Meghalaya: తెల్లని మేఘాలు.. చుట్టూ దట్టమైన అడవులు.. వాటికి ఆశ్రయం ఇచ్చే కొండలు.. చదువుతుంటే ఎంతో బాగుంది కదూ.. అక్కడే ఉంటే ఎంతో బాగుంటుంది అనిపిస్తోంది కదూ.. అలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. Indian cultural hub అనే ఇన్ స్టా గ్రామ్ ఐడిలో ఈ వీడియో పోస్ట్ అయింది. ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సంపాదించుకుంది.. ఈ వీడియోను చూసిన వారంతా అక్కడికే వెళ్లాలని కామెంట్స్ చేస్తున్నారు.. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందంటే..
మనదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ప్రముఖంగా పేరుపొందింది మేఘాలయ. ఈ ప్రాంతం పచ్చనైన ప్రకృతికి పెట్టింది పేరు. దట్టమైన వృక్షాలు, గలగల పారే నదులు, ఆకాశాన్ని తాకే కొండలు, అంతకుమించి జంతు జాతులతో ఆ ప్రాంతం స్వర్గాన్ని మించి ఉంటుంది. వానకాలం, చలికాలం, వేసవి.. ఇలా కాలాలతో సంబంధం లేకుండా అక్కడ ప్రకృతి కొత్త దృశ్యాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ అరుదైన దృశ్యాలను చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తూ ఉంటారు.. ముఖ్యంగా వానకాలం ప్రారంభంలో అక్కడి కొండలు సరికొత్త రూపును సంతరించుకుంటాయి.
పాల వర్ణం లాంటి మేఘాలు కొండలను తాకూతూ వెళ్తూ ఉంటాయి. దట్టమైన వృక్షాలు మంచు బిందువులను ఆకులతో ఆఘ్రాణించి నెమ్మదిగా జార విడుస్తూ ఉంటాయి.. మబ్బుల చాటున సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తూ ఉంటాడు.. ఉదయం 10 దాటిన తర్వాత బయటి ప్రపంచానికి కనిపిస్తాడు.. స్వర్గం ఎలా ఉంటుందో.. అక్కడి వాతావరణం ఎలాంటి అనుభూతినిస్తుందో.. అలాంటి ఆనందం, తన్వయత్వం ఆ దృశ్యాలను చూసిన తర్వాత కలుగుతుంది.. ఇప్పటికే మేఘాలయ రాష్ట్రాన్ని ఈ వేసవికాలంలో లక్షల మంది సందర్శించారు. వాన కాలంలో ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు మరింతమంది వెళ్తున్నారు. ఇన్ స్టా లో ట్రెండ్ అవుతున్న వీడియోను లక్షల మంది చూడగా.. అంతే స్థాయిలో కామెంట్స్ చేశారు. ” సెంటీమీటర్ దూరంలో స్వర్గం.. ఇంతకు మించిన ఆనందం ఇంకెక్కడ ఉంటుందని”వ్యాఖ్యానిస్తున్నారు.