Kalisetti Appala Naidu: అమరావతికి తొలి జీతం అందించిన సామాన్య ఎంపీ కలిశెట్టి

ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలోని జీఎన్ పురం కలిశెట్టి అప్పలనాయుడు స్వగ్రామం. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన డిగ్రీ పూర్తి చేశారు. జర్నలిస్టుగా తన కెరీర్ ను ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : July 5, 2024 7:00 pm

Kalisetti Appala Naidu

Follow us on

Kalisetti Appala Naidu: ఆయన ఓ సామాన్య టిడిపి నాయకుడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. కానీ తెలుగుదేశం పార్టీ అన్నా.. అధినేత చంద్రబాబు అన్నా వల్లమాలిన అభిమానం. సుశిక్షితుడైన కార్యకర్తగా పనిచేశారు. ఎంతోమంది కార్యకర్తలను తయారు చేశారు. ఆయన అంకితభావాన్ని చూసిన చంద్రబాబు.. ఏకంగా ఎంపీ సీటు ఇచ్చి ప్రోత్సహించారు. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాదాపు రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీ అయ్యారు. ఆయనే కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టారు. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు అమరావతికి తన తొలి జీతాన్ని అందించి వార్తల్లో నిలిచారు.

ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలోని జీఎన్ పురం కలిశెట్టి అప్పలనాయుడు స్వగ్రామం. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన డిగ్రీ పూర్తి చేశారు. జర్నలిస్టుగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఈనాడు సంస్థలో సుదీర్ఘకాలం పనిచేశారు. టిడిపి సీనియర్ నాయకురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు ప్రతిభా భారతి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగు రైతు విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి, మంత్రి తమ్మినేని సీతారాం ప్రోద్బలంతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా రెండేళ్ల పాటు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2004లో టిడిపి అధికారానికి దూరమైంది. అయినా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. 2009లో చిరంజీవి పిలుపుమేరకు ప్రజారాజ్యం పార్టీలో చేరారు అప్పలనాయుడు. కానీ ఆ పార్టీలో కొద్దికాలం పాటే కొనసాగారు. దివంగత ఎర్రంనాయుడు పిలుపుమేరకు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే ఎటువంటి పదవులు దక్కలేదు. కానీ ఉత్తరాంధ్ర టిడిపి శిక్షణ శిబిరం డైరెక్టర్ గా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చారు. పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు. 2019లో ఎచ్చెర్ల టిక్కెట్ ఆశించారు.కానీ దక్కలేదు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూసినా.. పార్టీ అభివృద్ధికి నిబద్ధతగల నేతగా పాటుపడ్డారు. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు పిలిచి మరి విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చారు. ఓ సామాన్యుడికి టిక్కెట్ ఇస్తున్నానని.. గెలిపించుకోవాలని విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం లోని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.అటు అప్పలనాయుడు క్లీన్ ఇమేజ్, పార్టీ పరపతితో రెండున్నర లక్షల మెజారిటీతో గెలుపొందారు ఆయన.

సమకాలీన రాజకీయ అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి అప్పలనాయుడు. అందుకే పార్లమెంట్ తొలి సమావేశాల్లోనే అందర్నీ ఆకట్టుకున్నారు. టిడిపి గుర్తుగా ఉన్న సైకిల్ పైనే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో సైకిల్ పై ఢిల్లీలో పరుగులు పెట్టారు. జాతీయ మీడియాను సైతం ఆకర్షించగలిగారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి అమరావతి నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్రను గుర్తు చేశారు. ఎంపీగా తన తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కు అందజేశారు. మరోసారి జాతీయస్థాయిలో అమరావతి ప్రాధాన్యతను చాటి చెప్పారు. కలిశెట్టి అప్పలనాయుడు ఔదార్యతను చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని వెన్నుతట్టి ప్రోత్సహించారు పార్టీ అధినేత.