Toco Dog Man: అప్పుడేమో శునకానందం.. ఇప్పుడేమో పాండా, ఎలుగుబంటి పైత్యం.. నీకు డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా భయ్యా?

టోకో శునకానందం అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు పాండా, ఎలుగుబంటి వంటి జంతువులపై అతడి మనసు మళ్లింది. "కుక్క ఆకృతిలో పోలి ఉన్న దుస్తులను ధరించినప్పుడు ఇబ్బంది కలుగుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 31, 2024 10:11 am

Toco Dog Man

Follow us on

Toco Dog Man: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. మిగతా వారి విషయంలో ఏమో తెలియదు గాని.. ఇతడి పుర్రె మాత్రం పలు పలు విధాలుగా పోతోంది. అతని ఆలోచనా సరళిని చూస్తే వీడేంటి ఇలా ఉన్నాడేంటి అని అనిపించక మానదు. ఎందుకంటే అతను చేసిన పని అటువంటిది.. ఇంతకీ ఆయన ఏం పని చేశాడయ్యా అంటే..

అతని పేరు టోకో (పూర్తి పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. అందరూ అతనిని అలానే పిలుస్తారు). సొంత దేశం జపాన్. ఇతడికి జంతువులంటే అపారమైన ఇష్టం. ఆ ఇష్టాన్ని అందరిలా కాకుండా.. భిన్నంగా ప్రదర్శించాలి అనుకున్నాడు. ఇందులో భాగంగానే కుక్కగా మారిపోయాడు. ఏకంగా 12 లక్షలు ఖర్చు చేశాడు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. తన ఆకృతికి తగ్గట్టుగా కుక్క రూపాన్ని తయారు చేయించుకున్నాడు. ఆకృతిని తనకు అనుసంధానం చేసుకొని, కుక్కలాగా నడవడం మొదలుపెట్టాడు. దానికి సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ I want to be a animal లో పోస్ట్ చేశాడు. పైగా దాన్ని డాక్యుమెంటరీ రూపంలో చిత్రించాడు. అతడి శునక కలను 2023లో జపెట్ అనే జపనీస్ కాస్ట్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నెరవేర్చింది. ఆ కంపెనీ కుక్క ఆకృతిని రూపొందించేందుకు 40 రోజులపాటు సమయం తీసుకుంది. వాన్ కోల్ అనే కంపెనీ జపాన్ దేశంలో టీవీ సీరియల్స్ నటులకు, కమర్షియల్ యాడ్స్ లో నటించే నటీనటులకు దుస్తులు అందిస్తుంది. టోకో సంప్రదించడంతో, వాన్ కోల్ కంపెనీ కుక్క ఆకృతిని పోలిన దుస్తులను రూపొందించింది. టోకో శరీర కొలతలు తీసుకొని, దానికి తగ్గట్టుగా తయారుచేసింది. ” నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. వాటిలా ఉండాలని నాకు ఒక కోరిక. మనుషుల అస్తిపంజరం, కుక్కల అస్తిపంజరం వేరువేరుగా ఉంటాయి. అందువల్లే నేను కుక్క ఆకృతిని పోలీన దుస్తులను తయారు చేయించుకునేందుకు వాన్ కోల్ అనే కంపెనీని సంప్రదించాను. వారు నా ఆలోచనకు తగ్గట్టుగానే దుస్తులు రూపొందించారని” టోకో చెబుతున్నాడు.

టోకో శునకానందం అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు పాండా, ఎలుగుబంటి వంటి జంతువులపై అతడి మనసు మళ్లింది. “కుక్క ఆకృతిలో పోలి ఉన్న దుస్తులను ధరించినప్పుడు ఇబ్బంది కలుగుతోంది. ఆ బొచ్చులో దుమ్ము కూరుకుపోయినప్పుడు, శుభ్రం చేయాలంటే చాలా సమయం పడుతుంది.. కుక్కలాగా కదలికలు జరపాలంటే చాలా కష్టంగా ఉంటుందని” టోకో చెబుతున్నాడు. అలా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పాండా లేదా ఎలుగుబంటి, ఇతర నాలుగు కాళ్ల జంతువు లాగా మారాలని భావిస్తున్నానని టోకో చెబుతున్నాడు. టోకో వ్యవహార శైలి భిన్నంగా ఉండడం.. ఇతర జంతువుల లాగా ఉండాలని కోరుకోవడం.. ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే అతని ప్రవర్తన పట్ల మనస్తత్వ శాస్త్రవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు తెరియన్(మనుషులు.. జంతువుల్లో తమ జాతిని గుర్తించేందుకు పడే తాపత్రయం) లాగా ఉన్నాడు.. అందువల్లే అలా చేస్తున్నాడని చెబుతున్నారు..” ఇలాంటి కోరికలు మనుషుల్లో చాలా అరుదుగా ఉంటాయి. అలాంటప్పుడు వారిని భిన్నంగా చూడకూడదు. వారి ఉత్సుకతను ఎగతాళి చేయకూడదు. ఇలాంటప్పుడు ఆంత్రోఫోమోర్ఫిక్, తెరియన్ ల మధ్య తేడాలు గుర్తించాలని” పిట్స్ బర్గ్ లోని డుక్వెస్నే యూనివర్సిటీ సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎలిజబెత్ ఫీన్ పేర్కొన్నారు.