Guitar forest: నేటి కాలంలో ప్రేమకు అర్థం మారుతుంది. బంధాలకు విలువ లేకుండా పోతోంది. అందువల్లే అనుబంధాలు మాయమవుతున్నాయి. మనుషుల మధ్య అనురాగాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.. ఆప్యాయతలు, అనురాగాలు వర్ధిల్లాలిసినచోట కోపాలు, తాపాలు, అనుమానాలు బలపడుతున్నాయి. తద్వారా మనుషులు దూరంగా ఉంటున్నారు.. ఇలాంటి చోట ప్రేమకు ఆస్కారం ఉండడం లేదు.. ఆప్యాయతకు అవకాశం ఉండడం లేదు.
కేవలం బంధువుల మధ్య మాత్రమే కాదు.. భార్యాభర్తల మధ్య కూడా అంత గొప్పటి ప్రేమలు నేడు కనిపించడం లేదు. భర్త ఉండగానే భార్య మరో వ్యక్తితో.. భార్య ఉండగానే భర్త మరో మహిళతో సంబంధాలు పెట్టుకోవడం.. విడాకులు తీసుకోవడం.. లేనిపక్షంలో దారుణాలకు పాల్పడడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయింది. అయితే ఇలాంటి కాలంలో కూడా ఓ భర్త గొప్ప పని చేశాడు. తన భార్య భూమ్మీద లేకపోయినప్పటికీ.. ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటూ ఒక అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టాడు.
అతడి పేరు ఫెడ్రో మార్టిన్ యూరేటా.. ఇతడి సొంత దేశం అర్జెంటీనా. ఆ దేశంలో ఇతడు ఒక రైతు.. ఇతడికి గ్రాసియోలా అనే భార్య ఉంది. భార్య అంటే ఫెడ్రో మార్టిన్ యూరేటా విపరీతమైన ఇష్టం. ఆమెతో నిత్యం సరదాగా సంభాషించేవాడు. ఆమెతో కాలాన్ని అద్భుతంగా గడిపేవాడు. ఉదయం లేచిన దగ్గర్నుంచి మొదలుపెడితే రాత్రి పడుకునే వరకు ఆమె సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాడు. అటువంటి గ్రాసియోలా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్ను మూసింది. ఆమె వియోగాన్ని తట్టుకోలేక.. ఫెడ్రో మార్టిన్ యూరేటా విపరీతంగా బాధపడ్డాడు. ఆమె జ్ఞాపకార్థంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే తన పిల్లలతో కలిసి పొలంలో ఏడు వేల సైప్రస్, నీలిరంగు యూకలిప్టస్ చెట్లతో గిటార్ ఆకృతితో ఒక అడవిని పెంచాడు.. గడిచిన 40 సంవత్సరాలుగా ఈ అడవిని అతడు కాపాడుతూ వస్తున్నాడు. ఆకృతి ఏ మాత్రం చెక్కుచెదరకుండా చూసుకుంటున్నాడు. విమానం నుంచి చూసేవాళ్ళకు.. శాటిలైట్ తీసే చిత్రాల్లో ఈ గిటార్ అడవి కంటికి అందంగా కనిపిస్తూ ఉంటుంది. అతడి ప్రేమలో గొప్పతనాన్ని చాటుతూ ఉంటుంది. అప్పట్లో తన భార్య ముంతాజ్ మహల్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టిస్తే.. ఫెడ్రో మార్టిన్ యూరేటా ఏకంగా గిటార్ ఆకృతిలో అడవిని పెంచుతున్నాడు. కొన్ని ప్రేమలు గొప్పగా ఉంటాయి. ఆ ప్రేమలను కలకాలం కాపాడుకోవడానికి వారు చేసే పనులు అద్భుతంగా అనిపిస్తాయి.. ఫెడ్రో మార్టిన్ యూరేటా చేసిన పని కూడా అటువంటిదే.