Effects Of Smoking On Health: పొగ తాగని వాడు దున్నపోతై పుడతాడని వెనకటికి ఓ నాటకంలో ఉండేది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ.. ఈ కాలంలో మాత్రం ధూమపానం చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. సరదాగా మొదలైన అలవాటు చివరికి వ్యసనంగా మారిపోతుంది.
మన దేశంలో ధూమపానం చేసే వారి సంఖ్య ఏటికి ఏడు పెరుగుతోంది. మనదేశంలో నాణ్యమైన పొగాకు లభించడం వల్ల.. సిగరెట్లు, బీడీల తయారీ భారీగానే సాగుతోంది. బీడీల తయారీకి కావలసిన తునికాకు విస్తారంగా లభించడంతో.. బీడీ తయారీ పరిశ్రమ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక సిగరెట్లలో ప్రధానంగా ఉపయోగించే లంక పొగాకు మన దేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో పండుతోంది. దీంతో సిగరెట్ తయారీ కూడా అంతకుమించి అనే రేంజ్ లోనే నడుస్తోంది..సిగరెట్లు ఆరోగ్యానికి ప్రమాదకరమైన తెలిసినప్పటికీ.. వాటి వల్ల రకరకాల సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ చాలామంది ఆ వ్యసనాన్ని మానుకోలేక పోతారు. సరదాగా మొదలైన ఈ అలవాటు చివరికి వ్యసనం లాగా మారిపోవడమే అసలైన విషాదం..
మనదేశంలో సిగరెట్ తాగే వారి సంఖ్య పెరిగిపోతుంది. గతంలో మగవారు మాత్రమే సిగరెట్ తాగేవారు. కానీ ఇప్పుడు మేమాత్రం తక్కువా అని ఆడవాళ్లు కూడా తెగ తాగేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు గుప్పు గుప్పుమని సిగరెట్లను తాగేస్తున్నారు. అయితే ఈ సిగరెట్లను మానుకోకపోవడానికి ప్రధాన కారణం అందులో ఉండే రకరకాల రసాయనాలు. సిగరెట్ తయారీకి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. సిగరెట్ పొగలో శవాలను భద్రపరచడానికి ఉపయోగపడే ఫార్మల్ డిసైడ్ అనే రసాయనం ఉంటుంది. బాత్రూం శుభ్రం చేయడానికి ఉపయోగించే అమోనియా కూడా ఇందులో కలుపుతారు. ఎలుకలను చంపడానికి ఉపయోగపడే ఆర్సైనిక్, బ్యాటరీలలో ఉండే కాడ్మియం, వాహనాల పొగ నుంచి వెలువడే ప్రాణాంతకమైన కార్బన్ మోనాక్సైడ్ వంటివి సిగరెట్ పగల ఉంటాయి. నల్లి మందుల వాడే నాఫ్తాలిన్, రాకెట్ ఇంధనం లో ఉపయోగించే మెథనాల్, పురుగు మందుల తయారీలో ఉపయోగించే నికోటిన్, తారు రోడ్లు వేయడానికి ఉపయోగించే టార్, రంగుల తయారీలో అవసరమయ్యే టోలుయూన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను సిగరెట్ తయారీలో ఉపయోగిస్తుంటారు.. అందువల్లే అవి క్యాన్సర్, ఇతర రోగాలను కలిగిస్తాయని వైద్యులు చెబుతుంటారు. అందువల్లే సాధ్యమైనంత వరకు సిగరెట్ తాగడాన్ని తగ్గించుకోవాలని.. వీలుంటే పూర్తిగా మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు..
అదేపనిగా సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్, ఉదర సంబంధ వ్యాధులు, కాలేయ సంబంధి వ్యాధులు వస్తుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం మనదేశంలో సిగరెట్ తాగే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే ఇందులో ఆడవాళ్ళ సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం వ్యాధులు మాత్రమే కాకుండా.. లైంగిక పరంగా కూడా సమస్యలు వస్తాయని.. దానివల్ల ప్రత్యుత్పత్తి కి తోడ్పడే అవయవాలు నాశనమవుతాయని.. హార్మోన్లు కూడా సరిగ్గా రిలీజ్ కాక.. శరీరం రోగాల పుట్టగా మారుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.