Ambassador: అంబాసిడర్.. వాహన శ్రేణిలో అదో బ్రాండ్. ఇప్పటికీ ఆ వాహనాన్ని గుర్తు చేసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే మోటార్ ఫీల్డ్ లోనే ఒక ప్రత్యేకత దానిది. బ్రిటిష్ మూలాలు ఉన్నప్పటికీ.. అంబాసిడర్ ను భారతీయ కారుగానే పరిగణిస్తారు. గతంలో అంబాసిడర్ కారుపై వెళ్తుంటే ఆ దర్పమే వేరు. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’ గా అంబాసిడర్ కు పేరు ఉంది. ఇండియన్ ఆర్మీ అధికారుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అంబాసిడర్ కారుని వినియోగించేవారు. 90వ దశకంలో అంబాసిడర్ కారు ఉంటే సంపన్న వర్గాలకు చెందిన వారేనని భావించేవారు. ఈ వాహనం ఒక స్టేటస్ కి సింబల్ గా ఉండేది. అయితే మారుతున్న జనరేషన్ కి తగ్గట్టు కారు అప్డేట్ కాకపోవడంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.
కనుమరుగైన ఓ బ్రాండ్ వాహనం జాబితాలో అంబాసిడర్ కారు చేరిపోయింది. ప్రస్తుతం పాత పాస్పోర్ట్ లు, రకరకాల వస్తువులను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో 1964 నాటి అంబాసిడర్ కారు బిల్లు వైరల్ గా మారింది. అప్పట్లో అంబాసిడర్ కారు ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అప్పటి కారు బిల్లును మద్రాస్ ట్రెండ్స్ అనే ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు. ఈ కారును అక్టోబర్ 20, 1964లో కొనుగోలు చేశారు. దీని ధర అక్షరాలా రూ.16,495. దీంతో అందరూ ఆసక్తిగా ఈ పోస్టును తిలకిస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు.
ఈ వైరల్ అయిన బిల్లు ప్రకారం.. కారు ధర రూ.13, 787. సేల్స్ టాక్స్ రూ. 1493, రవాణా రుసుము రూ. 897. అదనంగా కారు నెంబర్ ప్లేటుకు రూ.7 వంటి చార్జీలను జోడించి మొత్తం రూ. 16,495కి విక్రయించినట్టుగా ఆ బిల్లులో ఉంది. కాగా ఇప్పటికీ కొంతమంది ఈ కార్లపై మమకారం వీడడం లేదు. రీ మోడలింగ్ చేసి మరి వినియోగిస్తుండడం విశేషం.