Ram Mandir: అయోధ్య రామ మందిరం ఫీవర్ భారత దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది. దేశ విదేశాల్లో సైతం శ్రీరామ నామ జపంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. రామ నామం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్య పడుతున్నాయి. తమ దేశంలో సైతం ప్రజలు రోడ్డుపైకి వచ్చి శ్రీరామ నామస్మరణ చేస్తుండడాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్ లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మోగింది. ప్రవాస భారతీయులు మన దేశ సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అక్కడ బిల్ బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి లైవ్ లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు
అటు విదేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మసాచుసెట్స్ లోని వర్సస్టార్ నగర మేయర్ జో పెట్టీ హిందూ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్ లోని ప్రవాస భారతీయులు సైతం ప్యారిస్ లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం ఈఫిల్ టవర్ వద్దకు వచ్చి జైశ్రీరామ్ నినాదాలు చేశారు. మారిషాస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ దేశ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ ప్రత్యేక సందేశం ఇచ్చారు.’ శ్రీరాముడు అయోధ్యకు తిరిగివస్తున్న వేళ మనమంతా సంతోషిద్దాం. మన మార్గంపై వెలుగులు ప్రసరింపజేసి శాంతి, శ్రేయస్సు వైపు అడుగులు వేసేలా ఆయన బోధనలు, ఆశీస్సులు కొనసాగాలని ప్రార్థిద్దాం’ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇలా విదేశాల్లో సైతం మన శ్రీరాముడు సందడి చేస్తుండడం విశేషం.