H1B Visa: అగ్రరాజ్యం అమెరికా హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేస్తామని ఇటీవలే ప్రకటించింది. చెప్పినట్లుగానే చేసింది. ఈమేరకు 2024, ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం(యూఎస్‌సీఐఎస్) మై యూఎస్‌సీఐఎస్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ పద్ధతిలో హెచ్–1బీ వీసా ప్రాసెస్ మరింత సులభతరం అయ్యేలా ఆర్గనైజేషనల్ అకౌంట్‌ను వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది.
అది ఉంటేనే అమెరికాకు..
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు తమ ప్రాజెక్టు పనుల నిమిత్తం ఉద్యోగులను అమెరికా పంపిస్తుంటాయి. ఇందుకోసం ఉద్యోగులకు హెచ్–1బీ వీసా తప్పనిసరి. ఇప్పుడు ఆ హెచ్–1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రాజెస్ వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టింది బైడెన్ ప్రభుత్వం. ఇందులో భాగమైన మై యూఎస్‌సీఐఎస్‌లోని ఆర్గనైజేషనల్ అకౌంట్‌లో సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు, లీగర్ అడ్వయిజర్లు హెచ్1–బీ వీసా రిజిస్ట్రేషన్, హెచ్–1బీ పిటిషిన్ ప్రాసెస్ చేయొచ్చు.
కొత్త పద్ధతిలో మరింత ఈజీ..
జోబైడెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మై యూఎస్‌సీఐఎస్ పద్ధతి హెచ్–1బీ వీసా పిటిషనర్లకు వరంగా మారుతుందని వీసా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కొత్త వీసా ప్రాజెసలో సంస్థలే హెచ్–1బీ ప్రాసెస్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, పిటిషన్స్‌తోపాటు ఫాం ఐ–907కి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించవచ్చు.
ఇమిగ్రేషన్ ప్రయోజనాలు..
మై యూఎస్‌సీఐఎస్ డేటా ఆధారంగా అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్) అధికారులు వలసదారుల అర్హతను బట్టి ఇచ్చే ఇమిగ్రేషన్ ప్రయోజనాలు కల్పించాలా వద్దా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
కొత్త అకౌంట్ తప్పనిసరి..
మార్చి, 2024 నుంచి సంస్థలు హెచ్–1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాజెస్‌లో పాల్గొనడానికి కొత్త ఆర్గనైజేషనల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ పిటిషన్లను ఫైల్ చేయాలనుకునేవారికి ఈ దశ చాలా అవసరం.
ఫాం ఐ–907 అంటే?
ఇక కొత్త విధానంలో కీలకం ఫాం ఐ–907. ఇందులో కొంత మొత్తాన్ని చెల్లించి వీసా ప్రీమియం ప్రాసెస్ సర్వీసులు పొందవచ్చు. భారతీయులు అమెరికాలో పనిచేయడానికి హెచ్–1బీ వీసా తప్పనిసరి. ఈ హెచ్–1బీ వీసా అప్లయ్ చేయడాన్ని హెచ్–1బీ రిజిస్ట్రేషన్ అంటారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఎంపికైన అభ్యర్థులు తర్వాత జరిగే ప్రాజెస్‌ను హెచ్–1బీ పిటిషన్ అంటారు.