How does a cyclone form: సముద్రం లో ఏర్పడే మార్పులే తుఫాన్లకు దారి తీస్తాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పులు ఏర్పడినప్పుడు.. అందులో వాతావరణం విభిన్నంగా మారుతుంది. అది కాస్త తుఫాన్ల కు దారి తీస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఏర్పడిన మొంథా తుఫాన్ కూడా అలాంటిదే.
సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడటం సర్వసాధారణం. అయితే అల్పపీడనం ఏర్పడిన నాటి నుంచి అది తుఫాన్, అతి తీవ్రమైన తుఫాన్ గా ఏర్పడేంతవరకు ఎన్నో దశలు ఉంటాయి. అయితే ఇందులో కొన్ని అల్పపీడన దశలో.. ఇంకా కొన్ని వాయుగుండం దశలో తీరం దాటుతుంటాయి. తీరం దాటి నేల మీదికి వస్తుంటాయి. వాతావరణ శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం తుఫాన్ ను దాని గమనం నిర్దేశిస్తుంది. తుఫాన్ గమనంలో కేంద్ర స్థానం ముఖ్య పాత్ర పోషిస్తుంది. దాని గమనం ఆధారంగానే తీవ్రత ఉంటుంది. శక్తివంతమైన తుఫాను ఏర్పడినప్పుడు దానికి కేంద్ర స్థానంలో ఉండే ప్రాంతాన్ని “కన్ను” అని పిలుస్తుంటారు. కన్ను ప్రాంతంలో వాతావరణం ఎటువంటి ఆటుపోట్లకు గురికాదు. అక్కడ వాతావరణం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. గాలి కూడా సాధారణంగానే ఉంటుంది. కొన్ని సందర్భాలలో గాలి ఏమాత్రం ఉండదు.. అక్కడ వర్షం కురిసే అవకాశం కూడా ఉండదు.
కన్ను ప్రాంతంలో ఉండే వలయాన్ని కన్ను గోడలు అంటారు. కన్ను ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ మాత్రం విపరీతంగా గాలులు వీస్తూ ఉంటాయి. వర్షాలు కురుస్తూ ఉంటాయి. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఇక్కడ కురుస్తూ ఉంటాయి. మేఘాలు, ఉరుములు, మెరుపులు ఏర్పడతాయి. చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. తుఫాన్ ఏర్పడినప్పుడు కేంద్ర స్థానంలో విస్తృతి అనేది పది నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కంటి గోడల విస్తృతి 225 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
తుఫాన్ అనేది తీరం దాటిన తర్వాత మళ్లీ సముద్రంలోకి వెళ్లడం అనేది అత్యంత అరుదుగా చోటు చేసుకుంటుంది. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం తుఫాన్లు తీరాన్ని దాటిన తర్వాత బలహీనమవుతాయి. మూడు సంవత్సరాల క్రితం ఏర్పడిన తుఫాన్ కు “అనని” అని పేరు పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా కృత్తివెన్ను ప్రాంతంలో తీరం దాటింది. ఆ తర్వాత వాయుగుండం గా మారింది. అనంతరం బలహీనపడి తీరం వెంట పరుగులు పెట్టింది. ఆ తర్వాత కాకినాడ ప్రాంతంలో సముద్రంలోకి వెళ్లిపోయింది..
వాతావరణ శాస్త్రవేత్తలు తుఫానును పలానా ప్రాంతంలో తీరం దాటిందని చెబుతుంటారు. కానీ తీరం దాటే చోట గాలి ఉండదు. వాన అసలు కురవదు. ఆ ప్రాంతంలో సముద్రం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే తుఫాన్ కేంద్ర స్థానం వద్ద ఎటువంటి అలజడి ఉండదు. కేంద్ర స్థానం దాటిన తర్వాతే తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుంది. అందువల్ల తుఫాను తీరానికి దగ్గరవుతున్న క్రమంలో భారీ వర్షాలు కురుస్తూ ఉంటాయి. గాలులు వీస్తూ ఉంటాయి. తీరం దాటిన తర్వాత ఎటువంటి ప్రభావం ఉండదనుకుంటే మాత్రం నష్టం దారుణంగా ఉంటుంది. అందువల్లే ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది..ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1979 మే నెలలో తుఫాన్ ఏర్పడింది. దాని విస్తృతి ఏకంగా 425 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ ప్రకారం కేంద్ర స్థానం నుంచి 425 కిలోమీటర్ల పరిధిలో అది ప్రభావం చూపించింది. హుద్ హుద్ తుఫాను విస్తృతి 44 నుంచి 66 కిలోమీటర్ల వరకు విస్తృతిని చూపించడం విశేషం.