Ugadi Celebration: అమెరికా(America)లోని తెలుగువారు సొసైటీల ద్వారా పరస్పర సహకారం అందించుకుంటున్నారు. ఇందుకోసం తానా(TANA), నాట్స్(NATS)తోపాటు వివిధ సొసైటీలు పనిచేస్తున్నాయి. పండుగలు, ఉత్సవాలతోపాటు, వివిధ సేవా కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. తెలుగువారు అమెరికాలో విస్తరిస్తుండడంతో సొసైటీలను విస్తరిస్తున్నారు. తాజాగా నాట్స్ మేరీల్యాండ్ రాష్ట్ర విభాగం ఏర్పాటు చేశారు.
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) మేరీల్యాండ్(Mari Land) రాష్ట్ర విభాగాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ నూతన చాప్టర్ సమన్వయకర్తగా వకుల్ మోరే, సంయుక్త సమన్వయకర్తగా విశ్వ మార్ని, మహిళా సాధికారత సమన్వయకర్తగా హరిణి నార్ల, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా సువర్ణ కొంగల్లలు నియమితులయ్యారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఉగాది(Ugadi) వేడుకలను నిర్వహించారు, ఇందులో తెలుగు సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద నృత్యాలు, కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.
మేరీల్యాండ్ అభివృద్ధికి కృష్టి..
మేరీల్యాండ్ చాప్టర్ ప్రారంభ కార్యక్రమంలో సైక్స్‌విల్లే మేయర్ స్టేసీ లింక్(Stsi Link) మాట్లాడుతూ, మేరీల్యాండ్ అభివృద్ధిలో తెలుగు సమాజం కృషిని కొనియాడారు. సమాజాన్ని ఏకం చేయడంలో సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సైక్స్‌విల్లే డౌన్‌టౌన్ కనెక్షన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ డీఈఐ(DEI) ఆఫీసర్ జూలీ డెల్లా-మరియా అభిప్రాయపడ్డారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి(Madan Pamulapati) నూతన చాప్టర్ సభ్యులను సభకు పరిచయం చేశారు, అలాగే నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
నాట్స్ కార్యక్రమాలకు మద్దతు..
ఈ సందర్భంగా ప్రెసిడెంట్(ఎలెక్ట్) శ్రీహరి మందాడి మాట్లాడుతూ, మేరీల్యాండ్ నాట్స్ విభాగం భవిష్యత్ కార్యక్రమాలకు జాతీయ నాయకత్వం పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ భాగవతుల, బోర్డ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి (ఫిల్లీ), ఉపాధ్యక్షులు హరి తదితరులు పాల్గొన్నారు.
మేరీల్యాండ్ చాప్టర్ ప్రారంభం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని తెలుగు సమాజంలో మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముందడుగుగా నిలిచింది. ఉగాది వేడుకలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ, సమాజ సభ్యులను ఒకతాటిపైకి తెచ్చాయి. ఈ చాప్టర్ ద్వారా స్థానిక తెలుగు వారి కోసం సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు నాట్స్ సన్నాహాలు చేస్తోంది.