KBC 2025 Chandrapal winner: గంభీరమైన స్వరం.. ఆరు అడుగులకు మించిన ఎత్తు. ప్రతి మాట తూటలాగా ఉంటుంది. ప్రతి ప్రశ్న పద్మ వ్యూహం లాగా ఉంటుంది. ఆయన అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఆప్షన్లు చెబుతారు.. ప్రతిది కూడా సరైనదే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ తొందరపడి సమాధానం చెబితే మొదటికే మోసం వస్తుంది. అందువల్లే దానిని హాట్ సీట్ అని పిలుస్తుంటారు. ఆ సీట్లో ఆయన కూర్చొని దశాబ్దాలు దాటింది. ఆ కార్యక్రమం బుల్లితెర చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈసారి టెలికాస్ట్ అవుతున్న ఆ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ కెరియర్ లోనే ఈ ఎపిసోడ్ ఒక మైలురాయిగా మిగిలిపోతుంది.
కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమందికి ఈ కార్యక్రమం ఆర్థికంగా భరోసా ఇచ్చింది. వారిని కోటీశ్వరులను చేసింది. సమస్యలను సంధించడం.. వాటికి సరైన సమాధానాలు చెప్పిన వారిని కోటీశ్వరులను చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతం కావడానికి ప్రధాన కారణం ఆయనే. అందువల్లే ఈ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. మధ్యలో షారుక్ ఖాన్ లాంటి నటుడు ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించినప్పటికీ.. మళ్లీ ఆస్థానం అమితాబ్ బచ్చన్ ను వెతుక్కుంటూ వచ్చింది. ఇక తాజా సీజన్లో అమితాబ్ వేసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి ఏకంగా 50 లక్షలు గెలుచుకున్నాడు పంజాబ్ రాష్ట్రంలోని హుస్సేన్పూర్ ప్రాంతానికి చెందిన చందర్పాల్.
చందర్పాల్ పెద్దగా చదువుకోలేదు. వృత్తిరీత్యా కార్పెంటర్. కాకపోతే అతనికి అనేక విషయాల మీద విపరీతమైన జ్ఞానం ఉంది. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతుంటాడు. విజ్ఞానానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటాడు. అందువల్లే అమితాబ్ బచ్చన్ సంధించిన ప్రశ్నలకు సులువుగా సమాధానం చెప్పాడు. ఏకంగా 50 లక్షలు సాధించాడు. 50 లక్షల ప్రశ్నకు ఆడియన్స్ పోల్, 50 – 50 అవకాశాన్ని ఉపయోగించుకుని 50 లక్షలు సాధించాడు. వచ్చిన డబ్బుతో పిల్లల చదువు.. వ్యాపార విస్తరణ చేపడతారని చందర్పాల్ పేర్కొన్నాడు. ఇంతవరకు అమితాబ్ చాలామందిని కౌన్ బనేగా కరోడ్పతిలో ప్రశ్నలు అడిగారు. ఇప్పటివరకు 50 లక్షలు గెలుచుకున్న కార్పెంటర్ లేడు. ఆ రికార్డును చంద్రపాల్ సృష్టించాడు. అంతటి అమితాబ్ బచ్చన్ ను కదిలించాడు.. చప్పట్లు కొట్టేలా చేశాడు.