది. అనంతరం అమెరికా, దక్షిణాఫ్రికా. నాసాకు చెందిన పరిశోధన బృందాల సహాయంతో 2000 తొలినాళ్లలోనే క్లౌడ్ సీడింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎమిరేట్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (ఎన్‌సీఎం)తో కలిసి యూఏఈ రెయిన్ ఎన్హాన్‌మెంట్ ప్రోగ్రాం (యూఏఈఆర్‌ఈపీ) దీనిని చేపడుతోంది. వాతావరణ మార్పులను ఇక్కడి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. యూఏఈతోపాటు ఈ ప్రాంతంలోని సౌదీ అరేబియా, ఒమన్ కూడా కూడా కృత్రిమ వర్షాల కోసం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.
ప్రయోజనాలతో పాటే..
సాధారణంగా క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో సిల్వర్ అయోడైడ్ రసాయనం వాడతారు. ఈ తరహా హానికర రసాయనాలకు దూరంగా ఉన్న యూఏఈ క్లౌడ్ సీడింగ్‌కు సాధారణ లవణాలనే వినియోగిస్తుంది. టైటానియం ఆక్సైడ్ పూత కలిగిన ఉప్పుతో నానో మెటీరియల్‌ను ఎన్సీఎం అభివృద్ధి చేసింది. ఇలా నీటి సంక్షోభం ఎదుర్కొనేందుకు యూఏఈ వినూత్న విధానం అనుసరిస్తోంది. స్థానిక అవసరాల కోసం చేపట్టే కృత్రిమ వర్షాలతో తాత్కాలికంగా ప్రయోజనాలు ఉన్నా ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో వర్షాలు కురిపించాలంటే కరవుకు కారణమవుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా సహజ వనరుల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.