India vs USA healthcare: అభివృద్ధి చెందిన దేశాలు అంటే మనకు అమెరికా గుర్తుకొస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన దేశమంటే మనకు జపాన్ గుర్తుకొస్తుంది. పీస్ ఫుల్ కంట్రీ అంటే నార్వే లేదా స్విజర్లాండ్ లేదా న్యూజిలాండ్ మదిలో మెదులుతుంది. కానీ, ఈ దేశాలలో లేని క్వాలిటీ మన దగ్గర ఉంది. అదే మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గొప్పగా నిలబెడుతోంది.
ఎవరికైనా అనారోగ్యం కలిగితే వెంటనే వెళ్ళేది ఆసుపత్రికి. అక్కడ వెంటనే సత్వర చికిత్స అందితే రోగి ప్రాణాలకు భరోసా ఏర్పడుతుంది. తద్వారా అతడు కోలుకొని మామూలు మనిషి అవుతాడు. అలాకాకుండా రోజుల తరబడి చికిత్స పేరుతో కాలయాపన చేస్తే.. అతడికి వచ్చిన వ్యాధి తగ్గకపోగా.. మరింత ఇబ్బంది ఎదురవుతుంది. ఈ సమయంలో అతను మామూలు మనిషి కావడం దాదాపు అసాధ్యమవుతుంది. అత్యవసర వైద్యం అందించడంలో ప్రపంచ దేశాల కంటే భారత్ ముందు వరుసలో ఉంది.
మనదేశంలో ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాలను హెల్త్ టూరిజం సెంటర్లు అని పిలుస్తుంటారు. కెన్యా నుంచి మొదలు పెడితే ఉగాండా వరకు రోగులు మన దగ్గరికి వస్తారు. బైపాస్ సర్జరీ నుంచి మొదలు పెడితే నీ రీప్లేస్మెంట్ వరకు అన్ని శస్త్ర చికిత్సలను ఇక్కడే చేయించుకుని వెళ్తారు. దీనంతటికీ ప్రధాన కారణం వైద్య విధానంలో మన దగ్గర ఉన్న సౌలభ్యతలే. వైద్య విధానంలో మన దేశంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. సౌలభ్యతలు కూడా ఉన్నాయి. అందువల్లే ప్రపంచ దేశాల నుంచి రోగులు మన దగ్గరికి వస్తుంటారు. ఇతర దేశాలలో వైద్య విధానాలలో విపరీతమైన సంక్లిష్టతలు ఉంటాయి. అందువల్లే రోగులకు సకాలంలో వైద్య చికిత్స అందదు.
ఉదాహరణకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ విభాగాన్ని గనక తీసుకుంటే.. పోలాండ్ దేశంలో వెయిటింగ్ టైం 253 రోజులు, ఆస్ట్రేలియాలో 209 రోజులు, స్పెయిన్ దేశంలో 140 రోజులు, కెనడాలో 122 రోజులు, యునైటెడ్ కింగ్డమ్ లో 98 రోజులు ఉంటుంది. అదే మనదేశంలో అయితే సర్జరీ అయిన మూడు రోజుల్లోనే ఇంటికి వెళ్లొచ్చు. పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఇటీవల కాలంలో రోబోటిక్స్ విధానాన్ని అనుసరిస్తున్నారు.. అందువల్లే ఇండియా ఇంటర్నేషనల్ హెల్త్ క్యాపిటల్ గా మారింది