Hush Dating: నేటి తరం యువతీ యువకులకు విపరీతమైన స్వేచ్ఛ ఉంది. అపరిమితమైన ఆర్థిక స్థిరత్వం ఉంది. నర మీద పుండు.. నడ మంత్రపు సిరి నిలబడనీయదన్నట్టుగా.. నేటి తరం చేస్తున్న వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి.. అయితే మనదేశంలో అందరి యువతకంటే హైదరాబాద్ యువత కాస్త డిఫరెంట్.. ఏ విషయాన్నయినా సరే తొందరగా అందిపుచ్చుకునే తత్వం హైదరాబాద్ యువతకు ఉంటుంది.
హైదరాబాద్ యువత ప్రస్తుతం హుష్ డేటింగ్ వెంట పరుగులు పెడుతోంది. ఇప్పుడు ఈ ట్రెండ్ హైదరాబాదులో విస్తృతంగా కనిపిస్తోంది. తల్లిదండ్రులు నిత్యం నిఘా పెట్టడం.. సామాజికపరంగా ఒత్తిళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో యువత మరో మార్గాన్ని ఎంచుకున్నది. దాని పేరే హుష్ డేటింగ్. దీని పేరులో ఉన్నట్టుగానే ఇందులో యువత అత్యంత గోప్యత పాటిస్తుంది.. సాధారణంగా మనం ఎవరినైనా నిశ్శబ్దంగా ఉండాలంటే హుష్ అని సంకేతం ఇస్తాం కదా.. ఇది కూడా అటువంటిదే..
యువతీ యువకులు తమ ప్రేమ సంబందాలను, స్నేహానికి సంబంధించిన వ్యవహారాలను ఎక్కడా కూడా బయటకు రాకుండా జాగ్రత్త వహిస్తారు . ఫోన్లు కూడా చేసుకోరు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా ప్రభావితం కారు. రహస్యంగా గ్రూప్ చాట్ చేసుకుంటారు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ లు ఉపయోగిస్తారు. బహిరంగంగా అసలు మాట్లాడుకోరు. హుష్ అనే తీరుగా సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఇక కలిసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వీరు కలుసుకోరు. నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ కాఫీ షాపులు లేదా, ఇతర మాల్స్ లో దూరంగా కూర్చుంటారు. అక్కడ కూడా ఎక్కువగా మాట్లాడుకోరు. సాధారణ మిత్రుల మాదిరిగా కలుస్తారు. ఎవరూ పెద్దగా గుర్తుపట్టకుండా జాగ్రత్తలు వహిస్తుంటారు.
సోషల్ నిపుణుల మాటల ప్రకారం ఇది పూర్తిగా డిజిటల్ యుగం. యువత విపరీతమైన స్వేచ్ఛ కోరుకుంటున్నది. మరోవైపు కుటుంబానికి సంబంధించిన పరిమితులు కూడా అధికంగా ఉన్నాయి.. అందువల్లే యువత హుష్ డేటింగ్ వెంట పరుగులు తీస్తోంది. నగర జీవనశైలి.. మారుతున్న కొద్దీ ఇటువంటి రహస్య విధానాలు కొనసాగుతూనే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొందరైతే ఈ విధానం సరి కాదని చెబుతుంటే.. మరికొందరేమో యువతకు ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నేటి కాలంలో ఇటువంటి ట్రెండ్స్ కామన్ అయిపోయాయని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.