https://oktelugu.com/

Conocarpus: మొక్కే కదా అని వదిలేస్తే డేంజర్.. ఈ చెట్టు గాలి పీలిస్తే అంతే!

సాధారణంగా రోడ్డు డివైడర్ల మధ్య కోనో కార్పస్ అనే మొక్కలను విరివిగా నాటుతుంటారు. ఇళ్లల్లోనూ పెంచుతుంటారు. అందుకే నర్సరీలు సైతం అటువంటి మొక్కలను అందరికీ అందుబాటులో ఉంచుతుంటాయి.

Written By:
  • Dharma
  • , Updated On : July 5, 2024 / 07:05 PM IST

    Conocarpus

    Follow us on

    Conocarpus: ఎవరైనా పచ్చని మొక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు. స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తాయి మొక్కలు. అందుకే ఎక్కువమంది ఇంటి ప్రాంగణాల్లో సైతం మొక్కలు పెంచుతుంటారు. ఎలాంటి మొక్క అయినా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేందుకు దోహదపడుతుంది. కానీ ఏపీలో ఒక రకమైన మొక్కలు నాటొద్దని ఏకంగా అధికారులు ఆదేశాలు జారీ చేయడం విశేషం. కాకినాడ జిల్లా కలెక్టర్ వేసిన మొక్కలను సైతం తొలగించాలని ఆదేశించడం సంచలనంగా మారింది.

    సాధారణంగా రోడ్డు డివైడర్ల మధ్య కోనో కార్పస్ అనే మొక్కలను విరివిగా నాటుతుంటారు. ఇళ్లల్లోనూ పెంచుతుంటారు. అందుకే నర్సరీలు సైతం అటువంటి మొక్కలను అందరికీ అందుబాటులో ఉంచుతుంటాయి. అయితే ఈ మొక్కలు నాటొద్దని అధికారులు తాజాగా సూచిస్తున్నారు. ఈ మొక్కల కారణంగా శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయని వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా ఈ చెట్టు భూగర్భంలో జలాన్ని ఇట్టే తోడేస్తుందని.. ఒక్కసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకు దీని వేరు భూమిలోకి వెళ్లిపోయి నీరును తాగేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ కోనో కార్పస్ మొక్కల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

    ఈ మొక్కలను తెలుగులో ఏడాకుల చెట్లు అంటారు. ఇంగ్లీషులో అయితే డెవిల్ ట్రీ అని సంబోధిస్తారు. ఈ మొక్కలకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు పూస్తాయి. ఈ పువ్వుల పప్పుడి కారణంగా ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులు వస్తున్నాయి. ఈ క్రమంలో కాకినాడ ప్రాంతీయులు ఈ మొక్కల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అటవీ శాఖ సమీక్షలో పవన్ ఈ విషయంపై అధికారులకు వివరించారు. ప్రజారోగ్యం దృష్ట్యా వాటిని తొలగించాలని సూచించారు. గతంలో కూడా తన ఫామ్ హౌస్ లో ఈ చెట్లను పెంచానని.. అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తొలగించినట్లు తెలిపారు. కాకినాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 4602 మొక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని దశలవారీగా తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.