Dolly Chaiwala: ప్రపంచంలో పేరు మోసిన కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తాయి.. అందులో షేర్లు కొనడానికి చాలామంది ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. ముఖ విలువ ఎంత చెల్లించి అయినా సరే.. షేర్లు సొంతం చేసుకోవాలని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ కంపెనీలకు ఉన్న చరిత్ర అటువంటిది. పైగా రూపాయి పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయనే నమ్మకం అందరిలోనే ఉంటుంది. అందువల్లే ఆ పని చేస్తుంటారు. కానీ అసలు కంపెనీకి ఎటువంటి చరిత్ర లేకుండా.. జస్ట్ ఒక ప్రకటన చేస్తే పోలోమని ఎవరూ రారు. లక్షలకు లక్షలు చెల్లించరు. కానీ ఇతడు ఒక్క ప్రకటన చేయగానే వేలం వెర్రిగా జనం వచ్చారు. అంతేకాదు 350 కోట్లు సమర్పించుకున్నారు. ఇంతకీ అతడు ఎవరు.. చేసిన ప్రకటన ఏంటి.. ఇదంతా ఎందుకు జరిగిందంటే..
మహారాష్ట్రలోని పూణేలో డాలీ చాయ్ వాలా గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియా వల్ల ఇతడు ఒకసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. ఇతడు చాయ్ తయారు చేసే విధానం విచిత్రంగా ఉంటుంది. రుచి కూడా అమోఘంగా ఉంటుంది. అంతటి బిల్ గేట్స్ కూడా ఆమధ్య ముఖేష్ అంబానీ ఇంట్లో ఏదో వేడుక జరిగినప్పుడు వచ్చాడు. దానికంటే ముందు డాలీ చాయ్ వాలా ను కలిశాడు.. అతడు తయారుచేసిన చాయ్ తాగి మై మరిచిపోయాడు. ఆ తర్వాత డాలి దుబాయ్ వెళ్లి.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న టీమ్ ఇండియాకు చాయ్ తయారు చేసే పోశాడు. ఇలా అతని ప్రస్థానం అంతకంతకు పెరిగిపోయింది. సోషల్ మీడియాలో అతనికంటూ సంఘాలు కూడా ఏర్పాటయ్యాయి. అయితే ఈ క్రేజ్ ఇక్కడితోనే అతడు ఆపలేదు. తనకు ఇంతటి కీర్తిని సంపాదించి పెట్టిన చాయ్ ని అతడు వదిలిపెట్టలేదు. తన ఉన్నతికి కారణమైన చాయ్ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు.
తన పేరు మీదనే డాలి చాయ్ వాలా అనే బ్రాండ్ ఏర్పాటు చేశాడు. ఫ్రాంచైజీలు ఇస్తానని ప్రకటించాడు. ఒక్కో ఔట్లెట్ కు 40 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నాడు. చక్కర దగ్గర నుంచి మొదలు పెడితే టీ పౌడర్ వరకు తామే సప్లై చేస్తామని.. స్థలం చూపిస్తే కష్టమైజ్ సెటప్ మొత్తం చేస్తామని ప్రకటించాడు. సోషల్ మీడియాలో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండడం.. అతడు చేసిన ప్రకటన నచ్చడంతో చాలామంది ముందుకు వచ్చారు. ఏకంగా 1600 వరకు అప్లికేషన్ వచ్చాయి. మొత్తంగా 350 కోట్ల వరకు అతనికి సమకూరింది.. దీంతో అతడు తనకు వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా టీ షాపులను కష్టమైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే నార్త్ ఇండియాలో కొన్ని షాపులను సెట్ అప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సౌత్ ఇండియాలో కూడా ప్రవేశిస్తున్నట్టు సమాచారం. పెద్ద పెద్ద చదువులు చదువుకోక పోయినప్పటికీ.. గొప్ప నేపథ్యం లేకపోయినప్పటికీ.. కష్టాన్ని నమ్ముకుని డాలీ ఇక్కడ దాకా వచ్చాడు. తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నాడు.