IT Employees Agriculture: కొన్ని సంవత్సరాలుగా ఐటీ పరిశ్రమలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న విభాగాలన్నీ మూతపడుతున్నాయి. దీనికి తోడు సేవలలో అంతగా గిరాకీ లేకపోవడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. ఉద్యోగులను మొహమాటం లేకుండా బయటికి గెంటేస్తున్నాయి. సంవత్సరాలకు సంవత్సరాలు సంస్థలు నమ్ముకొని పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కూడా ఏమాత్రం కనికరం చూపించడం లేదు. టిసిఎస్ నుంచి మొదలు పెడితే యాక్సెంచర్ వరకు అన్ని కంపెనీలలో పరిస్థితి దాదాపు ఇలానే ఉంది.
ఉద్యోగులను అడ్డగోలుగా తొలగించడంతో ఉన్నవారి మీద పని ఒత్తిడి అధికంగా పడుతోంది. బయటికి వెళ్తే కొత్త ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంటున్న నేపథ్యంలో ఉద్యోగులు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ తప్పక, తలవంచుకొని పనిచేస్తున్నారు. పని ఒత్తిడి అధికంగా ఉండడంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. రకరకాల వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, మెదడు సంబంధిత రుగ్మతలతో నరకం చూస్తున్నారు. కొందరైతే మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా ఐటీ ఉద్యోగులలో తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి.
ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడంతో చాలామంది ఐటీ పరిశ్రమను వీడి వెళ్లాలని భావిస్తున్నారు. కొందరైతే వ్యవసాయమే మెరుగైన మార్గమని భావించి.. సాగులోకి వస్తున్నారు. సంపాదించిన డబ్బులతో కొంతమేర భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారు. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, ఉద్యాన పంటల సాగు, పండ్ల తోటల సాగు చేపడుతున్నారు. కొందరైతే భూములను ఎక్కువగా కౌలుకు తీసుకొని పూలను కూడా సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో ఇటీవల కాలంలో యాంత్రికరణ పెరిగిపోయింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కూడా అధికమైపోయింది. దీనికి తోడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇటీవల కాలంలో విపరీతమైన ప్రాచుర్యం పొందింది.
మహర్షి సినిమాలో చూపించినట్టుగా వీకెండ్ ఫార్మింగ్ ఐటీ ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అయితే ఉద్యోగంలో స్థిరత్వం అనేది లేకపోవడంతో చాలామంది లాంగ్ స్టాండింగ్ ఫార్మింగ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యవసాయంలో అంతగా ఒత్తిడి ఉండదు. పండిన పంటలను ఇతర ప్రాంతాలకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా ఐటి ఉద్యోగులకు సాంకేతిక పరిజ్ఞానంపై విపరీతమైన పట్టు ఉంటుంది కాబట్టి.. పండిన పంటలను రకరకాలుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అందువల్లే ఐటీ ఉద్యోగులు వ్యవసాయం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యవసాయంలో శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి.. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారు.